మిర్చి మనది కాదు..

మిర్చి మనది కాదు..

అన్నంలోకి పప్పు ఉన్నా, నోటికి కారంగా ఆవకాయ, కారప్పొడి లేకపోతే ముద్ద దిగదు. ఇడ్లీ, దోశ తినాలన్నా కాస్త కారంగా చట్నీ ఉండాల్సిందే. అంటే.. కారం లేకుండా కూరలు చేయొచ్చేమో కానీ, తినడం మాత్రం మనవల్ల కాదు. ఇది కేవలం మన​ మాట కాదు.. ప్రపంచ దేశాలు ఒప్పుకున్న నిజం. అందుకే ఎన్నో దేశాలకు మనదేశం నుంచే మిర్చి ఎగుమతి చేస్తున్నాం.

మిరపకాయని ఇంగ్లీష్​లో చిల్లీ అంటారు. చిల్లీకి ఆ పేరు స్పానిష్​ పదం ‘చిలె’ నుంచి వచ్చింది. అది కూడా నహుటల్ భాష నుంచి వచ్చింది. స్పెయిన్​ వాళ్లు దీన్ని వాళ్ల సొంత భాషలోకి తీసుకున్నారు. దానికి ఇంగ్లీష్​ను కూడా కలిపారు. పేరు గురించి పక్కన పెడితే.. మిరపకాయని కూరగాయ అనుకుంటారు. కానీ, కాదు. అదొక ఫ్రూట్. మిరప క్యాప్సికమ్ జాతికి చెందిన మొక్క. మిర్చిని వంటల్లో, మందుల తయారీలో వాడతారు. దీన్ని ‘చిల్లీ పెప్పర్’ అని కూడా అంటారు.1937లో ఆల్బర్ట్​ సెజెంట్ గ్యోర్జ్యీ అనే సైంటిస్ట్​ మిర్చి మీద రీసెర్చ్ చేసి అందులో విటమిన్ సి, ఎ, ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్​ ఉన్నాయని చెప్పాడు. అందుకుగానూ ఆయనకు నోబెల్ ప్రైజ్ దక్కింది. అలాగే దీని గురించి చేసిన రీసెర్చ్​లో మరికొన్ని విషయాలు తెలిశాయి. అవేంటంటే.. ఏనుగులకు మిర్చి వాసన పడదు. కయెన్నె పెప్పర్ రకం మిర్చి ఒంటికి గాయమైనప్పుడు రక్తం గడ్డ కట్టేలా చేస్తుందని రీసెర్చ్​లో తేలింది. ఇన్ని విశేషాలున్న మిర్చి మనది కాదు. పరాయి దేశంలో పుట్టి, మనదేశానికి వచ్చింది. వస్తే వచ్చింది కానీ, ఇప్పుడు ఆ దేశాలకు మిర్చిని మనమే ఎగుమతి చేసే స్థాయిలో సెటిల్​ అయిపోయింది.
ఛత్రపతి శివాజీ సైన్యంతో కలిసి మొఘల్స్​కు సవాలు విసురుతూ ఉత్తరం వైపు వెళ్లారు. అలా అప్పుడే నార్త్​ ఇండియాకి మిర్చి పరిచయం అయింది. మొత్తానికి మిరపకాయ మనది కానప్పటికీ ఈ రోజు ప్రపంచంలో అత్యధికంగా వాడేది మనమే. అయితే.. చాలా దేశాలు మిర్చికి బదులు నల్ల మిరియాలు వాడతారు.  ప్రపంచం మొత్తంలో 25 శాతం మిర్చిని పండించేది మనదేశమే. వాటిలోనూ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. తర్వాత మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్, తమిళనాడు ఉన్నాయి. 

నాలుగు వేల రకాలు..
మిర్చిలో దాదాపు నాలుగు వేల రకాలున్నాయి. వాటిలో ‘భూట్ జొలొకియా’ రకం ఒకటి. దీన్ని ‘ఘోస్ట్ మిర్చి’ అని కూడా అంటారు. దీన్ని అస్సాం, మణిపూర్​, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్​ రాష్ట్రాల్లో పండిస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత కారంగా ఉండే మిర్చిగా 2007లో గిన్నిస్ బుక్ ఎక్కింది. దీన్ని పచ్చళ్లు, కారం, చేపలు, పంది మాంసం వండటానికి వాడతారు. కారంలో ఆ తర్వాతి స్థానం కాశ్మీరీ చిల్లీది. ఇది చూడ్డానికి ఎర్రగా ఉండి, వంటల్లో వాడితే రిచ్ లుక్​ వస్తుంది. మూడోది ఆంధ్రప్రదేశ్​లో పండించే గుంటూరు మిర్చి. దీనితో పట్టించిన కారం ప్రపంచం నలుమూలలా ఎగుమతి అవుతోంది. కారంగా, రుచిగా ఉండడంతో ప్రజలు వంటల్లో వాడటానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాగే గుజరాత్​లోని ఖేడా, మెహ్​సెన జిల్లాలో ‘జ్వాల’ చిల్లీ పండుతుంది. దీన్ని ‘ఫింగర్​ హాట్ పెప్పర్’ అని కూడా అంటారు. కేరళలో ‘కాంతారి’ చిల్లీ ఫేమస్. దీన్ని ‘బర్డ్స్ ఐ’ అంటారు. వీటితో మజ్జిగ మిరపకాయలు చేస్తారు. కర్నాటకలో బ్యాడుగ మిర్చి, తమిళనాడులో రామ్నద్ ముండు లేదా గుండు, మణిపూర్​లో ధని, వరంగల్​లో టొమాటో చిల్లీ, తేజ మిర్చి, నెల్లూరులో మద్రాస్​ పూరి, గోవాలో ఖోలా, సిక్కింలో దల్లే ఖుర్సాని... ఇలా వేల రకాల మిరపకాయలున్నాయి. ఎన్ని ఉన్నా.. దేని రుచి దానిదే. 

దక్షిణ అమెరికాలో పుట్టింది
మిరపకాయలు దక్షిణ అమెరికాలోని బొలివియా ప్రాంతంలో పండేవి. పోర్చుగీసు దేశానికి చెందిన ట్రేడర్స్ వీటిని గోవాకి తీసుకొచ్చారు. అయితే, రికార్డుల ప్రకారం16 వ శతాబ్దంలో పోర్చుగీసుకి చెందిన వాస్కో–డ–గామా మిర్చి విత్తనాలను ఇండియాకి తీసుకొచ్చాడు. వాటిని గోవాలో నాటాడు. అలా అప్పటి నుంచి మనదేశంలో మిర్చి పండించడం మొదలైంది. మరి అప్పటివరకు మనవాళ్లు కారం కోసం ఏం వాడారంటే.. నల్ల మిరియాలు. బెంగాల్, మలబార్ తీరాల్లో విరివిగా పండే నల్ల మిరియాలను స్పైస్​ కోసం వాడేవాళ్లు. గోవాలో మొదలైన మిర్చి పంట దక్షిణ భారతదేశానికి విస్తరించింది.