
- ఇండియాను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు
- ట్రంప్ కామెంట్లకు విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టి కౌంటర్
న్యూఢిల్లీ: ఇండియాపై మరిన్ని సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్లకు విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉక్రెయిన్ వివాదం చెలరేగిన తర్వాత తాము రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించామని, అప్పుడు అమెరికా మద్దతుగా నిలిచిందని సోమవారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో గుర్తు చేసింది. అప్పుడు ఆయిల్ ఇంపోర్ట్‌ను ఎంకరేజ్ చేసిందని, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నదని మండిపడింది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామన్న కారణంగా ఇండియాను అమెరికా, ఈయూ టార్గెట్ చేసిందని ఫైర్ అయింది.
ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని.. చాలా అన్యాయమని తెలిపింది. ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగానే ఇండియా ముందుకు వెళ్తున్నదని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇండియాను టార్గెట్ చేయడం దారుణమని చురకలు అంటించింది. ఇండియన్ కన్జ్యూమర్లకు తక్కువ ధరకు ఇంధనం అందించాలన్న లక్ష్యంతోనే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామని తెలిపింది. రష్యా నుంచి చాలా దేశాలు ఆయిల్‌ను ఇంపోర్ట్ చేసుకుంటున్నాయని గుర్తు చేసింది. అమెరికాను వ్యతిరేకించే చాలా దేశాలు రష్యాతో వాణిజ్యపరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని తెలిపింది.
2024లో యూరోపియన్ యూనియన్ రష్యాతో సుమారు రూ.6 లక్షల కోట్ల వ్యాపారం చేసిందని గుర్తు చేసింది. రష్యా, ఇండియా మధ్య ఉన్న వ్యాపారంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని తెలిపింది. ఈయూ.. 2024లో ఎల్ఎన్జీ ఇంపోర్ట్ 16.5 టన్నులు అని వివరించింది. యూరప్, రష్యా మధ్య కేవలం ఇంధనమే కాకుండా.. ఎరువులు, మైనింగ్ ప్రొడక్ట్స్, కెమికల్స్, ఐరన్, స్టీల్, ట్రాన్స్పోర్ట్ మిషనరీ వ్యాపారం జరుగుతున్నదని తెలిపింది. అమెరికా కూడా రష్యా నుంచి కీలక ఉత్పత్తులను ఇంపోర్ట్ చేసుకుంటున్నదని తెలిపింది. న్యూక్లియర్ ఇండస్ట్రీస్ కోసం యూరేనియం హెక్సాఫ్లోరైడ్ ను, ఈవీ ఇండస్ట్రీ కోసం పల్లాడియంను, ఫర్టిలైజర్లు, కెమికల్స్‌ను ఇలా ఎన్నో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నదని తెలిపింది.