వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి రేపు

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి  జయంతి రేపు

భారతమాత ఎందరో వీరులను, వీరవనితలను  కన్నతల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేకమంది సమర యోధులు ఈ గడ్డపై జన్మించారు స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను పణంగా తల్లి భారతి పాదాల చెంత సమర్పించారు.  ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ అనే రాజ్యానికి ఆమె రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది.

 బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ రాణిగా ప్రసిద్ధికెక్కినది. "జోన్ ఆఫ్ ఆర్క్" గా భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా ఆమె నిలిచిపోయింది. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 19 నవంబరు 1828న మహారాష్ట్రకు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీ బాయి. 1842లో ఝాన్సీ రాజు గంగాధరావు నెవల్కార్​తో  వివాహం జరిగింది.

వారసుడు లేకుండానే కొద్దికాలానికే రాజు గంగాధరరావు అనారోగ్యంతో మరణించాడు. లక్ష్మీబాయి తన భర్త చివరి కోరిక మేరకు దామోదరరావు అనే అబ్బాయిని దత్తత తీసుకుంది. అయితే, దత్తత  చెల్లదని ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని తము కలిపేసుకుంటామని తెలిపింది. ‘నిన్ను  ప్రేమించడాని కన్నా ముందు.. నేను నా దేశాన్ని ప్రేమించాను లక్ష్మీ. నేనున్నా, పోయినా నా దేశం ఉండాలి. ’ అని చెప్పిన భర్త చివరి మాటలు లక్ష్మీబాయికి గుర్తుకొచ్చాయి. ఝాన్సీ రాజ్య రక్షణ కోసం యుద్ధం చెయ్యడానికి సిద్ధపడింది.  

బ్రిటిష్​ సేనల వెన్నులో వణుకు

బ్రిటిష్​ సైన్యం 1858లో ఝాన్సీని ముట్టడించింది. లక్ష్మీబాయి తన సైన్యంతో బ్రిటిష్​ సేనలకు వ్యతిరేకంగా భీకర పోరాటానికి సిద్ధమైంది. ఝాన్సీ రాణిగా లక్ష్మీబాయి  కదన రంగంలోకి దూకింది. స్వరాజ్య రక్షణ కోసం బొబ్బిలిలా గర్జించింది. అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి బ్రిటిష్​వారి వెన్నులో వణుకు పుట్టించింది. నడుముకు తన దత్తపుత్రుడుని కట్టుకుని శత్రుసేనలపై పోరాటం చేసింది. రెండు వారాల హోరాహోరీ యుద్ధం అనంతరం బ్రిటిష్​ సైన్యం ఝాన్సీ రాజ్యాన్ని కైవసం చేసుకున్నది.

దీంతో శత్రు మూకల తాకిడి ఎక్కువయ్యే సరికి 50 అడుగుల కోట గోడ దూకి శత్రువుకు చిక్కకుండా తప్పించుకుంది. గ్వాలియర్ చేరుకుని స్వతంత్ర పోరాటంలో తన సహచరులైన నానా సాహెబ్ పీష్వా తదితరులను కలుసుకుంది.  అయితే అక్కడ కూడా శత్రువులు దాడి చెయ్యడంతో ఎదురు పోరాటంలో  తీవ్రంగా గాయపడింది. శత్రువు చేతికి చిక్కకూడదు అని రణరంగం  నుంచి  రక్తం  కారుతున్న తీవ్రగాయాలతో  బాబా గంగదాస్ ఆశ్రమం చేరుకున్నది. బ్రిటిష్ వారికి  తన శవం  కూడా చిక్కకూడదు అని స్వామీజీతో చెప్పి ప్రాణాలు వదిలింది.  

మహిళా లోకానికి స్ఫూర్తి లక్ష్మీబాయి

నేతాజీ సుభాశ్ చంద్రబోస్​ తన ఇండియన్​ నేషనల్​ ఆర్మీ  ‘ఆజాద్​ హింద్ ఫౌజ్’లో  మహిళా విభాగానికి ఝాన్సీ రెజిమెంట్​అని పేరు పెట్టారు. భారత వీరనారిల ఘన చరిత్ర గురించి ప్రస్తావిస్తూ.. ప్రముఖ మరాఠా కవి బిఆర్ తాంబే  వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి పోరాట పటిమ తెలిసేలా ఆమెకు నివాళి అర్పిస్తూ  ఒక గీతం రాశారు. ‘ఇక్కడే ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమ జ్వాల ఆరిపోయింది.  ఇప్పుడు ఆమె ఇక్కడ శాశ్వత విశ్రాంతి తీసుకుంటుంది. ఆగి రెండు కన్నీటి బొట్లు జారవిడువండి.’ అని గీతంలో పేర్కొన్నారు. లక్ష్మీబాయి చూపిన ధైర్యం, పరాక్రమం భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి  నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకం. 

–డి. సంధ్య