దేశానికి తెలంగాణ ఆదర్శం

దేశానికి తెలంగాణ ఆదర్శం

తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం గురించి ఇవాళ ఇద్దరం చర్చించుకున్నామని చెప్పారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో భేటీ అవుతున్న సీఎం కేసీఆర్ ఇవాళ ముంబై వెళ్లి.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను కలిశారు. ఆయనతో సమావేశం ముగిసిన తర్వాత ముంబైలోని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటికి వెళ్లారు. ఇద్దరూ సుమారు దాదాపు గంటన్నర పాటు దేశ రాజకీయాలపై చర్చించుకున్నారు. అనంతరం వారిరువురూ మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలో మా మధ్య రాజకీయాల గురించి చర్చలు జరిగేవి. కానీ ఇవాళ చర్చలు జరిగిన తీరు పూర్తిగా వేరు. దేశం ఎదుర్కొంటున్న పేదరికం, నిరుద్యోగం, రైతు ఆత్మహత్యల సమస్యలపై డిస్కస్ చేశాం. దేశంలో అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఏం చేయాలన్నది చర్చించాం. ఇవాళ భేటీలో పూర్తిగా రాజకీయాలపై కాకుండా దేశాభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడాం’’ అని పవార్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల కోసం పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ.. యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. నిరుద్యోగం, పేదరికాన్ని నిర్మూలించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపై అందరి నుంచి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించామని, దీనిపై మళ్లీ భేటీ అవుతామని చెప్పారు.

అంతకు ముందు మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. సరికొత్త ఎజెండా, విజన్ తో దేశాన్ని సరైన దారిలో నడిపించాల్సి ఉందన్నారు. ఈ విషయంపైనే శరద్ పవార్ తో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమం మొదలైన 1969 నాటి నుంచి శరద్ పవార్ మద్దతు తెలిపారని అన్నారు. ఆయన చాలా సీనియర్ నేత అని, ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు. త్వరలోనే భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

బ్రిటన్ రాణికి కరోనా పాజిటివ్

రీల్ సీఎంగా యడ్యూరప్ప

ప్రధాని ఎవరన్నది తర్వాత తేల్చుకుంటాం