సివిల్స్​తో టాప్​ సర్వీస్​

సివిల్స్​తో టాప్​ సర్వీస్​

ఇండియన్‍ బ్యూరోక్రసీలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్‍, ఐపీఎస్‍, ఐఎఫ్‍ఎఎస్‍ లాంటి మొత్తం 24 కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు వీలు కల్పించే సివిల్ సర్వీసెస్‍ ఎగ్జామినేషన్‍ – 2023 నోటిఫికేషన్‍ను యూనియన్‍ పబ్లిక్ సర్వీస్‍ కమిషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 1105 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సివిల్స్ నోటిఫికేషన్, సెలెక్షన్​ ప్రాసెస్​, ఎగ్జామ్​ ప్యాటర్న్​ గురించి తెలుసుకుందాం..

ప్రభుత్వ శాఖల్లో చేరి, ప్రజా సేవ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులకు సివిల్స్​ మంచి అవకాశం,  ఉన్నతమైన హోదాతో పాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు వీటి ప్రత్యేకత.  సివిల్​ సర్వీస్​ అభ్యర్థులకు ఉండాల్సిన కనీస విద్యార్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీలో మార్కుల శాతం కనీసం ఇంత ఉండాలనే రూల్​ ఏమి లేదు. జనరల్‍ అభ్యర్థులు 6 సార్లు, ఓబీసీలు 9, దివ్యాంగులు 9 సార్లు పరీక్ష రాసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు అటెంప్ట్స్ పై పరిమితి లేదు. 

ఎగ్జామ్​ ప్యాటర్న్ 

ప్రిలిమ్స్​: సివిల్స్ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరుగుతుంది.  ప్రిలిమినరీ పరీక్షలో జనరల్‍ స్టడీస్‍ (పేపర్-1), సివిల్‍ సర్వీసెస్‍ ఆప్టిట్యూడ్‍  టెస్ట్ (పేపర్-2) ఆబ్జెక్టివ్‍ పద్ధతిలో నాలుగు వందల మార్కులకు ఉంటాయి. సమయం రెండు గంటలు. పేపర్‍ 2 క్వాలిఫైయింగ్‍ పేపర్‍. దీనిలో కనీసం 33 శాతం మార్కులు రావాలి. ప్రిలిమ్స్ మార్కులను మెరిట్‍లో పరిగణనలోకి తీసుకోరు. నెగెటివ్‍ మార్కింగ్‍ ఉంది. 

మెయిన్స్​: ఇందులో 9 పేపర్లుంటాయి. ఇందులో మొదటి విభాగంలో 300 మార్కుల చొప్పున పేపర్​–ఎ (ఇండియన్​ లాంగ్వేజ్​), పేపర్​–బి(ఇంగ్లిష్​) ఉంటాయి. ఇవి కేవలం అర్హత పేపర్లు, కనీసం 75 మార్కులు సాధించాలి. అన్ని పేపర్లు డిస్క్రిప్టివ్​ విధానంలో రాయాల్సి ఉంటుంది. రెండో విభాగంలో మొత్తం ఏడు పేపర్లుంటాయి. జనరల్​ ఎస్సే, నాలుగు జనరల్​ స్టడీస్​(జీఎస్​) పేపర్లు, ఆప్షనల్​ పేపర్లు రెండు ఉంటాయి. ప్రతి పేపర్​కు 250 మార్కుల చొప్పున మొత్తం 1750 మార్కులు ఉంటాయి. అభ్యర్థి పూర్తి స్థాయి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. వీటిని ఇంగ్లీష్​ లేదా ఎనిమిదో షెడ్యూల్​లో ఉన్న ఏదైనా ఒక భాషలో రాయవచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగులో రాసే అవకాశం ఉంది.

ఇంటర్వ్యూ: మెయిన్స్​​లో ఉత్తీర్ణులైన వారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్​ను దృష్టిలో పెట్టుకొని పోస్టుకు ఇద్దరు చొప్పున ఇంటర్వ్యూకు సెలెక్ట్​ చేస్తారు. ఇది 275 మార్కులుంటుంది. అంటే మెయిన్స్​, ఇంటర్వ్యూకు కలిపి మార్కులు 2025. ఈ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఉమ్మడి ప్రిపరేషన్​.. ఆప్షనల్​ కీలకం

సివిల్స్ పరీక్షకు యూపీఎస్సీ నుండి ప్రకటన వెలువడిన నాటి నుంచి కూడా మెయిన్స్​ కోణంలోనే ప్రిపరేషన్​ కొనసాగించాలి. మ్యాథ్స్​ మీద పట్టులేని అభ్యర్థులు సీశాట్​పై దృష్టి పెట్టాలి. ఆప్షనల్​లో రెండు పేపర్లపై ఫోకస్​ చేయాలి. అభ్యర్థులు సొంత మెటీరియల్​ ప్రిపేర్​ చేసుకొని ఎక్కువసార్లు రివిజన్​ చేసుకోవాలి. ఆప్షనల్ సబ్జెక్టు ఏదైప్పటికీ పీజీ స్థాయిలో ప్రిపరేషన్​ ఉంటేనే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. సివిల్స్​ మెయిన్స్​లో రైటింగ్​కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ప్రిపరేషన్​ మొదలుపెట్టిన నాటి నుంచే డిస్క్రిప్టివ్​ అప్రోచ్​ ఉంటే విజయం సాధించవచ్చు. పరీక్ష రాసే క్రమంలో.. అనలిటికల్​ అప్రోచ్​తో రాసే సమాధానాలకు బలమైన కారణాలు ప్రస్తావిస్తూ.. విశ్లేషిస్తూ రాయాలి. సమకాలీన అంశాలను ఉదహరించడం వల్ల ఎక్కువ స్కోర్​ చేయవచ్చు.

నోటిఫికేషన్​

అర్హతలు: అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే. వయసు 21 నుంచి 32 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌‌డ్ కేటగిరీకి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలెక్షన్​: రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్‌‌ ఆఫ్‌‌ రిజర్వేషన్‌‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్‌‌లైన్ ద్వారా ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్​ పరీక్ష మే 28న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.upsc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌‌

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 150 పోస్టులతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌‌ ఎగ్జామినేషన్‌‌-2023 నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ(యానిమల్ హస్బెండరీ అండ్‌‌ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథ్స్​, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ) లేదా బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్, ఫారెస్ట్రీ) విద్యార్హత ఉండాలి.

అర్హత: 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ప్రిలిమ్స్​, మెయిన్స్​, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 21 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్స్​తో పాటు ఫారెస్ట్​ సర్వీస్​కు ఒకటే ప్రిలిమ్స్​ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్​, ఇంటర్వ్యూ వేర్వేరుగా ఉంటుంది.

ప్లాన్​ చేయండిలా..

మొదటిసారి పరీక్ష రాస్తున్న అభ్యర్ధులు 40 రోజుల పాటు  జనరల్ స్టడీస్ చదవడం వల్ల  ప్రిలిమినరీ తో పాటు మెయిన్స్‌‌కు ఎంతో ఉపయోగపడుతుంది. మిగతా 80 రోజులు ప్రిలిమినరీకి సంబంధించిన సిలబస్‌‌ ప్రిపేరవుతూ కరెంట్ అఫైర్స్‌‌ను జనరల్ స్టడీస్‌‌తో లింక్​  చేస్తూ చదవాలి. మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు ప్రీ మైండ్‌‌తో రాయడం సానుకూల అంశం. రెండో సారి సివిల్స్‌‌ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్న వారు ముందు పరీక్ష రాసిన అనుభవం ఉన్నందున ఎక్కువ టైమ్ ప్రాక్టీస్‌‌కు ఉపయోగించాలి. వీరు మొదటి 60 డేస్‌‌ ప్రిలిమినరీ తో పాటు మెయిన్స్‌‌కు సంబంధించిన అంశాలు చదువుతూ మిగతా 60 రోజులు పూర్తిగా ప్రిలిమినరీపై దృష్టి పెట్టాలి.  ఇది వరకు ప్రిలిమ్స్‌‌ క్వాలిఫై అయి మెయిన్స్‌‌కు అర్హత  సాధించిన అభ్యర్ధులు మొదటి 60 రోజులు పూర్తిగా జనరల్ స్టడీస్ కోణంలో చదువుతూ కరెంట్‌‌ అఫైర్స్‌‌కు అనుసంధానం చేసుకోవాలి. ఈ టైమ్‌‌లో ఎస్సే పేపర్‌‌‌‌ను కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. మిగిలిన 60 రోజులు ప్రిలిమినరీ పరీక్షపై దృష్టి పెట్టాలి.