- వనపర్తి కొత్త ఎస్పీ సునీత
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాను భద్రతా పరంగా రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎస్పీ డి.సునీత తెలిపారు. సోమవారం ఆమె ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు పూలమొక్క అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగితేనే సమర్థవంతమైన, ప్రభావవంతమైన పోలీసింగ్ సాధ్యమని తెలిపారు. జిల్లా ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తానని, సాంకేతిక, సమాచార వ్యవస్థలతో పోలీస్ విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
ప్రజలకు న్యాయం అందించడంతో పాటు భద్రతాభావం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. డ్రగ్ మాఫియా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అవినీతి, అసాంఘిక ప్రవర్తనపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ లు, ప్రమోషన్‌పై కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు.
