రేప్ కేసులో అరెస్టు: బెయిల్‌పై వచ్చి రేప్ బాధితురాలిని, తల్లిని ట్రాక్టర్‌తో గుద్ది హత్య

V6 Velugu Posted on Jul 20, 2020

గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టయిన నిందితుల్లో ఒకడు బెయిల్‌పై విడుదలై ఆ అత్యాచార బాధితురాలిని, ఆమె తల్లిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో జరిగింది. అతడిని మళ్లీ అరెస్టు చేసి హత్య కేసు పెట్టినట్లు చెప్పారు పోలీసులు. నిందితుడిని యశ్‌వీర్‌గా గుర్తించామని తెలిపారు. ఓ ఆర్థిక వివాదంతో మొదలైన గొడవ రెండు కుటుంబాల్లో హత్యలు, అత్యాచారాల వరకు దారితీసింది. కాస్‌గంజ్‌లోని అమర్పూర్‌కు చెందిన యశ్‌వీర్ తండ్రిని కొన్నేళ్ల క్రితం రేప్ బాధితురాలి తండ్రి, మరికొందరు కలిసి హత్య చేసిన ఆరోపణలపై అరెస్టయ్యారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో జరిగిన గొడవలో అతడిని చంపినట్లు అప్పట్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో అతడు జైలులో ఉండగా యశ్‌వీర్, తన స్నేహితులతో కలిసి అతడి కుమార్తెపై గ్యాంగ్ రేప్ చేశాడు. దీంతో వారిపై బాధితురాలి తల్లి కేసు పెట్టింది. యశ్‌వీర్ సహా మరికొందరు నిందితులను పోలీసు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ఇటీవలే బెయిల్‌పై విడుదలైన యశ్‌వీర్ పగతో రేప్ బాధితురాలిని, ఆమె తల్లిని హత్య చేశాడు. గత బుధవారం వారిద్దరూ మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన స్థానికులు రెండు మృతదేహాలను రోడ్డుపై పెట్టి ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం చేస్తామని సర్దిచెప్పి నిరసన విరమింపజేశారు పోలీసులు. ప్రత్యేక టీమ్స్ ఏర్పడి గాలింపు చేపట్టి యశ్‌వీర్‌ను గురువారం నాడు అరెస్టు చేశారు. అతడిపై హత్య కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని, కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు కాస్‌గంజ్ ఎస్పీ.

Tagged mother, Rape, UP, bail, tractor, Rape victim

Latest Videos

Subscribe Now

More News