పట్నం బాట పట్టిన పల్లేవాసులు

పట్నం బాట పట్టిన పల్లేవాసులు

ఊర్లు వదిలి పట్నానికి

రాష్ట్రంలో వచ్చే పదేండ్లలో సగం మంది పట్నాల్లోనే..

ఇప్పుడు పట్నాల్లో ఉంటున్నోళ్లు కోటిన్నరకు పైనే..

ఉపాధి అవకాశాలు, మెరుగైన చదువు, వైద్య సౌకర్యాల కోసమే వలసలు

ఉన్న నగరాల విస్తరణ..  కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతోనూ ఎఫెక్ట్

రాష్ట్రంలో పట్నం జనాభా పెరుగుతోంది. బతుకుదెరువు కోసం వలసలు, ఉద్యోగ అవకాశాలు, పిల్లల చదువుల కోసం చాలా మంది పల్లెలను వదిలి పట్నం బాట పడుతున్నరు. రాష్ట్రంలో పాలనా సంస్కరణలు, సౌకర్యాలతో మేజర్​ గ్రామ పంచాయతీలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా అప్​గ్రేడ్​ అవుతున్నాయి. రాష్ట్రంలో గత ఐదేండ్లుగా అర్బనైజేషన్  వేగం మరింత ఊపందుకుంది.

పట్టణ జనాభా లెక్కలను పరిశీలిస్తే.. దేశ సగటు కంటే రాష్ట్రంలో శాతం, పెరుగుదల సగటు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఏండ్లుగా ఇదే ట్రెండ్​ కొనసాగుతోంది. 1961లో తెలంగాణలోని మొత్తం జనాభాలో పట్టణ జనాభా 19.27 శాతంకాగా.. దేశ సగటు 17.97 శాతమే. 2001లో రాష్ట్ర సగటు 31.79 శాతం ఉంటే దేశ సగటు 25.49 శాతం, 2011లో రాష్ట్ర సగటు 34.65 శాతం అయితే.. దేశ సగటు 31.15 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో పట్టణ జనాభా 41.2 శాతానికి చేరింది. రాబోయే పదేండ్లలో ఇది 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని సోషియో ఎకనమిక్​ సర్వేలో అంచనా వేశారు.

కొత్త జిల్లాలు.. కొత్త పట్టణాలు

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా 21 ద్వితీయ శ్రేణి పట్టణాలు జిల్లా కేంద్రాలుగా ఉనికిలోకి వచ్చాయి. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, గ్రామాల నుంచి సమీప పట్టణాలకు వలసలు పెరగడంతో పట్టణాల రూపురేఖల్లో మార్పులు వచ్చాయి. ప్రధానంగా విద్యాసంస్థలు, హాస్పిటళ్ల సేవలు చిన్నచిన్న పట్టణాలకు విస్తరిస్తున్నాయి. జాతీయ రహదారుల నిర్మాణం తర్వాత ఆదిలాబాద్, నిర్మల్, నాగర్​ కర్నూల్​లాంటి చిన్న పట్టణాలు కూడా వేగంగా విస్తరించాయి. అలాగే నేషనల్​ హైవేల వెంట ఉన్న నిజామాబాద్, మహబూబాబాద్, కామారెడ్డి, కొత్తగూడెం, సిద్దిపేట, కరీంనగర్, సూర్యాపేట, జనగామ, ఖమ్మం, జగిత్యాల, మంచిర్యాల, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా కేంద్రాల్లో జనాభా పెరుగుదల, పట్టణాల అభివృద్ధి వేగంగా జరుగుతున్నాయి.

సగం మంది ​హైదరాబాద్​లోనే..

ఒకప్పుడు హైదరాబాద్​కు పట్నం అనే పదం సర్వనామంగా ఉండేది. మిగతా జిల్లాల వాళ్లు పట్నం పోతున్నమంటే హైదరాబాద్​కే అయి ఉండేది. ఇప్పుడు పాత జిల్లా కేంద్రాలన్నీ పెద్ద నగరాలుగా మారాయి. ఇక రాష్ట్రంలోని మొత్తం అర్బన్​ జనాభాలో సగానికిపైగా జనాభా ఒక్క హైదరాబాద్  నగరంలోనే ఉండటం విశేషం. దాంతోపాటు హైదరాబాద్​ శివారు మున్సిపాలిటీల్లోనే మరో పదిశాతం మేర జనాభా ఉంటారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు, ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడమే దీనికి కారణం. రాష్ట్రంలోని మొత్తం పట్టణ జనాభా 1.49 కోట్లుకాగా.. 71.75 లక్షలు హైదరాబాద్​ కోర్​ సిటీ జనాభానే కావడం గమనార్హం. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ జిల్లా వంద శాతం పట్టణ జనాభాను కలిగి ఉంది. మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో 70.22 శాతం, రంగారెడ్డి జిల్లాలో 57.70 శాతం జనాభా పట్టణ జనాభానే.

వేగంగా విస్తరిస్తున్నయ్..

గత ఇరవై ఏండ్లుగా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం వంటి పట్టణాలు పెద్ద నగరాలుగా అప్​గ్రేడ్​ అయ్యాయి.

హైదరాబాద్​ తర్వాత అత్యధికంగా గ్రేటర్​ వరంగల్ నగరంలో 7.20 లక్షల జనాభా ఉంది. తర్వాతి స్థానంలో ఉన్న నిజామాబాద్​లో 3.20 లక్షలు, కరీంనగర్​లో 3 లక్షలు, రామగుండంలో 2.50 లక్షల జనాభా ఉంది.

రాష్ట్రంలో గతంలో ఉన్న 68 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్లకుతోడు కొత్తగా 60 మున్సిపాలిటీలను, 13 కార్పొరొషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఒకప్పుడు పంచాయతీలుగా ఉన్న అనేక గ్రామాలు హైదరాబాద్‌‌లో కలిసిపోవడంతో ఇది 20 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది.

హైదరాబాద్​ శివార్లలోని మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను కలిపి బడంగ్‌‌‌‌‌‌‌‌పేట, బండ్లగూడ జాగీర్‌‌‌‌‌‌‌‌, మీర్‌‌‌‌‌‌‌‌పేట, బోడుప్పల్‌‌‌‌‌‌‌‌, ఫీర్జాదిగూడ, జవహర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, నిజాంపేట పంచాయతీలను మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పట్టణాభివృద్ధి వేగంగా ఉన్నట్టు ‘సెంటర్ ఫర్ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ స్టడీస్’​ గతంలో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

For More News..

తెలంగాణ నుంచి రాజ్యసభకు వారిద్దరేనా?

ఏపీ పంపిస్తామన్నా.. తెలంగాణ తీసుకెళ్లట్లేదు..

ఇయర్ ఫోన్స్ కొంటే.. కారు గెలిచారని ఫోన్

రేవంత్ పోరాటంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు