పంజాబ్లో పోలింగ్కు సర్వం సిద్ధం

పంజాబ్లో పోలింగ్కు సర్వం సిద్ధం

చండీఘడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 23 జిల్లాల్లోని 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేపు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలక్షన్ సిబ్బంది పోలింగ్ సామాగ్రితో తమకు కేటాయించిన బూత్లకు చేరుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. వాస్తవానికి ఫిబ్రవరి 14నే పంజాబ్లో ఎన్నిక జరగాల్సి ఉండగా.. ఆ రోజున గురు రవిదాస్ జయంతి ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థన మేరకు ఎలక్షన్ కమిషన్ పోలింగ్ను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. 

1,304 మంది అభ్యర్థులు
పంజాబ్లోని 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1304 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 93 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

బరిలో ఉన్న ప్రముఖులు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చరణ్ జీత్ చన్నీ చమ్కూర్ సాహిబ్ నుంచి బరిలో నిలవగా.. పీసీసీ చీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్ సర్ నుంచి పోటీ చేస్తున్నారు. ధురి నుంచి ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్, మొహాలీ నియోజకవర్గం నుంచి కుల్వంత్ సింగ్ బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టుకున్న పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ పటియాల నుంచి పోటీ చేస్తున్నారు. శిరోమణి అకాలీ దళ్ నేతలైన సుఖ్ బీర్ సింగ్ బాదల్ జలాలాబాద్, ప్రకాశ్ సింగ్ బాదల్ లంబీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

అమరీందర్తో బీజేపీ దోస్తీ
ఆదివారం జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరిగా బరిలో దిగుతున్నాయి. బీజేపీ మాత్రం మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, సుఖ్ దేవ్ సింగ్ కు చెందిన శిరోమణి అకాలీదళ్ సంయుక్త్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. మార్చి 10న పంజాబ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

పంజాబ్ సీఎం చన్నీపై కేసు నమోదు

యూపీలో ప్రచారంతో హోరెత్తిస్తున్న ప్రియాంక