చైనాలో మూడేండ్ల పిల్లలకు వ్యాక్సిన్

చైనాలో మూడేండ్ల పిల్లలకు వ్యాక్సిన్

బీజింగ్: చైనాలో మూడేండ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూడేండ్ల నుంచి పదహేడేండ్ల మధ్య వారికి సినోవ్యాక్ కంపెనీ తయారు చేసిన కరోనావ్యాక్‌‌‌‌ టీకా అత్యవసర వాడకానికి పర్మిషన్ వచ్చిందని ఆ కంపెనీ చైర్మన్ యిన్ వైడంగ్ ప్రకటించారు. అయితే ఈ టీకాను ఎప్పటి నుంచి అందుబాటులోకి తేవాలన్న దానిపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఇప్పటికే పిల్లలపై రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని, కరోనావ్యాక్ పిల్లల్లోనూ సురక్షితంగా, సమర్థవంతంగా పని చేస్తోందని తెలిపారు. సినోవ్యాక్ కంపెనీ వ్యాక్సిన్‌‌‌‌కు జూన్ 1నే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌‌‌వో) ఆమోదం తెలిపింది. కాగా, ఇప్పటి వరకు చైనాలో 76.3 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేసినట్లు ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.