న్యూఢిల్లీ: జాతీయ గేయం వందేమాతరం 150 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. వందే మాతరం కేవలం పశ్చిమ బెంగాల్‌కు చెందినది మాత్రమే కాదన్నారు. దీన్ని భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధులు ఆలపించారని తెలిపారు. బంకిం చంద్ర చటర్జీ బెంగాలీలో రాశారని.. అయినంత మాత్రాన ఇది అక్కడికే పరిమితం కాదన్నారు.
రహస్య సమావేశాల్లో వందేమాతరంతో చర్చలు మొదలుపెట్టేవారని, సరిహద్దుల్లో సైనికులు, పోలీసులు దీన్ని ఆలపిస్తారని పేర్కొన్నారు. దేశరక్షణలో తమ జీవితాన్ని త్యాగం చేసేటప్పుడు వారు స్మరించేది వందేమాతరమే అని చెప్పారు. ‘‘ఈ చర్చ బెంగాల్ ఎన్నికల కోసమే అని కొందరంటున్నారు. ఇది వందేమాతరం ఉన్నతిని తగ్గించడమే, గేయాన్ని అవమానించడమే” అని విమర్శించారు.
గేయాన్ని కాంగ్రెస్ విభజించింది
1937లో కాంగ్రెస్ వందేమాతరం గేయాన్ని విభజించిందని అమిత్ షా ఆరోపించారు. ఒక వర్గాన్ని బుజ్జగించడం కోసం కాంగ్రెస్అవలంభించిన అనుకూల విధానం (అపీజ్మెంట్పాలసీ)లో భాగంగా గేయాన్ని రెండు ముక్కలు చేసిందన్నారు. కేవలం మొదటి రెండు స్తోత్రాలు పాడితే చాలని నిర్ణయించారని విమర్శించారు. చివరకు ఆ బుజ్జగింపు విధానాలే దేశవిభజనకు దారితీశాయన్నారు. వందేమాతరంపై చర్చ అవసరమని.. ఈ అమృతకాలంలో దేశ అభివృద్ధికి అది నినాదం అవుతుందన్నారు.
ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్‌పై అమిత్షా విమర్శలకు రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే స్ట్రాంగ్‌కౌంటర్ ఇచ్చారు. వందేమాతరంను స్వాతంత్ర్యోద్యమంలో నినాదంగా చేసిందే కాంగ్రెస్‌పార్టీ అన్నారు. ఆ సమయంలో మీ పార్టీ స్వాతంత్ర్య సమరానికి, దేశభక్తి గీతాలకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్నారు.
‘‘1921లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించినప్పుడు లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ‘వందే మాతరం’ అని నినదిస్తూ జైళ్లకు వెళ్లారు. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు..? బ్రిటిష్ వాళ్ల పక్షాన ఉండి వారి కోసం పనిచేశారు. మీరు నిరంతరం గాంధీజీని, నెహ్రూను అవమానించడం, తిట్టడమే పనిగా పెట్టుకున్నరు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

