కౌలు రైతులకు రైతుబంధు ఇయ్యాలె

కౌలు రైతులకు రైతుబంధు ఇయ్యాలె
  • ఇతర రాష్ట్రాల్లోని రైతులకు కేసీఆర్ పరిహారం ప్రకటిస్తున్నరు
  • మరి తెలంగాణ రైతుల ఆత్మహత్యలు కనిపిస్తలేదా?
  • కాళేశ్వరంతో మేఘా కృష్ణారెడ్డి ప్రపంచ కుబేరుడైండు
  • భూములిచ్చిన రైతులు మాత్రం సర్వస్వం కోల్పోయిన్రని ఆవేదన

కాటారం/మహదేవపూర్, వెలుగు: కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వాలని, పీఎం ఫసల్​ బీమా అమలు చేయాలని, అప్పుడే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గుతాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. నేషనల్ లీడర్ కావాలని ఉబలాటపడుతున్న సీఎం కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లోని రైతులకు పరిహారం ప్రకటిస్తున్నారని, కానీ తెలంగాణ రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆయన కళ్లకు కనబడటం లేదని విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహదేవపూర్ మండలాల్లో వివిధ కారణాలతో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను సోమవారం బీజేపీ రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డితో కలిసి వివేక్ పరామర్శించారు. బాధితులకు ఆర్థిక సాయం అందించారు. మహదేవపూర్ మండలంలోని అంబట్ పల్లిలో చనిపోయిన కౌలు రైతు పుట్ట రవి కుటుంబసభ్యులను ఓదార్చిన వివేక్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయి చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కౌలు రైతులకు రైతుబంధు ఇస్తే రవి లాంటి కౌలు రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా రాష్ట్రంలో అమలు చేస్తే పంట నష్టపోయినప్పుడు రైతులకు ఆసరాగా ఉండేదన్నారు. కానీ ఫసల్ బీమాను సీఎం కేసీఆర్ అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆయా ఫ్యామిలీలకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పలు కుటుంబాలకు ఆర్థిక సాయం
అంబట్‌‌పల్లిలో చనిపోయిన కౌలు రైతు పుట్ట రవి, సింగనవేన అర్జయ్య యాదవ్, వేములవాడ కిష్టయ్య కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. బ్లాక్ ఫంగస్‌‌తో బాధ పడుతున్న వావిలాల సమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన వివేక్​ వెంకటస్వామి ఆర్థిక సహాయం అందజేశారు. సూరారంలో రైతు సంఘ నాయకుడు చల్ల చంద్రయ్య కుటుంబం, కాటారం మండలంలో ఉప సర్పంచ్ నాయని శ్రీనివాస్ తల్లి దుర్గమ్మ మరణించగా వారి కుటుంబాన్ని, ఇటీవల మృతి చెందిన మంత్రి రామక్క కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ లీడర్లు బొమ్మన భాస్కర్ రెడ్డి, సిరిపురం శ్రీమన్నారాయణ, కోయల్కార్ నిరంజన్, దుర్గం తిరుపతి, ఉడుముల విజయారెడ్డి, ఆకుల శ్రీధర్, బుడే శేఖర్, సూరం మహేశ్, బొల్లం కిషన్, రాజేందర్, పూసల రాజేంద్ర ప్రసాద్, కొండ రాజమల్లు, మంత్రి సునీల్, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరంతో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలె
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకుని కాళేశ్వరం కట్టారని, సీఎం కేసీఆర్ ఇరిగేషన్ దందాకు తెరలేపారని మండిపడ్డారు. కాళేశ్వరంతో మేఘా కృష్ణారెడ్డి ప్రపంచ కుబేరుడు అయ్యాడని, కానీ భూములిచ్చిన రైతులు సర్వస్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే మేఘా కృష్ణారెడ్డితో కేసీఆర్ కుమ్మక్కై 33 వేల కోట్ల ప్రాజెక్టు ఖర్చును రూ.లక్షా 25 వేల కోట్లకు పెంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. నిర్వాసితులందరికీ న్యాయమైన పరిహారం, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలన్నారు. పోడు భూముల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ బాధిత రైతులు వివేక్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. బ్యారేజీ కట్టడానికి పొలాలు తీసుకున్న ప్రభుత్వం.. ఇంటికొక ఉద్యోగం, డబుల్‌‌ ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. 

For more news..

సింగరేణి జోలికొస్తే ఢిల్లీకి సెగతగుల్తది

 

సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ సందర్శన