నీళ్లను ఇట్ల నిల్వ చేద్దం!

నీళ్లను ఇట్ల నిల్వ చేద్దం!
  • ఒడిసిపట్టే ఏడు పాత పద్ధతులు   
  • ఉత్తరాఖండ్​, రాజస్థాన్​, కేరళల్లో నీటి కష్టాలకు చెక్
  • మండుటెండల్లోనూ ఎండిపోని వైనం
  • నాలా, టంక, కెనీ, బెరీ, సురంగల్లో ఫుల్లు నీళ్లు

వర్షాలు పడట్లే.. నీళ్లు దొరకట్లే.. ఒక్క చుక్క నీరైనా బంగారమే ఇప్పుడు. మరి, ఆ బంగారాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి! ఒక్కొక్క చుక్కను ఎంత భద్రంగా ఒడిసిపట్టాలి! అవును, అది ప్రతి ఒక్కరి బాధ్యత. భూమి లోపల నీళ్ల జలజలలు వినపడాలంటే, చెరువులు, కుంటల ద్వారా మనం వాటిని ఒడిసిపడుతుంటాం. కానీ, అంతకుమించి నీటిని ఒడిసిపట్టేందుకు కొన్ని పాత పద్ధతులున్నాయని తెలుసా? ‘టైమ్స్​ ఆఫ్​ ఇండియా’ దేశం మొత్తంలో ఉన్న అలాంటి పాత పద్ధతులను  వెలుగులోకి తీసుకొచ్చింది. ఏడు పాత, సంప్రదాయ పద్ధతులు ఇప్పటికీ మెరుగైన ఫలితాలిస్తున్నాయని తేల్చింది. ఏంటి ఆ పద్ధతులు? ఎక్కడెక్కడ ఎలా చేస్తున్నారో ఓ లుక్కేద్దాం!

ప్రతి ఇంట్లో ఓ టంక

రాజస్థాన్​ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎడారి. అక్కడ నీటికి ఎన్ని కష్టాలు పడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. అందుకే అక్కడ కొన్ని ఊళ్లలో ప్రతి ఇంట్లోనూ నీటిని భద్రపరిచే వ్యవస్థలుంటాయి. వాటినే ‘టంక’ అని పిలుస్తారు. జోధ్​పూర్​ జిల్లాలోని గూడ బిషోనియన్​ ఊరికెళితే మండే ఎండాకాలంలోనూ నీళ్లు దొరుకుతాయి. కారణం, అక్కడ వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఈ టంకలను ఇంటింటా తవ్వి పెట్టడమే. ఇవి అండర్​గ్రౌండ్​ నిర్మాణాలన్నమాట. దాని చుట్టూ ఓ గోడను కడతారు. వర్షపు నీటిని ఆ గోడ వడబోసి టంకలోకి పంపుతుంది. సామర్థ్యాన్ని బట్టి ఒక్కో టంక, ఒక్కో కుటుంబానికి ఏడు నెలలకు సరిపడా నీళ్లను దాచి ఉంచుతుంది.

బావుల్లాంటి బెరీలు

అదే గూడ బిషోనియన్​ గ్రామంలో టంకలకు తోడుగా చిన్న చిన్న చెరువులూ తమ వంతు సాయం చేస్తున్నాయి. దానికి అదనంగా బావుల్లాంటి ‘బెరీ’లూ నీటిని ఒడిసి పట్టేస్తున్నాయి. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎండాకాలం వచ్చినా బెరీల్లో నీరు మాత్రం ఎండిపోదట. వర్షం నీరు భూమిలోకి ఇంకేలా సన్నటి వెడల్పుతో బావిలా తవ్వుతారట. కొంచెం గట్టి పొర తగిలేవరకు తవ్వి వదిలేస్తారట. అప్పుడు నీళ్లు భూమిలోకి ఇంకే వరకు ఇంకి మిగతా నీరు అందులో స్టోర్​ అవుతుందట. వాటిలోకి వెళ్లే నీరు ఆవిరికాకుండా ఉండేందుకు దాని మూతిని సన్నగా ఉంచుతారట. జోధ్​పూర్​లోని మిగతా ప్రాంతాల్లో ‘నదీ’, జోహడ్​ అనే ప్రత్యేక నీటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి కూడా చెరువులు, కుంటల్లాంటివే అయినా వాటికి కొంచెం భిన్నం. చుట్టుపక్కల కురిసిన వర్షపు నీటిని ‘నదీ’ల్లోకి దారి మళ్లిస్తారు. భాగ్​తస్నీ గ్రామంలో కొన్నేళ్ల పాటు ఈ ‘నదీ’లే జీవనాధారంగా ఉన్నాయి. పేర్లు ఏవైనా ఈ ఐదు రకాల నీటి వనరులు మాత్రం అక్కడోళ్లకు చాలా పవిత్రమైనవని గ్రామస్థులు చెబుతుంటారు. వాటి వయసు 200 ఏళ్ల నుంచి 500 ఏళ్ల దాకా ఉంటాయంటున్నారు.

కేరళ కెనీలు

ఓ మీటర్​ గుంత, చుట్టూ తాటి బెరడుతో రక్షణ. ఎప్పుడూ నీళ్లతో కళకళలాడుతుంటాయవి. అవే కెనీలు. దేవుడన్నా కూడా వాళ్లకు అంత భక్తి ఉండదేమో కానీ, కెనీలంటే చాలు ఆరాధిస్తారు. వయనాడ్​ జిల్లాలోని ముల్లు కురుమ తెగకు చెందిన జనాలకు అవే నీటి అవసరాలను తీర్చేస్తుంటాయి. అన్నీ కూడా దాదాపు వందల ఏళ్ల నాటివే. ఇప్పుడు వాటిని కట్టేందుకు నీటిని ఒడిసిపట్టే చెట్లు, పుట్టల దగ్గర వాటిని కడుతున్నారు. అయితే, చూడ్డానికి చిన్నగానే కనిపించినా, దాన్ని కట్టడం మాత్రం పెద్ద పనే. ఎందుకంటారా? గుంట చుట్టూ పెట్టే తాటి బెరడును ఏడాది ముందే కొట్టి తెచ్చుకుంటారు. లోపలి పొర బాగా మెత్తబడి దృఢమైన బయటి పొరలో కలిసిపోయేవరకు నానబెడతారు. అది నీటిని మెరుగ్గా వడబోస్తుందని అక్కడోళ్లు చెబుతుంటారు. చిన్న గుంటే అయినా ఏడాది పాటు నీటిని సమృద్ధిగా నిల్వ చేస్తుందని అంటూ ఉంటారు. ఏడాది పాటు రోజూ సగటున వెయ్యి లీటర్ల నీటిని ఈ కెనీలు ఇస్తున్నాయని కోజికోడ్​లోని సెంటర్​ ఫర్​ వాటర్​ రీసోర్సెస్​ డెవలప్​మెంట్​ అండ్​ మేనేజ్​మెంట్​ స్టడీ చేసి తేల్చింది కూడా. అంతేకాదు, అందులోని నీళ్లను శుద్ధి చేయకుండానే తాగేసేయొచ్చనీ ఆ స్టడీలో పాల్గొన్న సైంటిస్టులు చెప్పారు. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు ఆ కెనీల్లోంచి నీళ్లను తీసుకొచ్చి వాళ్ల పూర్వీకులు ఉంటారన్న నమ్మకంతో వెలియపురలో అభిషేకం చేస్తారు. అంతేకాదు, ఓ మనిషి చనిపోతే అంతిమ సంస్కారాలకు ముందు ఆ కెనీ నీళ్లతో చివరి స్నానం చేయిస్తారట.

నాలా వారికి గుడి

దేవుళ్లకు గుళ్లు కట్టి పూజలు చేయడం పరిపాటి. కానీ, ఉత్తరాఖండ్​లోని కొండ ప్రాంతాల ప్రజలు మాత్రం నీటినే దేవుడిగా కొలుస్తారు. అవును, అక్కడ ఏడో శతాబ్దంలో కత్యూరీ, చాంద్​ డైనాస్టీకి చెందిన రాజులు నీటిని ఒడిసిపట్టేందుకు ‘నాలా’లను కట్టించారు. రాళ్లతో చిన్న ఇళ్లలా వాటిని నిర్మించారు. కొండ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఆ నీరు జలజల జారి ఆ నాలాల్లోకి చేరుతుంటాయి. నీటిని ఒడిసిపట్టేలా వాటి చుట్టుపక్కల మదీరా, బంజ్​, ఖర్సు అనే చెట్లను పెంచుతుంటారు. ఈ నాలాలే చాలా కాలం పాటు జనాల నీటి అవసరాలను తీర్చాయి. అందుకే వాటిని ‘నీటి గుళ్లు’ అని అక్కడోళ్లు పిలుస్తుంటారు. అక్కడ దాదాపు 64 వేల దాకా నాలాలుంటే, అందులో 60 వేల నాలాలు ఎండిపోయాయి. అలా అవి ఎండిపోవడం రనిఖేత్​ గ్రామానికి చెందిన బిషన్​ సింగ్​ (42) అనే వ్యక్తిని బాధపెట్టాయి. వాటికి ఎలాగైనా సరే ఊపిరి పోయాలని నిర్ణయించుకున్న ఆయన మూడేళ్ల క్రితం ఒక్కడే ఆ పనిని ప్రారంభించారు. దానికీ ఓ కారణం ఉంది. ఆయన తల్లి చనిపోయినప్పుడు అంతిమ సంస్కారాలు చేసేందుకూ ఒక్క బకెట్​ నీళ్లు దొరకలేదు. వర్షాల్లేక అక్కడి నాలాలన్నీ ఎండిపోయాయి. అందుకే వాటికి జల జీవం నింపేందుకు ‘నాలా ఫౌండేషన్​’ను ఏర్పాటు చేశారు. అలా ఒక్కడితో ప్రారంభమైన ఫౌండేషన్​లో ఇప్పుడు 500 మంది పనిచేస్తున్నారు. అల్మోరా జిల్లాలో వారికి తోడుగా మహిళా సంఘాలు జత కలిశాయి. ఇప్పటిదాకా వాళ్లు 20 నాలాలకు పునరుజ్జీవం తీసుకురాగలిగారు. వాటికి తోడుగా మహిళలు ‘చాల్​ ఖాల్​’లను కట్టి నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గడ్డి, చెట్లు, పొదలతో తడిగా ఉండే ప్రాంతాన్నే చాల్​ ఖాల్​ అని పిలుస్తారు. దాని వల్ల నీరు భూమిలోకి మెరుగ్గా ఇంకి నాలాలకు జీవం వస్తుంది. ఒక్కో నాలా సైజును బట్టి ఒక మీటర్​ నుంచి 10 మీటర్ల లోతు వరకు ఉంటాయి. వాటన్నింటినీ విష్ణు దేవుడికి ప్రతిరూపంగా అక్కడి జనాలు భావిస్తుంటారు. అంతేకాదు, నీటిని కాపాడేందుకు రాతి విగ్రహాన్ని నాలాల లోపల పెడతారు. అలాగైనా నీటిని వృథా చేయకుండా జనం కాపాడుకుంటారని అక్కడోళ్లు భావిస్తుంటారు.

సొరంగాలు

కాసర్​గోడ్​ ప్రాంతంలో నీళ్ల కోసం సురంగ/సొరంగాలున్నాయి. ఇప్పుడు వాటిని పునరుద్ధరించే పనిని చేతపట్టారు కాసర్​గోడ్​ వాటర్​మ్యాన్​గా పిలిచే సీ కుంజంబు. పక్క రాష్ట్రం కర్ణాటకలోనూ వాటిని విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. 50 ఏళ్లలో ఒక్క కాసర్​గోడ్​లోనే ఆయన వెయ్యికిపైగా సురంగలను తవ్వారు. కొండ ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలను చేపడితే మంచి ఫలితాలుంటాయని వివరించారు. కొండ ప్రాంతాల్లో సొరంగం తవ్వుకుంటూ పోతారట. నీళ్లు దొరికే దగ్గర ఆపేసి, అక్కడే ఓ చిన్న రిజర్వాయర్​ లాంటిది కడతారు. వర్షాల ద్వారా అక్కడ నిల్వ అయ్యే నీటిని పైపుల ద్వారా తిరిగి స్టోరేజీ ట్యాంకులు, బావులకు మళ్లిస్తారట. తద్వారా నీటి సమస్యలు తప్పుతాయట. అయితే, ఒక్కో సురంగ తవ్వడానికి నెల దాకా టైం పడుతుందని కుంజంబు చెబుతున్నారు.