
- కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : జిల్లాలో బాలికల సంరక్షణ, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, బేటీ బచావో..- బేటీ పడావో కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో పోషణ్ మాసం, బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను మంగళవారం తన ఛాంబర్ లో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌష్టికాహారం లోపం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బాల్యవివాహాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను ముందుగానే గుర్తించి, సమయానికి శస్త్రచికిత్స చేయించడం ద్వారా పిల్లలకు కొత్త జీవితం ఇవ్వాలన్నారు. జిల్లాలో హృద్రోగ సమస్యలు ఉన్న పిల్లలను గుర్తించి వైద్యం చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. అంతకుముందు జిల్లా వైద్యారోగ్య శాఖ మీటింగ్హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం అధికారి సాయినాథ్ రెడ్డి, డాక్టర్ పరిమళ పాల్గొన్నారు.