వరదలతో మనకేం నష్టంలేదు.. ఎవరేమన్నాపట్టించుకోవద్దు

వరదలతో మనకేం నష్టంలేదు.. ఎవరేమన్నాపట్టించుకోవద్దు
  • నగర ప్రజాప్రతినిధులతో మీటింగ్ లో మంత్రి కేటీఆర్
  • ఎవరేమన్నా పట్టించుకోవద్దు కార్పొరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లాలన్న మంత్రి

హైదరాబాద్, వెలుగు: ‘గ్రేటర్​హైదరాబాద్‌లో కురుస్తున్న వానలతో మనకేం నష్టం లేదు. అది ప్రకృతి వైపరిత్యం. గ్రేటర్ ఎన్నికలపై ప్రభావం చూపదు. అనుకున్న టైమ్ కే జీహెచ్ ఎంసీ ఎన్నికలకు పోదాం’ అని నగర ప్రజాప్రతినిధులతో మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. బాధితులకు వరద సాయం చేస్తున్నామని, ఎవరేమన్నా పట్టించుకోవద్దని చెప్పారు. భారీ వర్షాల వల్ల ప్రభావితమైన కాలనీల్లో సహాయ చర్యల పర్యవేక్షణపై మంగళవారం క్యాంపు ఆఫీస్​లో నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్, డిప్యూటీ మేయర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఇప్పటికే ప్రత్యేకంగా అసెంబ్లీ పెట్టి జీహెచ్ ఎంసీ యాక్ట్​ను సవరించామని చెప్పారు. వరద సాయంతో జనాలకు దగ్గర కావాలని, కార్పొరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లాలని ఆదేశించారు. రానున్న పది రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రతి ఎమ్మెల్యే పర్యవేక్షించాలన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్  ప్రకటించిన తక్షణ సహాయం అందేలా చూడాలని చెప్పారు.

సీఎంఆర్​ఎఫ్‌కు ‘జీహెచ్​ఎంసీ’ నేతల 2 నెల్ల జీతం

జీహెచ్ ఎంసీ  ఏర్పాటుచేసిన షెల్టర్ క్యాంపులను పరిశీలించి అక్కడ అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించాలని నేతలను కేటీఆర్​ ఆదేశించారు. ప్రస్తుతం ముంపుకు గురై కష్టాల్లో ఉన్న ప్రతి ఫ్యామిలీకి భరోసా ఇచ్చేలా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినందున పునరావాస పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. సీఎం పిలుపు మేరకు జీహెచ్ ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ రెండు నెలల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నట్టు మీటింగ్​ నిర్ణయం తీసుకున్నారు.