
- కీవ్, మరియుపోల్, ఖార్కివ్, ఒడెస్సాపై దాడులు
- ఖార్కివ్‌లోని కీలక బిల్డింగులపై మిసైళ్ల వర్షం
- రాజధాని దగ్గర్లోకి వచ్చిన రష్యన్ బలగాలు
- యుద్ధంలో 6 వేల మంది రష్యన్ సైనికులు హతం
- మా పౌరులు 2 వేల మంది చనిపోయిన్రు: ఉక్రెయిన్
ఉక్రెయిన్, రష్యా మధ్య వారం రోజులుగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. క్రిమియాకు దగ్గర్లో ఉన్న పోర్ట్ సిటీ ‘ఖెర్సన్’ను రష్యన్ దళాలు బుధవారం ఆక్రమించుకున్నాయి. తర్వాత ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా దాడులను పెంచాయి. ప్రభుత్వ బిల్డింగులు, జనావాసాలే లక్ష్యంగా మిసైళ్లతో వరుసగా అటాక్స్ కొనసాగిస్తున్నాయి. మరోవైపు రాజధాని కీవ్‌కు దగ్గరగా రష్యా సైన్యం చేరుకుంది. ఈ యుద్ధంలో ఆరు రోజుల వ్యవధిలో 6 వేల మంది రష్యా సైనికులను హతమార్చామని ఉక్రెయిన్ ప్రకటించింది. 2 వేల మంది దాకా తమ ప్రజలు చనిపోయినట్లు చెప్పింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభంతో ఇప్పటిదాకా 8.7 లక్షల మంది ఆ దేశాన్ని విడిచి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
కీవ్/మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసం కొనసాగుతున్నది. వారం రోజులుగా సాగుతున్న యుద్ధంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకున్నది. దక్షిణాన క్రిమియాకు దగ్గర్లో ఉన్న పోర్ట్ సిటీ ‘ఖెర్సన్’ను రష్యన్ దళాలు ఆక్రమించుకున్నాయి. భీకర యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌లోని ఓ మేజర్ సిటీని రష్యా తమ అధీనంలోకి తెచ్చుకుంది. మెలిటొపోల్‌ను దాదాపు అదుపులోకి తెచ్చుకునే స్థాయిలో ఉండగా.. మరియుపోల్, ఒడెస్సా, ఖార్కివ్ సిటీలపై దాడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈశాన్యంలోని ఖార్కివ్‌పై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ దగ్గరకు బలగాలు చేరుకుంటున్నాయి. సిటీ శివార్లలో జరుగుతున్న పోరులో భారీగా ప్రాణనష్టం జరుగుతున్నది.
కీవ్‌కు అతి దగ్గర్లో..
రష్యా బలగాలు కీవ్‌కు దగ్గరగా వచ్చినట్లు క్యాపిటల్ సిటీ మేయర్ విటలీ క్లిట్స్‌చ్కో చెప్పారు. ‘‘మేం రెడీ.. కీవ్‌ను కాపాడుకుంటాం. కీవ్ ఉంది.. ఉంటుంది కూడా” అని పేర్కొన్నారు. రెండు మూడు రోజులుగా భారీ సైనిక కాన్వాయ్ రాజధాని వైపు కదులుతున్న శాటిలైట్ ఇమేజ్‌లు వైరల్ అయ్యాయి. కీవ్ సరిహద్దుల్లో జరుగుతున్న పోరులో భారీ ప్రాణనష్టం జరుగుతోంది. విధ్వంసం ఎక్కువగా ఉంది. మరోవైపు కీవ్‌లోని టీవీ టవర్‌పై జరిగిన దాడిలో ఐదుగురు చనిపోయినట్లు ఉక్రెయిన్ ఆఫీసర్లు చెప్పారు. ఒక టీవీ చానల్ రూమ్, పవర్ సబ్ స్టేషన్‌పై స్ట్రైక్స్ చేశారని, కొన్ని ఉక్రెయిన్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయన్నారు. ఈ దాడుల్లో బాబీ యార్ హాలోకాస్ట్ మెమోరియల్ కూడా ధ్వంసమైనట్లు జెలెన్‌స్కీ ఆఫీస్ చెప్పింది. దాడిపై స్పందించిన జెలెన్‌స్కీ.. చరిత్రను చెరిపివేయాలని రష్యా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రష్యా దాడులతో పవిత్రమైన, మతపరమైన ప్రదేశాలకు ముప్పు అన్నారు. ‘‘వాళ్లకు మన రాజధాని గురించి, మన చరిత్ర గురించి తెలియదు.. మన చరిత్రను, మన దేశాన్ని.. చివరికి మనల్ని కూడా తుడిచిపెట్టేయాలని రష్యన్ సైనికులకు ఆదేశాలు వెళ్లాయి. ” అంటూ మండిపడ్డారు. జో బైడెన్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఫోన్‌లో మాట్లాడారు. వీలైనంత త్వరగా రష్యాను అడ్డుకోవాలని జెలెన్‌స్కీ కోరారు. తమకు సభ్యత్వం ఇవ్వడం ద్వారా యూరోపియన్ యూనియన్ తమతో ఉందనే విషయాన్ని నిరూపించుకోవాలని చెప్పారు.
చర్చలపై నో క్లారిటీ
రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలపై క్లారిటీ రాలేదు. బుధవారం జరగాల్సిన రెండో రౌండ్ చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా తొలుత ప్రకటించింది. అయితే, రష్యా దాడులు కొనసాగుతుండటంతో, ఉక్రెయిన్ వైపు నుంచి చర్చలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
3వ ప్రపంచ యుద్ధమొస్తే.. అణు విధ్వంసమే: రష్యా
మూడో ప్రపంచ యుద్ధమే మొదలైతే.. అణు ఆయుధాలతో విధ్వంసం జరుగకతప్పదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీయ్ లావ్‌రోవ్ హెచ్చరించారు. ఉక్రెయిన్ అణు ఆయుధాలను సేకరిస్తే.. రష్యాకు పెను ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యాపై ఆంక్షలు పెట్టం: చైనా
అమెరికా, యూరప్ దేశాల మాదిరి రష్యాపై ఆంక్షలు విధించబోమని చైనా ప్రకటించింది. ‘‘ఏకపక్షంగా విధించిన ఆంక్షలను అంగీకరించబోం. ఎందుకంటే వాటికి చట్టపరమైన ఆధారాలు లేవు’’ అని చైనా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గువో షూఖింగ్ అన్నారు.
రష్యాపై ఐసీజేలో విచారణ
రష్యా జాతి విధ్వంసానికి పాల్పడుతున్నదంటూ ఉక్రెయిన్ చేసిన ఆరోపణలపై ఈ నెల 7, 8 తేదీల్లో బహిరంగ విచారణ జరపనున్నట్లు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పింది.
8.7 లక్షల మంది వెళ్లిపోయిన్రు
రష్యా దాడి మొదలైనప్పటి నుంచి 8.7 లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్యసమితి రెఫ్యూజీ ఏజెన్సీ వెల్లడించింది. శరణార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు తెలిపింది.
6 రోజుల్లో 6 వేల మంది..
తొలి 6 రోజుల యుద్ధంలో 6 వేల మంది రష్యన్ సైనికులను హతమార్చామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ చెప్పారు. తమ దేశాన్ని బాంబులు, వైమానిక దాడులతో రష్యా స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. 30 విమానాలు, 31 హెలికాప్టర్లు, 211 ట్యాంకులు, 860కిపైగా వాహనాలు ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. ఇప్పటిదాకా తమ పౌరులు 2 వేల మంది చనిపోయినట్లు తెలిపింది.
తర్వాతి టార్గెట్ ఖార్కివ్?
అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా రష్యా ముందుకే సాగుతున్నది. ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటంతో ఇండ్లు, ప్రభుత్వ భవనాలు ఉన్న ఏరియాలను టార్గెట్ చేసుకుని బాంబులేస్తోంది. ఈ క్రమంలో స్థానికులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ కోరింది. బుధవారం కీలకమైన ఖెర్సన్ సిటీని స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ సిటీపై కొన్ని రోజులుగా బాంబుల వర్షం కురిపిస్తోంది. బుధవారం కూడా దాడులు కొనసాగాయి. సిటీ కౌన్సిల్ బిల్డింగ్‌పై క్రూయిజ్ మిసైల్‌ను రష్యా ప్రయోగించింది. ప్రాంతీయ పోలీసు, నిఘా కార్యాలయంపై స్ర్టైక్స్ చేసింది. దీంతో బిల్డింగ్ రూఫ్ పేలిపోయింది. టాప్ ఫ్లోర్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. పేలుడు ధాటికి ఐదంతస్తుల భవనం శిథిలాలు పక్కనే ఉన్న వీధుల్లో పడ్డాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసు రిలీజ్ చేసింది. పలువురు గాయపడ్డట్లు వెల్లడించింది. బుధవారం జరిగిన దాడుల్లో నలుగురు చనిపోయారని, 9 మంది గాయపడ్డారని, 10 మందిని కాపాడామని తెలిపింది. రష్యా రెండు రోజులుగా నిరంతరం షెల్లింగ్ చేస్తోందని చెప్పింది. ఈ దాడులతో ఖార్కివ్ సిటీలో 12 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం దాకా ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది.