మా గ్రామంలో ప్రచారం చేయడానికి వీల్లేదు: గ్రామస్తులు

మా గ్రామంలో ప్రచారం చేయడానికి వీల్లేదు: గ్రామస్తులు

ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ లీడర్లపై ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో లీడర్లు ఎన్నికల ప్రచారానికి ఏ గ్రామానికి వెళ్లినా.. ఇన్ని సంవత్సరాలు ఏం చేశారని.. ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ ప్రజలు లీడర్లను నిలదీస్తున్నారు. 

తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని వట్టినాగుల పల్లిలో బీఆర్ఎస్ ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. మా గ్రామంలో ప్రచారం చేయడానికి వీల్లేదంటూ.. లీడర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు.   

గతంలో మా ఓట్లు అవసరం లేదన్న ఎమ్మెల్యే.. ఇప్పుడు ప్రచారం ఎలా చేస్తారంటూ నిలదీశారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విప్రోలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయలేదని... అలాగే అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత బంధు ఇవ్వలేదని.. ప్రభుత్వ పథకాలన్ని ఎమ్మెల్యే వర్గీయులకే అప్పజెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తమ గ్రామంలో అభివృద్ధి పనులను తామే చేసుకుంటాం.. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈరోజు(నవంబర్ 14) ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రంగారెడ్డి జిల్లా వట్టినాగుల పల్లి గ్రామంలో ప్రచారం చేయాల్సి ఉండగా.. గ్రామస్తుల గొడవతో ఎమ్మెల్యే ఆ గ్రామానికి రాలేకపోయారు.