ఒక్కో పోస్టుకు రూ.11 కోట్లు ఇస్తున్నారనేది పచ్చి అబద్ధం: విరాట్ కోహ్లీ

ఒక్కో పోస్టుకు రూ.11 కోట్లు ఇస్తున్నారనేది పచ్చి అబద్ధం: విరాట్ కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భారీ మొత్తం ఆర్జిస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. 256 మిలియన్ల ఫాలోవర్స్ కలిగివున్న కోహ్లీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకు రూ.11.45 కోట్లు ఆర్జిస్తున్నాడన్నది ఆ వార్తల సారాంశం. చివరకు ఈ వార్త కోహ్లీని చేరింది. దీనిపై స్పందించిన విరాట్.. ఒక్క ట్వీట్‌తో ఇందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు.

ఇటీవల హాపర్ హెచ్‌క్యూ అనే సంస్థ.. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ ఖాతాను ఏకంగా 256 మిలియన్ల (25 కోట్లకు పైగా) మంది అనుసరిస్తున్నట్లు, తద్వారా అతను ఒక కమర్షియల్ పోస్ట్ ద్వారా రూ.11.45 కోట్లు సంపాదిస్తున్నట్లు పేర్కొంది. ఈ వార్తలను కోహ్లీ కొట్టి పారేశారు.

"నా జీవితంలో ఇప్పటి వరకు నేను అందుకొన్న ప్రతి దానికి రుణపడి ఉంటాను. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నా సోషల్ మీడియా సంపాదన గురించి ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.." అని కోహ్లీ ట్వీట్ చేశాడు.

అగ్రస్థానంలో క్రిస్టియానో రొనాల్డో

హాపర్ హెచ్‌క్యూ నివేదిక ప్రకారం.. ఇన్‌స్టా సంపాదనలో ఫుట్‌బాల్‌ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో (599 మిలియన్‌), మెస్సి (482 మిలియన్‌) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. రొనాల్డో ఒక్కో పోస్టుకు రూ.26.76 కోట్లు వసూలు చేస్తుండగా.. మెస్సి రూ.21.49 కోట్లు వసూలు చేస్తున్నారు. కాగా, కోహ్లీ నికర విలువ  రూ.1000 కోట్లకు పైనే ఉంటుందని ఇటీవల స్పోర్టికో వెల్లడించిన విషయం తెలిసిందే.