
కోడిగుడ్డు పగలకొట్టి.. గిలక్కొట్టి ఉప్పు, కారం కలిపి.. పాన్ మీద కొంచెం నూనె వేసి కాల్చుకుంటే ఆమ్లెట్ రెడీ, అయితే, ఆమ్లెట్ అంటే ఇంతేనా? ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి. వెజ్, నాన్‌వెజ్, పాలక్.. ఇలా ఒకటేమిటి కొత్తగా ట్రై చేస్తే ఆమ్లెట్ కూడా కొత్తగా ఉంటుంది. ఇప్పడు వాటి గురించి తెలుసుకుందాం. . .
టొమాటోతో ఆమ్లెట్ తయారీకి కావలసినవి
- కోడిగుడ్లు: రెండు
- టొమాటోలు: రెండు
- ఉల్లిపా యలు: ఒకటి
- పచ్చిమిర్చి : నాలుగు
- కొత్తిమీర కట్ట: ఒకటి
- ఉప్పు: తగినంత
- నూనె:సరిపడా
తయారీ విధానం: టొమాటోలను సన్నగా చక్రాల్లా కోసి, గింజల్ని తీసేయాలి.. ఒక గిన్నెలో కోడి గుడ్డు సొన వేసి ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి కోడిగుడ్డు మిశ్రమాన్ని అమ్లెట్ లా వేయాలి. పైన టొమాటో ముక్కల్ని వరసగా పెట్టి కొద్దిగా లోపలికి నొక్కాలి వీటిపై కొత్తమీర తురుము వేసి సన్నని మంట పై ఐదు నిమిషాలు వేగించాలి. ఆమ్లెట్ ను రెండో వైపు కూడా కొద్దిగా వేగిస్తే టొమాటో అమ్లెట్ రెడీ..
చికెన్ కీమాతో ఆమ్లెట్ తయారీకి కావలసినవి
- చికెన్ కీమా: ఒక కప్పు
- కోడిగుడ్లు: మూడు
- ఉప్పు: రుచికి తగినంత
- నూనె వేగించడానికి : సరిపడా
- టొమాటో గుజ్జు : నాలుగు టీ స్పూన్లు
- స్వీట్ రెడ్ చిల్లీ సాస్: ఒకటిన్నర టీ స్పూన్
తయారీ విధానం: గిన్నెలో కోడి గుడ్లు పగలగొట్టి ఇందులోనే ఉప్పు వేసి బాగా గిలక్కొ ట్టాలి. స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఇందులోనే షెజ్వాన్ సాస్, టొమాటో గుజ్జు వేసి రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసి కలిపి చికెన్ మెత్తగా ఉడికే వరకు చిన్న మంట మీద ఉడికించి పక్కన పెట్టాలి. మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి కోడిగుడ్ల మిశ్రమంతో ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ మీద సగభాగం చికెన్ కీమా మిశ్రమం వేసి అమ్లెట్ సగానికి మడిచి రెండో వైపు కాల్చుకుంటే
వేడి వేడి చికెన్ కీమా ఆమ్లెట్ రెడీ.
ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఆమ్లెట్ తయారీకి కావాల్సినవి
- కోడిగుడ్లు: నాలుగు
- టొమాటో ప్యూరీ: రెండు కప్పులు
- ఉల్లిపాయ తరుగు ఒక కప్పు
- అల్లం వెల్లుల్లి పేస్టు: రెండు టీ స్పూన్లు
- కొత్తిమీర తురుము : ఒక టీ స్పూన్
- శనగపిండి: రెండు టీస్పూన్లు
- గరం మసాలా: ఒక్క టీ స్పూన్
- కొబ్బరి పాలు: ఒక కప్పు
- కారం : ఒక టీ స్పూన్
- పసుపు: చిటికెడు
- జీలకర్ర : ఒక టీ స్పూన్
- నూనె: తగినంత
- ఉప్పు : రుచికి సరిపడా
తయారీ విధానం: ఒక గిన్నెలో కోడిగుడ్డు పగలగొట్టి అందులో కొంచెం శెనగపిండి, కొత్తమీర తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ మీద పాన్ పెట్టి కోడిగుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసి వేగించి పక్కన పెట్టాలి. ఆమ్లెట్ చల్లారాక సైజుల్లో ముక్కలుగా కోయాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం నూనె వేసి జీలకర్ర, ఉల్లి తరుగు వేగించాలి. అందులోనే టొమాటో గుజ్జు. అల్లం వెల్లులి పేస్ట్ బాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా వేగిన తర్వాత కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు వేసి ఉడికించాలి. అందులోనే కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. ఇది మరుగుతున్నప్పుడు ఆమ్లెట్ ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి.
పాలకూరతో ఆమ్లెట్ తయారీకి కావలసినవి
- కోడిగుడ్లు : రెండు
- ఉల్లిపాయ : ఒకటి
- పాలకూర తరుగు : నాలుగు టీ స్పూన్లు
- పచ్చిమిర్చి: రెండు
- అల్లంవెల్లుల్లి ముద్ద: చిటికెడు
- గరం మసాలా : చిటికెడు
- మిరియాల పొడి : చిటికెడు
- ఉప్పు: తగినంత
- నూనె: ఒక టీస్పూన్
తయారీ విధానం: పాలకూరని శుభ్రంగా కడిగి ఆరబె ట్టాక సన్నగా తరగాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరగాలి స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ, పాలకూర, పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొంచెం సేపు వేగించి దించేయాలి. ఒక గిన్నెలో ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, ఒక స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఇందులోనే వేగించిన పాలకూర మిశ్రమం వేసి కలపాలి. గుడ్లు వేసి బాగా సురగ వచ్చేలా గిలక్కొట్టాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి గుడ్డు మిశ్రమంతో కొంచెం మందంగా ఆమ్లెట్ వేసి రెండు వైపులా కాల్చాలి
వెజిటబుల్స్‌తో ఆమ్లెట్ తయారీకి కావాల్సినవి
- కోడిగుడ్లు : నాలుగు
- బీటీ రూట్ : ఒకటి
- క్యాప్సికమ్: ఒకటి
- క్యాబేజీ తురుము : రెండు టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయ : ఒకటి
- టొమాటోలు: రెండు
- బీన్స్: నాలుగు
- పచ్చిమిర్చి: ఆరు
- కొత్తమీరకట్ట : ఒకటి
- ఉప్పు : తగినంత
- పసుపు: చిటికెడు
- నూనె : సరిపడా
తయారీ విధానం: కూరగాయ ముక్కల్ని కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేగించాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, ఉడికించిన కూరగాయ ముక్కలు వేసి బాగా కలిని వెంటనే దించాలి. కోడిగుడ్లు బాగా గిలక్కొట్టి పక్కన పెట్టాలి. స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి కోడిగుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్ వేయాలి. దాని పై కూరగాయ ముక్కలు, కొత్తిమీర వేసి ఒకవైపు గోధుమ రంగు వచ్చే వరకు వేగిస్తే చాలు.
క్యారెట్, స్వీట్ కార్న్ తో ఆమ్లెట్ తయారీకి కావాల్సినవి
- క్యారెట్: రెండు
- స్వీట్ కార్న్ గింజలు: యాభై గ్రాములు
- కోడిగుడ్లు. రెండు
- ఉల్లిపాయ: ఒకటి
- పచ్చిమిర్చి : ఐదు
- కొత్తిమీర తరుగు: పావు కప్పు
- ఉప్పు: రుచికి తగినంత
- నూనె : సరిపడా
తయారీ విధానం: స్వీట్ కార్న్ ను ఉడికించి పక్కన పెట్టాలి. క్యారెట్, ఉల్లిపాయ. పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేగించాలి. అందులోనే క్యారెట్ తురుము వేసి మరో రెండు నిమిషాలు వేగించాలి.. తర్వాత ఉప్పు, కొత్తిమీర తరుగు. ఉడికించిన స్వీట్ కార్న్ వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కోడి గుడ్డు పగలకొట్టి బాగా గిలక్కొట్టాలి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆమ్లెట్వేసి కాస్త వేగాక ముందుగా చేసుకున్న క్యారెట్, స్వీట్ కార్న్ -మిశ్రమాన్ని వేసి బాగా వేగించాలి. ఆమ్లెట్ రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు. . .
-–వెలుగు,లైఫ్–