కాంగ్రెస్​తోనే మహిళా సాధికారత: ఉత్తమ్ పద్మావతి

కాంగ్రెస్​తోనే మహిళా సాధికారత: ఉత్తమ్ పద్మావతి

స్వతంత్ర భారతదేశంలో మహిళల సాధికారత గురించి ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు రాజీవ్​గాంధీ.  పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పిస్తూ 1989లో రాజీవ్ గాంధీ మొదటిసారి బిల్లులను ప్రవేశ పెట్టారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు1993లో ఆ బిల్లులకు కొన్ని సవరణలు చేసి మరోసారి సభలో ప్రవేశ పెట్టి ఆమోదింపజేసి చట్టంగా మార్చారు. ఆ తర్వాత పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్​ కల్పించే బిల్లును హెచ్‌‌డీ దేవెగౌడ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం1996లో ప్రవేశపెట్టింది. తర్వాత మహిళల రిజర్వేషన్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలనే అంశంపై ఏకాభిప్రాయం కుదరక బిల్లు ముందుకు పోలేదు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, సంకీర్ణ ప్రభుత్వ ఎజెండాలో ఈ బిల్లును చేర్చారు. అసెంబ్లీలు, లోక్‌‌సభల్లో మహిళలకు మూడొంతుల రిజర్వేషన్ల చట్టం తీసుకొచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పుడూ కుదరలేదు.108వ రాజ్యాంగ సవరణ బిల్లును 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారు. ఇది 2010లో రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ లోక్‌‌సభలో ఆమోదం పొందలేకపోయింది. ఇలా చరిత్రను పరిశీలిస్తే.. కాంగ్రెస్​పార్టీ మహిళా రిజర్వేషన్​కోసం చేసిన కృషి అర్థమవుతుంది.

మహిళల ప్రాతినిధ్యం పెరగాలి

మహిళా రిజర్వేషన్​ బిల్లును పార్టీలు వేటికవే.. తాము గొప్పతనంగా క్లెయిమ్​ చేసుకుంటున్నాయి. అందులో తప్పు ఉందని నేను అనుకోవడం లేదు కానీ.. మహిళల సాధికారత గురించి మొట్టమొదట ఆలోచించింది, ఐడియాను తీసుకొచ్చింది మాత్రం ముమ్మాటికీ కాంగ్రెస్​ పార్టీనే.. కాబట్టి ఆ పేటెంట్​ఎప్పుడూ హస్తం పార్టీదే. రాజీవ్​గాంధీ చొరవతో స్థానిక సంస్థల్లో మహిళలకు వచ్చిన అవకాశంతో.. ఈరోజు దేశ‌‌వ్యాప్తంగా సుమారు15 ల‌‌క్షల మంది మ‌‌హిళ‌‌లు స్థానిక ఎన్నిక‌‌ల్లో నేతలుగా ఎదిగారు. మహిళా రిజర్వేషన్​వచ్చినా.. మహిళలు సీట్లలో మాత్రమే ఉంటారు.. రాజకీయం అంతా వారి భర్తలే నడిపిస్తారనే సందేహం వ్యక్తమవుతున్న మాట వాస్తవం. కానీ ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. క్రమంగా సమాజంలో మార్పు వస్తున్నది. మహిళలు కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ.. నాయకులుగా ఎస్టాబ్లిష్​ అవుతున్నారు. కాంగ్రెస్​ పార్టీ నీడలో నా లాంటి ఎందరో మహిళలు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రేపటి రోజు చట్టం వచ్చి వారికి అవకాశాలు పెరిగితే మరింత మంది మహిళలు విధానపర నిర్ణయాల్లో భాగస్వాములవుతారు. సహజంగా సమర్థ ఆర్థిక నిర్వహణతో, కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ.. కుటుంబ భవిష్యత్​ గురించి ఆలోచించే మహిళలు.. అధికారంలో ఉంటే తప్పకుండా సమాజానికి, జాతికి మేలు జరుగుతుంది. ప్రగతిశీల సమసమాజం నిర్మితమవుతుంది.

బీజేపీకి చిత్తశుద్ధి లేదు

ఇప్పుడు కేంద్రంలోని ఎన్​డీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ ​బిల్లు పెట్టడాన్ని కాంగ్రెస్​ పార్టీ సమర్థిస్తున్నది. అయితే 2014, 2019 రెండుసార్లు అధికారంలోకి వచ్చి పూర్తి మెజార్టీ కలిగిన బీజేపీ.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముందు అకస్మాత్తుగా బిల్లు పెట్టడం, పెట్టిన బిల్లును డీలిమిటేషన్, సెన్సెస్ ​జరిగిన తర్వాత అమలు చేస్తామనడం మహిళా సాధికారతపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని శంకించేలా చేస్తున్నది. నిజంగా చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని కోరుకుంటే.. తొమ్మిదేండ్లుగా బిల్లు పెట్టి ఎందుకు ఆమోదం పొందేలా చేయలేదు? పార్లమెంట్​ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఒక నినాదం కావాలనే ఉద్దేశంతోనే స్వార్థపూరితంగా ఆలోచించి.. నూతన పార్లమెంట్, మహిళా రిజర్వేషన్​ అనే అంశాలను తెరమీదకు తెచ్చింది తప్ప.. నారీశక్తిపై వాళ్లకు గౌరవం ఉందని నేను అనుకోవడం లేదు. నిజంగా ఎన్​డీఏకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వచ్చే ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి. ఇప్పటికే మూడు దశాబ్దాలు ఆలస్యమైంది కాబట్టి.. వెంటనే కులాల ఆధారిత జనగణన చేపట్టి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కాంగ్రెస్​ పార్టీ డిమాండ్​ చేస్తున్నది. ఇంకా ఆలస్యమైతే మహిళలు మరింత నష్టపోతారు. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్​లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ సబ్​కోటా పెట్టాల్సిన అవసరం ఉన్నది.

– ఉత్తమ్ ​పద్మావతి రెడ్డి,

మాజీ ఎమ్మెల్యే