
వాషింగ్టన్: ఇండియా డిఫెన్స్ కు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే రష్యా నుంచి ఎస్ 400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య రక్షణ సహకారంపై దీని ప్రభావం పడుతుందని హెచ్చరించింది. రష్యాతో మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ డీల్ తో ఇండియా, అమెరికా రక్షణ సంబంధాలపై ప్రభావం చూపుతుందని వారం కిందటే అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ సర్కారు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. రష్యాకు చెందిన ఎస్-400 మిస్సైల్ సిస్టమ్ సుదూర టార్గెట్స్ ను చేధించగలదు. భూమ్మీద నుంచి ఆకాశంలోని ఎలాంటి లక్ష్యాన్నైనా చేధిస్తుంది. 2014లోనే రష్యా నుంచి చైనా ఈ తరహా క్షిపణులను కొనుగోలు చేసింది. గతేడాది అక్టోబర్ లో ప్రధాని మోడీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య జరిగిన చర్చల తర్వాత 5 బిలియన్ డాలర్లతో ఈ మేరకు డీల్ కుదిరింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖలోని సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ అఫేర్స్ ఆఫీసర్ అలైస్ జీ వేల్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఏ దేశంతో చేయలేనన్ని యుద్ధవిన్యాసాలు ఇండియాతో చేశాం. ట్రంప్ పాలన ఇండియా డిఫెన్స్ అవసరాలు తీర్చేందుకు రెడీగా ఉంది. ఇండియాను మేజర్ డిఫెన్స్ పార్టనర్ గా అమెరికన్ కాంగ్రెస్ కూడా గుర్తించింది. గడిచిన పదేళ్లలో ఇండియాతో అమెరికా డిఫెన్స్ వాణిజ్యం జీరో నుంచి 18 బిలియన్ డాలర్లకు పెరిగింది. రష్యా నుంచి ఎస్ 400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు డీల్ తో బలమైన సంబంధాలు ఎలా సాధ్యం? హిస్టరికల్ గా చూస్తే ఆయుధాల కోసం ఇండియా రష్యాపై ఆధారపడుతోంది. ఇండియాలో మిలిటరీ హార్డ్ వేర్ లో దాదాపు 65 నుంచి 70 శాతం డిఫెన్స్ పరికరాలు రష్యాకు చెందినవే. భాగస్వామ్య ఒప్పందాల్లో ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఇండియాకు ఎక్కువ సంఖ్యలో మిలిటరీ ఎక్విప్ మెంట్ ఆఫర్ చేస్తున్నాం. కామ్ కాసా (సీఓఎంసీఎస్ఏఎస్ఏ) ఒప్పందంపై సంతకాలు చేశాం. సైనిక సంబంధాల బలోపేతానికి ప్రయత్నిస్తున్నాం. ఎస్ 400 విషయంలో ఏ దేశానికి మినహాయింపు లేదు. దీనిపై సీరియస్ గా ఉన్నాం” అని ఆమె అన్నారు.