అమెరికాలో మరో నల్లజాతీయుడిని కాల్చి చంపిన పోలీసులు

అమెరికాలో మరో నల్లజాతీయుడిని కాల్చి చంపిన పోలీసులు
  • నిరసనలకు దిగిన స్థానికులు
  • బాధ్యతవహిస్తూ అట్లాంటా పోలీస్ చీఫ్​ రిజైన్

వాషింగ్టన్: అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు చనిపోయాడు. అక్కడి కాలమానం ప్రకారం శనివారం రాత్రి 27 ఏళ్ల రేషార్డ్ బ్రూక్స్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసు ఆఫీసర్ కాల్పులు జరపడంతో అతడు చనిపోయాడు. దీంతో అట్లాంటాలో పెద్దపెట్టున నిరసనకారులు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేశారు. ఇప్పటికే జార్జి ఫ్లాయిడ్ మృతిపై యూఎస్ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. పోలీసుల కాల్పుల్లో మరొకరు చనిపోయిన ఘటన ప్రజల ఆందోళనలను మరింత ఉదృతం చేసింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ నగర పోలీస్ చీఫ్ వెంటనే తన ఉద్యోగానికి రిజైన్ చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

వెండీస్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ముందర బ్రూక్స్.. పార్క్ చేసిన తన కారులో నిద్రిస్తున్నాడు. అయితే, అతను పార్క్ చేసిన వెహికల్ తో ఇతర వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని ఆ రెస్టారెంట్ ఓనర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరకున్న పోలీసులు కారులో ఉన్న బ్రూక్స్ ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే అతడు మద్యం మత్తులో ఉన్నాడని, అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటించాడని జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. ఈ క్రమంలో పోలీసుల వద్ద ఉన్న టేజర్ ను లాక్కుని బ్రూక్క్స్ పారిపోతుండగా పోలీసుల కాల్చారని తెలిపారు. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా ట్రీట్​మెంట్ పొందుతూ చనిపోయాడని, ఈ ఘటనలో ఒక అధికారి గాయపడినట్లు బ్యూరో తెలిపింది.