
విజయవాడ భారీ బంగారం చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బంగారం చోరీ కేసులో ఇంటిదొంగల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
విజయవాడ నగరంలోని ఓ నగల దుకాణంలో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. వన్‌టౌన్ లోని సాయిచరణ్ జ్యుయలరీ లాకర్ లో 7 కిలోల (రూ. 3 కోట్ల విలువైన)బంగారం, రూ. 30 లక్షల నగదును దొంగలు మాయం చేశారు. లాకర్ కు సెక్యూరిటీగా గార్డ్ గా రాజస్థాన్ కు చెందిన విక్రమ్ కుమార్ లోహియా విధులు నిర్వహిస్తున్నారు.
అయితే శుక్రవారం రిలీవర్ వచ్చే సమయానికి విక్రమ్ కుమార్ పై దాడి చేసి కుర్చీలో బంధించి ఉండడంతో విధులు నిర్వహించేందుకు వచ్చిన మరో సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ..గంటల వ్యవధిలో రాజస్థాన్‌కు చెందిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ప్రకాశం బ్యారేజ్ వద్ద పట్టుకున్నారు. నిందితులకు గాయపడ్డ విక్రమ్ సింగ్‌కు సంబంధం ఉన్నట్టు గుర్తించారు. విక్రమ్ సింగ్ కావాలనే సీన్ క్రియేట్ చేసి దొంగతనం చేయించినట్టు పోలీసులు భావిస్తున్నారు. రెండు నెలల క్రితమే విక్రమ్ సింగ్ షాపులో పనికి చేరినట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన షాప్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌లో నమోదయ్యే డీవీఆర్ (డిజిటల్ వీడియో రికార్డర్) పరికరాన్ని నిందితులు కాల్వలో పడేశారు. డిజిటల్ వీడియో రికార్డర్‌ను పోలీసులు గుర్తించి, తమ వెంట తీసుకువెళ్లారు. ఈ కేసులో ఇంకెవరి హస్తం ఉందా అన్నకోణం లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.