దేశం గొంతెండుతున్నది.. 15 రాష్ట్రాల్లో డెడ్ స్టోరేజీకి రిజర్వాయర్లు

దేశం గొంతెండుతున్నది.. 15 రాష్ట్రాల్లో డెడ్ స్టోరేజీకి రిజర్వాయర్లు
  • పదేండ్ల కనిష్టానికి వాటర్ లెవల్స్
  • సౌత్ ఇండియాలో పరిస్థితి మరీ దారుణం
  • కర్నాటకలో నీటి సంక్షోభం.. 12 రిజర్వాయర్లలో పడిపోయిన నీటి నిల్వలు
  • ఎండిపోతున్న కావేరీ నది.. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి
  • సగానికి పైగా ఎండిపోయిన బోరు బావులు
  • వర్షాభావ పరిస్థితులే కారణమంటున్న అధికారులు

న్యూఢిల్లీ: దేశంలో నీటి కొరత తీవ్రమైంది. చాలా రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నీటి మట్టాలు కనిష్టానికి పడిపోయాయి. నిరుడు వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాగునీటి అవసరాలు రోజురోజుకీ పెరుగుతుంటే.. గ్రౌండ్ వాటర్ లెవల్స్ మాత్రం అంతకంటే వేగంగా పడిపోతున్నాయి. దేశంలో ప్రధానమైన 21 రాష్ట్రాలను లెక్కలోకి తీసుకుంటే.. 15 స్టేట్స్​లోని రిజర్వాయర్ల నీటి మట్టం పదేండ్ల కనిష్టానికి పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్​లోని రిజర్వాయర్ల నీటి మట్టం 49 శాతానికి దిగజారిపోయాయి. 

ఆ తర్వాత స్థానాల్లో బిహార్ (44 శాతం), ఉత్తరప్రదేశ్ (33శాతం), కర్నాటక (28 శాతం), చత్తీస్​గఢ్ (22శాతం), తమిళనాడు (20శాతం), పంజాబ్ (16 శాతం), రాజస్థాన్ (15 శాతం) ఉన్నాయి. 2050 నాటికి ఇండియాలో తీవ్రమైన నీటి సంక్షోభం తలెత్తుతుందని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కూడా తన నివేదికలో హెచ్చరించింది. మార్చి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. మేలో పరిస్థితి ఏంటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాలు, నగరాలు విస్తరిస్తుండడంతో జలవనరులపై భారం పెరుగుతున్నది. ఇండియా మొత్తంగా చూసుకుంటే.. పోయిన ఏడాది ఫిబ్రవరిలో రిజర్వాయర్లలో 52 శాతం నీళ్లు ఉంటే.. ఈ ఏడాది నాటికి 43శాతానికి పడిపోయాయి. 

సౌత్ ఇండియాలో నీటి కటకట

ఇప్పటికే సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో నీటి సంక్షోభం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళలో నీటి కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఏపీలో గతేడాది రిజర్వాయర్లలో నీటి మట్టం 66 శాతం ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 22 శాతానికి పడిపోయాయి. కర్నాటకలో నిరుడు 45 శాతం ఉంటే.. ఈ ఏడాది 29శాతానికి దిగజారిపోయాయి. అదేవిధంగా, తమిళనాడులోని రిజర్వాయర్లలో నిరుడు 70శాతం నీళ్లు ఉంటే.. ఇప్పుడు 35 శాతానికి పడిపోయాయి. తెలంగాణలో పోయిన ఏడాది రిజర్వాయర్లలో 59 శాతం వాటర్ ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 42శాతంగా ఉన్నాయి. సౌతిండియాలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో పరిస్థితి కొంత బాగానే ఉంది. నిరుడు రిజర్వాయర్లలో 54 శాతం నీళ్లుంటే.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 49 శాతానికి తగ్గాయి. సౌత్ రీజియన్ లోని అన్ని రాష్ట్రాల్లో ఓవరాల్​గా చూసుకుంటే.. పోయిన ఏడాది 47 శాతం నీటి నిల్వలు ఉంటే.. ఈ ఏడాది 28 శాతానికి పడిపోయాయి. 

బెంగళూరులో గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు

సౌత్ ఇండియాలో కర్నాటక పరిస్థితి మరీ దయనీయంగా మారింది. రాష్ట్రంలోని 16 రిజర్వాయర్లలో.. పన్నెండింటిలో వాటర్ స్టోరేజీ పదేండ్ల కనిష్టానికి పడిపోయాయి. ముఖ్యంగా బెంగళూరు వాసులు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావం కారణంగానే తాగునీటి సమస్య తలెత్తింది. నగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. ట్యాంకర్ల ద్వారా సప్లై చేసే నీటి విషయంలోనూ కీలక ఆదేశాలు జారీ చేశారు. 200 ప్రైవేట్ ట్యాంకర్లు నాలుగు నెలల పాటు ఫిక్స్​డ్ రేట్లకే నీళ్లు సరఫరా చేయాలని ఆదేశించారు. వెహికల్స్ వాష్ చేయడం, నిర్మాణాలు, ఎంజాయ్​మెంట్ కోసం వాటర్ ఉపయోగించొద్దని తెలిపారు. బెంగళూరులోని అన్ని హౌసింగ్ సొసైటీలు కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. నీటి వృథాను అరికట్టేందుకు ట్యాప్​ల వద్ద స్పెషల్ సెక్యూరిటీని ఏర్పాటు చేశాయి. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5వేల జరిమానా విధించేందుకు సిద్ధం అయ్యాయి. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో బెంగళూరు వాసులున్నారు. కొందరు షాపింగ్ మాల్స్‌‌కు వెళ్లి అక్కడి టాయిలెట్‌‌లను ఉపయోగించుకుంటున్నారు.

ఎండిపోయిన 7వేల బోర్లు

1.3 కోట్ల జనాభా ఉన్న బెంగళూరువాసుల దాహాన్ని కావేరి జలాలు, బోర్​వెల్స్ తీరుస్తాయి. 95 కిలో మీటర్ల దూరంలో ఉన్న కావేరీ నది నుంచి రోజుకి 145 కోట్ల లీటర్‌‌ల నీళ్లు తీసుకొస్తున్నారు. అటు బోర్‌‌వెల్స్‌‌ నుంచి రోజుకి కనీసం 70 కోట్ల లీటర్ల నీళ్లు తోడుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కావేరి నదిలో నీటి మట్టం తగ్గి.. సాగు, తాగునీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తింది. బెంగళూరు సిటీలో ఉన్న 14,781 బోర్లలో 6,997 బోర్లు ఎండిపోయాయి.  

ప్రత్యామ్నాయ మార్గాలవైపు కర్నాటక

నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నది. రీసైకిల్ చేసిన ట్రీటెట్ వాటర్ వాడుకునేందుకు కాలనీలు, అపార్ట్‌‌మెంట్ అసోసియేషన్లను ప్రోత్సహిస్తున్నది. అక్రమ నీటి ట్యాంకర్ కార్యకలాపాలను అరికట్టేందుకు హెల్ప్‌‌లైన్‌‌లు, కంట్రోల్ రూమ్‌‌లను ఏర్పాటు చేసింది. మరో 100 రోజుల దాకా నీటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదని వాటర్ బోర్డు అధికారులు అంటున్నారు. 

ఒక్కో వ్యక్తికి.. ఎక్కడ.. ఎంత నీళ్లు అవసరం?

  •     దేశంలోని ప్రతి ఒక్కరు రోజుకు నార్మల్​గా 135 లీటర్ల నీళ్లను ఉపయోగిస్తుంటారు. 
  •     సినిమా హాళ్లు, బంకెట్ హాల్స్​లో ఉన్న ఒక్కో సీటులో కూర్చునే వ్యక్తి 15 లీటర్ల నీళ్లు యూజ్ చేస్తుంటాడు.
  •     ఫ్యాక్టరీల్లో పని చేసే ఒక్కో కార్మికుడు రోజుకు 50 లీటర్ల నీళ్లు వాడుకుంటున్నాడు.
  •     100 బెడ్స్ కంటే తక్కువ ఉన్న హాస్పిటల్స్​లో ఒక్కో బెడ్ కోసం 340 లీటర్ల నీళ్లు వినియోగిస్తున్నారు.
  •     100 బెడ్స్​ కంటే ఎక్కువ ఉన్న హాస్పిటల్స్​లో అయితే.. 450 లీటర్లు వరకు వాడుకుంటున్నారు.
  •     హాస్టల్స్​లో ఒక్కో వ్యక్తి 135 లీటర్లు, హోటల్​లో ఉన్న వ్యక్తి రోజుకు 180 లీటర్లు ఉపయోగిస్తున్నాడు.
  •     ఆఫీసుల్లో అయితే.. ఒక్కో ఎంప్లాయ్ 45 లీటర్లు వాడుకుంటాడు.
  •     రెస్టారెంట్స్​లో 70 లీటర్లు, స్కూల్స్​లో స్టూడెంట్స్ 45 లీటర్లు వినియోగిస్తున్నారు.

ఇంట్లో ఒక వ్యక్తి యూజ్ చేసే వాటర్​(లీటర్లలో)

తాగడానికి 5, వంట కోసం 5, స్నానానికి 55, బట్టలు వాష్ చేసుకోవడానికి 20 లీటర్లు ఉపయోగిస్తాడు.  బౌల్స్​ వాషింగ్​కు 10 లీటర్లు, ఇల్లు కడిగేందుకు 10 లీటర్లు, టాయిలెట్​లో ఫ్లష్​ యూజ్ చేస్తే 30 లీటర్లు. మొత్తంగా ఒక్క వ్యక్తికి సగటున రోజుకు 135 లీటర్ల నీళ్లు అవసరం అవుతాయి.

మహారాష్ట్రలో 65 శాతానికి డౌన్​

మహారాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది. 2,994 డ్యామ్​లోని నీళ్ల స్టోరేజీ 2022, డిసెంబర్​తో పోలిస్తే 86 శాతం నుంచి 65శాతానికి పడిపోయింది. నాగ్​పూర్, అమరావతి, ఔరంగాబాద్, నాసిక్, పుణె, కొంకణ్ రీజియన్​లో నీటి వనరులు 84 శాతం నుంచి 36శాతానికి పడిపోయాయి. నీటి కొరతను అధిగమించేందుకు గుజరాత్​ వాటర్ సప్లై గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3,200 కిలో మీటర్ల మేర బల్క్​ పైప్​లైన్​తో కూడిన గ్రిడ్ కోసం రూ.20వేల కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఈ గ్రిడ్ సాయంతో 14,926 గ్రామాలను, 241 నగరాలను నర్మదా నదితో కనెక్ట్ చేయనున్నారు. ఈ గ్రిడ్ కింద 4.36 కోట్ల మంది ప్రజలు.. రోజుకు 320 కోట్ల లీటర్ల నీళ్లను పొందుతారు.