
వినాయకుడికి కుడుములు, ఉండ్రాళ్లు అంటే బోలెడంత ఇష్టం. ఇవేకాదు బొజ్జగణపయ్యకు బోలెడు ఇష్టాలున్నాయి. అందుకే భోజనప్రియుడైన గణపయ్యకు రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ నైవేద్యాల్లో, పాల ఉండ్రాళ్లు, పూర్ణం కుడుములు, ఉండ్రాళ్ల తాలింపు ... వంటి కొన్ని వెరైటీలు ఇవి...
పాల ఉండ్రాళ్లు
కావాల్సినవి : బియ్యప్పిండి: 80 గ్రాములు; నీళ్లు: పావులీటర్; నెయ్యి/ వెన్న: ఒక టేబుల్ స్పూన్; ఉప్పు: చిటికెడు; పాలు: అర లీటర్; చక్కెర: 120 గ్రాములు; కొబ్బరి తురుము: పావు కప్పు; యాలకుల పొడి: అర టీ స్పూన్
తయారీ : బియ్యప్పిండి జల్లెడ పట్టాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, గోరు వెచ్చగా కాగబెట్టాలి. నీళ్లలో చిటికెడు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి/వెన్న, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా ముద్దలా చేయాలి. పిండి చల్లారాక చిన్న చిన్న ఉండలు చేయాలి. మరో వెడల్పాటి గిన్నెలో పాలు మరగబెట్టాలి. ఆ పాలలో కొబ్బరి, యాలకుల పొడి, చక్కెర వేసి అది కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఉండ్రాళ్లను కాగుతున్న పాలలో వేసి ఐదు నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. స్టవ్ ఆపేసి, పది నిమిషాలు గిన్నె కదిలించకుండా ఉంచితే ఉండ్రాళ్లు విరిగిపోవు.
ఉండ్రాళ్ల తాలింపు..
కావాల్సినవి : బియ్యప్పిండి: ఒక కప్పు, నీళ్లు: ఒక కప్పు, ఉప్పు: చిటికెడు, నెయ్యి: ఒక టీ స్పూన్, ఆవాలు: అర టీ స్పూన్, జీలకర్ర: అర టీ స్పూన్, మినప్పప్పు: ఒక టీ స్పూన్, శెనగపప్పు: ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి: మూడు, కరివేపాకు: ఒక రెమ్మ, నూనె: సరిపడా
తయారీ : ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. అందులో కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి మరిగించాలి. మంట తగ్గించి బియ్యప్పిండి వేస్తూ కలపాలి. నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ పిండిని ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టి ముద్దగా చేయాలి. దాంతో చిన్నచిన్న ఉండ్రాళ్లుగా చేయాలి. నూనె రాసిన ఇడ్లీ ప్లేట్ మీద వీటిని ఉంచి ఆవిరిపై ఉడికించాలి. తర్వాత స్టవ్‌పై పాన్‌పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు, పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. ఆ పోపుని ఉండ్రాళ్లలో వేసి కలపాలి. ఉండ్రాళ్ల పాయసంతోపాటు ఈసారి ఉండ్రాళ్లతో తాలింపు ట్రై చేయండి.
పూర్ణం కుడుములు
కావాల్సినవి : శెనగపప్పు: ముప్పావు కప్పు, బెల్లం- తురుము: ఒక కప్పు, ఎండు కొబ్బరి తురుము:- అర కప్పు, బియ్యప్పిండి:- ఒకటిన్నర కప్పు, ఇలాచీ పొడి:- ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: చిటికెడు, నెయ్యి: సరిపడా
తయారీ : శెనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. కొద్దిసేపయ్యాక పప్పులో ఉన్న నీటిని పారబోసి పక్కనపెట్టాలి. స్టవ్‌పై ఒక గిన్నె పెట్టి, అందులో బెల్లం తురుము, సరిపడా నీళ్లు పోసి పాకం పట్టాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన శెనగపప్పు, ఎండుకొబ్బరి తురుము, ఇలాచీ పొడి వేసి పది నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం గట్టి పడ్డాక స్టవ్ ఆపేయాలి. అది చల్లారిన తర్వాత ఉండలుగా చేసి ఒక ప్లేట్‌లో వేయాలి. తర్వాత మరో గిన్నెలో కొద్దిగా నెయ్యి, ఉప్పు, బియ్యప్పిండి, సరిపడా గోరువెచ్చని నీళ్లు పోసి కలపాలి. చేతికి నూనె రాసుకుని బియ్యప్పిండి మిశ్రమాన్ని పల్చటి బిళ్లలుగా వత్తి, మధ్యలో శెనగపప్పు ఉండల్ని పెట్టి గుండ్రంగా చేయాలి. నూనె లేదా నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలో ఈ కుడుములను పెట్టి పదిహేను నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి.
పులిహోర
కావాల్సినవి : అన్నం: మూడు కప్పులు, చింతపండు గుజ్జు: పావు కప్పు, బెల్లం తురుము: ఒక టీ స్పూన్ (కావాలంటే), మినప్పప్పు: ఒక టీ స్పూన్, శెనగపప్పు: ఒక టీ స్పూన్, ఆవాలు: అర టీ స్పూన్, జీలకర్ర: అర టీ స్పూన్, మెంతులపొడి: అర టీ స్పూన్, పల్లీలు: కొద్దిగా ఇంగువ: చిటికెడు, పచ్చిమిర్చి: నాలుగు, ఎండుమిర్చి: నాలుగు, జీడిపప్పు పలుకులు: అర టేబుల్ స్పూన్ (కావాలంటే), పసుపు: అర టీ స్పూన్, కరివేపాకు: ఒక రెమ్మ
తయారీ : ఒక గిన్నె లో అన్నం వేసి చల్లార్చాలి. ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కలపాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు, కరివేపాకు, పసుపు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, మెంతుల పొడి, ఇంగువ వేసి పోపు పెట్టాలి. ఆ పోపును అన్నంలో వేసి కలపాలి.