అభివృద్ధి పనులను యజ్ఞంలా తలపెట్టాం :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అభివృద్ధి పనులను యజ్ఞంలా తలపెట్టాం :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలి 
  • లోపాలుంటే కఠిన చర్యలు  
  • మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి

హుజూర్ నగర్/కోదాడ, వెలుగు: అభివృద్ధి పనులను యజ్ఞంలా తలపెట్టామని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ లో రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న హౌసింగ్ కాలనీ, అడ్వాన్స్ డ్​టెక్నాలజీ సెంటర్, ఐటీఐ, జూనియర్, డిగ్రీ కళాశాలల భవన నిర్మాణ పనులను శనివారం పరిశీలించారు. హుజూర్ నగర్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాల్లో తలెత్తుతున్న వివాదాలపై ఆరా తీశారు.

అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో రూ.4,776 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. వాటిని నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాల్లో లోపాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్డీవో సూర్యనారాయణ, ఆర్అండ్ బీ  ఎస్ఈ సీతారామయ్య, పీఆర్ ఈఈ వెంకటయ్య, తహసీల్దార్ నాగార్జున రెడ్డి, హౌసింగ్ ఎస్ఈ వెంకటదాస్ రెడ్డి, డీఈ జగన్, ఏఈ సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘రాజీవ్ శాంతినగర్’ పూర్తవ్వాలి

అనంతగిరి మండలం శాంతినగర్ లో  రాజీవ్ శాంతినగర్​ఎత్తిపోతల పథకం యుద్ధ ప్రాతిపదికన పూర్తవ్వాలని  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాలేరు వాగుపై రూ.52 కోట్లతో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ ఎత్తిపోతల ద్వారా అనంతగిరి మండలంలోని 7 గ్రామాల్లో 3,129 ఎకరాలు, కోదాడ మండలంలోని 3 గ్రామాల్లో 1,781 ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. ఇరిగేషన్ సీఈ రమేశ్​బాబు, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ హిమబిందు తదితరులున్నారు.

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

మఠంపల్లి, వెలుగు: మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి సూచించారు. మఠంపల్లి మండల కేంద్రంలో శనివారం  కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. అడిషన్ కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో సూర్యనారాయణ, కాంగ్రెస్​సీనియర్ నాయకులు సుబ్బారావు, యారగాని నాగన్న గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు మంజీ నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.

డిసెంబర్ లోగా ‘అయిటిపాముల’ పూర్తి

నల్గొండ, కట్టంగూర్​(నకిరేకల్​), వెలుగు: అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులను డిసెంబర్ లోగా పూర్తి చేసి, 8 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం నకిరేకల్ నియోజకవర్గంలోని అయిటిపాముల వద్ద రూ.100 కోట్లతో చేపట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు.

ఒకవేళ భూసేకరణ సాధ్యం కాకపోతే పైప్​లైన్ ద్వారా నీరిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాలపై స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో మాట్లాడి, ఒప్పించాలని సూచించారు. ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.. అయిటిపాముల ఎత్తిపోతలకు ఆసిఫ్ నగర్ ను లింక్ చేయాలని, పిల్లాయిపల్లి కాలువ ద్వారా చెరువులు నింపాలని కోరారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సీఈ అజయ్ కుమార్, ఉదయ సముద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో అశోక్ రెడ్డి తదితరులున్నారు.