
జైలులో ఉన్న సమయంలోనే 1948 జనవరి 26న వీహెచ్దేశాయి ‘ది డెమోక్రట్’ అనే పత్రికను ప్రారంభించారు. రాత్రంతా కూర్చొని తన చేతి రాతతో వార్తలు రాసి, దానికి సంబంధించిన బొమ్మలు గీసి, ఇంగ్లిష్ భాషలో పత్రికను జైలు అధికారులకు తెలియకుండా రహస్యంగా నడిపారు. అప్పటికే జైలులో ఉన్న దేశభక్తుల్లో దాశరథి కృష్ణమాచార్యులు, పండిట్నరేంద్రజీ, బిద్రీచంద్, కంది శ్రీనివాస్‌రావు, నరేంద్ర ప్రసాద్సక్సేనా, కామ్రేడ్ ఏఆర్ వీ చారి, దత్తాత్రేయ ప్రసాద్, బొజ్జం నరసింహులు తదితరులు ‘ది డెమోక్రట్’లో వ్యాసాలు రాసేవారు. ఈ పత్రికను ఒకరు చదివిన తర్వాత మరొకరు చదివేవారు. ‘‘మనం చేస్తున్న పోరాటం సామన్యమైనది కాదు.. భారత స్వాతంత్ర్య సమరంలో ఆఖరు ఘట్టం. తుపాకీ గుండు నా గుండెలో దూరి నేను ప్రాణం వదిలే సమయంలో కూడా స్వాతంత్ర్య పతాకాన్ని పట్టుకునే ఉంటా”అంటూ స్టేట్‌కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ ఇచ్చిన సందేశాన్ని దేశాయి ‘ది డెమోక్రట్’ 1948 జులై 16 సంచికలో ప్రచురించి నాయకుల్లో స్ఫూర్తి నింపారు. జైలులో పత్రిక ద్వారా ఎన్నో విషయాలపై నాయకుల్లో చైతన్యం తీసుకువచ్చిన దేశాయి.. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ‘ది డెమోక్రటిక్’ను హైదరాబాద్స్వాతంత్ర్య సమరంలో అమరులైన వీరులకు అంకితం చేశారు.
‘బంధిఖానలో బంధింప బడిగూడ
కలము బలము చూపగలిగినాడు
వ్రాత పత్రికను నిరాటంక పథమున
నడిపి గుండె బలము నిడినవాడు’
‘త్యాగ ధనుడతండు; తన జీవితమ్మును
జాతి కంకితమ్ము సలిపినాడు;
పదవి కోరలేదు; స్వాతంత్ర్య సమరాన
వీరసైనికుడయి వెలిసినాడు’
అని .. దాశరథి కృష్ణమాచార్యులు వీహెచ్దేశాయి ఔన్నత్యాన్ని కొనియాడారు. ‘దేశాయికి సహచరుణ్ని కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని గుర్తు చేసుకున్నారు.
– కాశెట్టి కరుణాకర్,వెలుగు ప్రతినిధి