
న్యూఢిల్లీ: లోకల్, దేశీయ బ్రాండ్ల పట్ల భారతీయ వినియోగదారులకు కొత్తగా ఆసక్తి పెరుగుతోందని రుకమ్ క్యాపిటల్ తాజా రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. 'ఆస్పిరేషన్స్ ఆఫ్ న్యూ ఇండియా' పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం, సగం మందికి పైగా భారతీయులు స్థానిక లేదా చిన్న వ్యాపార సంస్థల నుంచి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
అందుబాటులో ఉండటం, విశ్వసనీయత, నాణ్యత లాంటివి దీనికి ప్రధాన కారణాలు. ఈ రిపోర్ట్ కోసం యూగవ్‌తో కలిసి 18 రాష్ట్రాల్లోని ఐదు వేల మందితో రుకమ్ సర్వే చేసింది. యువత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ, పర్యావరణానికి అనుకూలమైన బ్రాండ్లను ఎంచుకుంటున్నారని వెల్లడించింది.
58 శాతం మంది వినియోగదారులు స్థానిక లేదా చిన్న వ్యాపారాల నుంచి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. 73 శాతం మంది సోషల్ మీడియాలో బ్రాండ్ల గురించి తెలుసుకుంటున్నారు. చిన్న నగరాల్లో యూపీఐ వాడకం ఎక్కువగా ఉంది. పెట్ కేర్ (50శాతం), కిచెన్ వస్తువుల (43శాతం) కొనుగోళ్లలో ప్రముఖుల ప్రభావం ఎక్కువగా ఉంది. 48 శాతం మంది ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో డీల్స్ కోసం చూస్తున్నారు. పెట్ కేర్ (63శాతం), గృహోపకరణాలు (58శాతం) వంటివి ఆన్‌లైన్‌లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఫ్యాషన్ యాక్సెసరీస్ (60శాతం), ఆహారం, పానీయాలు (39శాతం) ఆఫ్‌లైన్‌లో కొంటున్నారు.