
- ఏటా వర్షాకాలంలో 600 కు పైగానే ఫిర్యాదులు
- అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్న ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో వరదలు, విపత్తులు ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్) సరిపడా స్టాఫ్ లేక సతమతమవుతోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం కావడం, వరదల ప్రభావం కూడా అదే స్థాయిలో ఉండటంతో హైదరాబాద్ తోపాటు వరంగల్ లో డీఆర్ఎఫ్ స్టేషన్ ఏర్పాటు చేసినా, ఇక్కడి జనాభా, పరిస్థితులకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదరువుతున్నాయి. వంద మంది ఉండాల్సిన చోట కేవలం 27 మందే పని చేస్తుండగా, చెట్లు కూలినా, ఆక్రమణలు కూల్చినా, అనధికార ఫ్లెక్సీలు తొలగించినా, వరదలు వచ్చినా, ప్రతి పనికీ వాళ్లే రెస్పాండ్ కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ డీఆర్ఎఫ్ స్టేషన్ ను స్ట్రెంథెన్ చేసేందుకు యూత్ ఫోర్స్ నియామకం కోసం ఆఫీసర్లు పంపిన ప్రపోజల్స్ కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో వరదలు, విపత్తులు సంభవించినప్పుడు జీడబ్ల్యూఎంసీ అధికారులు అరకొర సిబ్బందితోనే నెట్టుకురావాల్సి వస్తోంది.
వరంగల్ పట్టణంలో 27 మందే..
గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ సిటీస్ లో ఇదివరకు ఫైర్ ప్రివెన్షన్ వింగ్స్ ఉండగా, వరదలు, ప్రమాదాలు, తదితర ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు 2019లో డీఆర్ఎఫ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ డీఆర్ఎఫ్ లో దాదాపు 600 వెహికల్స్, 3 వేలకు పైగా సిబ్బంది పని చేస్తున్నారు. ఇక 12 లక్షలకు పైగా జనాభా కలిగి ఉండి, 408 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న గ్రేటర్ వరంగల్ నగరానికి తక్కువలో తక్కువ వంద మంది సిబ్బందైనా అవసరం. కానీ, ఇక్కడ మొత్తంగా 27 మందితోనే డీఆర్ఎఫ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అందులో 23 మంది డీఆర్ఎఫ్ టీమ్ మెంబర్స్ కాగా, మరో నలుగురు డ్రైవర్లు. ఈ 23 మందిని నాలుగు టీములుగా విభజించి షిఫ్టుల వారీగా పని చేయిస్తున్నారు.
అరకొర సిబ్బందితోనే సేవలు
ప్రతి ఏడాది డీఆర్ఎఫ్ కు అన్ని కలిపి 600కు కంప్లైంట్స్ వస్తుంటాయి. వరదలు ముంచెత్తడం, చెట్లు కూలడం, హోర్డింగ్స్ పడిపోవడం ఇలా వివిధ రకాల సమస్యలపై కంప్లైంట్స్ వచ్చినప్పుడు డీఆర్ఎఫ్ సిబ్బంది యాక్షన్ చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు జీడబ్ల్యూఎంసీ పరిధిలో రెండు డీఆర్ఎఫ్ పికప్ వెహికల్స్, ఆరు రెస్క్యూ బోట్లు, 40 లైఫ్ జాకెట్స్, 22 లైఫ్ బాయ్స్, ఆరు డీ వాటరింగ్ పంప్స్ అందుబాటులో ఉన్నాయి. విపత్తుల సమయంలో జీడబ్ల్యూఎంసీ పరిధిలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తుండగా, వాటికి వచ్చిన ఫిర్యాదులను అరకొర సిబ్బందితోనే పరిష్కరిస్తున్నారు.
గతేడాది 658 కాల్స్ అటెండ్ చేసి, అందులో 258 మంది వరద బాధితులను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా జీడబ్ల్యూఎంసీ డీఆర్ఎఫ్ స్టేషన్ లో సిబ్బంది కొరతే సమస్యగా మారింది. అంతేకాకుండా ప్రస్తుతం రెండు పికప్ వెహికల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో ఒకేసారి రెండుకు మించి అత్యవసర కాల్స్ వస్తే డీఆర్ఎఫ్ సిబ్బంది సకాలంలో సేవలందించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
కాగితాలకే పరిమితమైన ప్రపోజల్స్..
సాధారణంగా వరదలు, ప్రమాదాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు 20 నుంచి 40 ఏండ్ల వయసు ఉండే సిబ్బంది అవసరమని అధికారులు చెబుతున్నారు. కానీ, వరంగల్ డీఆర్ఎఫ్ టీమ్ లోని 27 మందిలో 45 ఏండ్లు నిండిన వాళ్లే 20 మంది ఉన్నారు. దీంతో వరదలతోపాటు బిల్డింగులు కూలినా, అక్రమ నిర్మాణాలను కూల్చినా, ఈదురుగాలులకు విరిగిన చెట్లు, అనధికార ఫ్లెక్సీలు తొలగించాలన్నా, చెరువులు, కెనాళ్లు, బావుల్లో ఎవరైనా పడి చనిపోయినా, ఇతర ప్రమాదాలకు గురైనా వాళ్లే తప్పక విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలోనే జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు డీఆర్ఎఫ్ స్టేషన్ ను స్ట్రెంథెన్ చేసేందుకు ఇప్పటికి రెండు సార్లు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించారు. వాటికి ఆమోదం లభించకపోవడంతో ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దే పెండింగ్ లో ఉన్నాయి. దీంతో అరకొర స్టాఫ్ తోనే డీఆర్ఎఫ్ టీంను నడిపించాల్సి వస్తోందని ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఆపత్కాలంలో సేవలందించే డీఆర్ఎఫ్ ను సరిపడా ఎక్విప్ మెంట్, యూత్ ఫోర్స్ తో స్ట్రెంథెన్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ ప్రజలు కోరుతున్నారు.
ప్రపోజల్స్ పంపించాం..
గ్రేటర్ వరంగల్ డీఆర్ఎఫ్ లో సిబ్బంది కొరత ఉన్న విషయం వాస్తవమే. సరిపడా సిబ్బందిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. సిబ్బంది తక్కువగా ఉన్నా నగర పరిధిలో ఎన్ని కాల్స్ వచ్చినా అటెండ్ చేస్తున్నాం. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. సిబ్బంది నియామకానికి సంబంధించి, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
ఎస్.శంకరలింగం, డీఎఫ్ వో, జీడబ్ల్యూఎంసీ