యాదగిరిగుట్ట దేవస్థానానికి రూ.30 లక్షల బంగారు ఆభరణాలు విరాళం

యాదగిరిగుట్ట దేవస్థానానికి రూ.30 లక్షల బంగారు ఆభరణాలు విరాళం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఓ దంపతులు రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలను సోమవారం విరాళంగా అందజేశారు. వరంగల్ కు చెందిన ఆకుల అనిల్ కుమార్, హైమావతి దంపతులు రూ.17 లక్షల విలువైన బంగారు హారం, రూ.13 లక్షల విలువైన రెండు బంగారు వడ్డాణాలను స్వామివారికి విరాళంగా సమర్పించారు. మొదట ఈ బంగారు ఆభరణాలను ప్రధానాలయ ముఖమంటపంలో ఉన్న లక్ష్మీనారసింహుల ఉత్సవమూర్తులకు పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంగారు ఆభరణాలను ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ చేతుల మీదుగా దాతలు ఆలయానికి అందజేశారు

. అనంతరం దాతలు ప్రధానాలయంలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు దాతలకు వేదాశీర్వచనం చేయగా.. డీఈవో భాస్కర్ శర్మ లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అనుబంధ ఆలయమైన శివాలయంలో పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరస్వామి(స్పటిక లింగం)కి రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించారు. ఇక భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా సోమవారం ఆలయానికి రూ.33,97,335 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.