అభివృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్ కావాలి : ఫోరం ఫర్ గుడ్​ గవర్నెన్స్ ఎం. పద్మనాభరెడ్డి

అభివృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్ కావాలి : ఫోరం ఫర్ గుడ్​ గవర్నెన్స్ ఎం. పద్మనాభరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో ఉచితపథకాలకే సింహభాగం నిధులు కేటాయించి, అతి ముఖ్యమైన విద్య, వైద్యానికి తక్కువ నిధులు ఇస్తున్నది. కొన్నేండ్లుగా తెలంగాణ సర్కారు విద్య, వైద్యంపై ఖర్చు తగ్గిస్తూ వస్తున్నదని, అది దీర్ఘకాలికంగా రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని కాగ్ 2021-22 సంవత్సర ఆర్థిక నివేదికలో స్పష్టం చేసింది. విద్యా ప్రమాణాలపై పరిశీలించి నివేదిక ఇచ్చే అసర్ సంస్థ రాష్ట్రంలో పాఠశాల విద్యలో ప్రమాణాలు పడిపోయినట్లు తెలిపింది. విద్యకు ఏటికేడు కేటాయింపులు తగ్గిపోతుండటంతో బడుల్లో సౌలత్​లు సమకూరడం లేదు.‘మన ఊరు - మన బడి’ లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా, నిధులు లేక ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్య, వైద్యానికి 10 శాతం చొప్పున బడ్జెట్​లో కేటాయింపులు చేయాలి.

రై తు బంధు అమలు చేసే పద్ధతిలో కొన్ని మార్పులు కావాలి. చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులకు మాత్రమే వర్తింపచేయాలి. వ్యవసాయం చేసే వారికే రైతుబంధు వర్తింపజేయాలి. పడావు భూములకు రైతుబంధు ఇవ్వడం ఆపేయాలి.నీటిపారుదల శాఖకు సెలవు: తెలంగాణ ఏర్పాటు తర్వాత చేపట్టిన మిషన్​కాకతీయ సత్ఫలితాలను ఇచ్చింది. గ్రామాల్లోని చెరువులు, కుంటలు బాగై, వర్షాలకు నిండుకుండలా మారాయి. దాంతో అధిక సాగు భూమి పెరగడంతోపాటు భూగర్భజలాలూ పెరిగాయి. ప్రస్తుతం చెరువులు, బోరు బావుల కింద పెద్ద ఎత్తున వ్యవసాయం జరుగుతున్నది. కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు. దీంతోపాటు నీరు ఎక్కువగా అవసరమయ్యే వరిపంటకు బదులు ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సుమారు రూ. 2 లక్షల కోట్ల వరకు ప్రభుత్వం నీటి పారుదల శాఖపై ఖర్చు చేసింది. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు చేయడం అవినీతి విమర్శలకు ఊతమిచ్చింది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఒక సంవత్సరం వరకు నీటిపారుదల శాఖ నిధులపై సెలవు ప్రకటించి, కావాల్సిన డీపీఆర్​లు, పెండింగు అనుమతులు తీసుకొని తదుపరి సంవత్సరంలో పనులు మొదలు పెడితే బాగుంటుంది. 
సమాచార, పౌరసంబంధాల శాఖ: ఈ శాఖ పనితీరు సమీక్షించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక్కరోజే దేశంలోని అన్ని వార్త సంస్థలకు అన్ని భాషల్లో ప్రకటనల కోసం సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ శాఖలో ఆశ్రిత పక్షపాతం, అవినీతితో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ శాఖకు ఇచ్చే నిధులు పూర్తిగా తగ్గించి ప్రజాధనాన్ని వృథా కాకుండా చూడాలి. ఉచితాలపై వేటు: సంక్షేమ పథకాల పేరుతో పెద్ద ఎత్తున ఉచితాలు ఇవ్వడంతో అతిముఖ్యమైన విద్య, వైద్యం వంటి రంగాలకు నిధుల లేమి ఏర్పడుతున్నది. కాబట్టి ఉచితాలు తగ్గించాలి.

బతుకమ్మ చీరలు: ఎవరూ చీరలు కావాలని అడగలేదు. ఇది ప్రాధాన్యత లేని పని. అయినా ప్రభుత్వం సాలీన సుమారు రూ. 400 కోట్లు చీరల పంపిణీ కోసం ఖర్చు చేస్తున్నది.

రంజాన్, క్రిస్మస్ విందులు: ప్రభుత్వ ధనాన్ని మతపరమైన పండుగల విందులకు ఖర్చు చేయడం ఆపాలి.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్: ఇంతవరకు ఈ స్కీములకు ప్రభుత్వం సుమారు రూ.1500 కోట్లు ఖర్చుచేసింది. ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించడానికి పని చేయాలే గానీ పెండ్లిళ్లు, చీరె సారెల పంపకం, మతపరమైన విందులు ఇవ్వడానికి కాదు.

నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం: ఈ కార్యక్రమం కింద ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి కోసం సాలీన ప్రభుత్వం రూ.5 కోట్ల రూపాయిలు కేటాయిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా రూ. 800 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ కార్యక్రమం కింద గత 5 ఏండ్లలో జరిగిన పనులను విశ్లేషించగా పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలింది. 8 సంవత్సరాలుగా చేసిన ఖర్చుపై ఇంతవరకు ఏ.జి. ఆడిట్ కూడా కాలేదు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఆపేయాలి. 

మద్యంపై పన్ను: మొన్నటి డిసెంబర్ 31 నాడు కేవలం ఒక్క రోజులో సుమారు రూ. 200 కోట్ల విలువైన మద్యం అమ్మకం జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆబ్కారీ తప్పుడు విధానాలతో ప్రజలు భారీగా మద్యానికి అలవాటుపడుతున్నారు. నేడు రాష్ట్రంలో మద్యం అమ్మకంపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది. మద్యం అమ్మకాలు, లభ్యతపై నిషేధం ఉండాలి. బెల్టు దుకాణాల మూసివేత, మద్యంపై అధిక పన్నులు వేసి దాన్ని ప్రజలకు దూరం చేయాలి. 

పెట్రోలు, డీజిల్​పై పన్ను తగ్గింపు: పక్క రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోలు, డీజిల్​పై పన్ను తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉంది. పెట్రోలు, డీజిల్ పై సుంకం తగ్గిస్తే, వస్తు రవాణాపై భారం తగ్గి ధరలు తగ్గుతాయి. 

ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన: ప్రభుత్వం రైతు బీమా ఇస్తున్నది కానీ, పంటల బీమా అమలు చేయడం లేదు. పంట పోయినప్పుడు బీమా అందితే,  రైతు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి ఉండదు కదా!

ప్రభుత్వ భూముల అమ్మకం: సంక్షేమ పథకాల పేరుతో పెద్ద ఎత్తున ఉచితాలు ఇస్తూ ఆదాయం కోసం భూములు అమ్మడం సమర్థనీయం కాదు.
సంక్షేమ పథకాలకు 25 % బడ్జెట్ పెట్టాలి: రాష్ట్రంలో సుమారు 25 % జనాభా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. కాబట్టి ఉచిత విద్య, వైద్యంతో పాటు పేదల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ లో 25% మించకుండా ఖర్చు చేయాలి. పాలకులకు భారీ కాన్వాయిలు, డాబు, దర్పానికి విపరీతంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది. పాలన ఖర్చూ తగ్గించాలి. గత 8 ఏండ్లుగా పెద్ద ఎత్తున అప్పులు చేయడంతో సాలీన రూ. 20 వేల కోట్ల వరకు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని 2023-–24 బడ్జెట్ కేటాయింపులు, సవరణలు చేయాలి.

దళితబంధు అమలు..

ఇది పేద దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమమే! అయితే దళితబంధు అమలు లోపభూయీష్ఠంగా ఉన్నది. ఇట్లుంటే అనుకున్న ఫలితాలు రావు. సుమారు ఏడాదిన్నర క్రితం దళితబంధు కార్యక్రమాన్ని మొదటగా వాసాలమర్రిలో అమలు చేశారు. ఆ గ్రామంలో దళితబంధు కార్యక్రమం అమలుపై సర్వే చేసినప్పుడు చాలా లోపాలు, అక్రమాలు కనిపించాయి. ఈ గ్రామంలో దళితబంధు అనుకున్న ఫలితాలు సాధించడం లేదు. దళితబంధు అమలులో జరుగుతున్న లోపాలు సరిదిద్ది ముందుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మౌలిక వసతుల కోసం

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మంచి ఆరోగ్య సదుపాయాలు సమకూర్చడంలో అంతగా శ్రద్ధ పెట్టడం లేదు. రాజకీయ నాయకులు, సంపన్నులు, వీఐపీలు ఎవరూ వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి గానీ, ఉస్మానియాకు గానీ వెళ్లడం లేదు. కార్పొరేట్​హాస్పిటళ్లకే వెళుతున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కోసం రాష్ట్ర బడ్జెట్ లో 10 శాతానికి తక్కువ కాకుండా వైద్యరంగానికి నిధులు కేటాయించాలి. రాష్ట్రంలో మౌలికరంగాన్ని అభివృద్ధి పరిస్తే, అది ఆర్థిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. కాబట్టి మౌలిక రంగ అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించాలి. కేంద్రం తమకు సరిగా నిధులు విడుదల చేయడం లేదనే రాష్ట్ర సర్కారు స్థానిక ప్రభుత్వాల విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నది. పంచాయతీలకు, మున్సిపాలిటీలకు హక్కుగా ఇవ్వాల్సిన నిధులు ఇస్తలేదు. నిధుల లేమితో ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న హైదరాబాదు నగరపాలక సంస్థ ఇందుకు ఉదాహరణ. అన్ని గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం నిర్ధేశించిన విధంగా నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. స్థానిక ప్రభుత్వాల కోసం బడ్జెట్​లో కనీసం 25 శాతం నిధులు కేటాయించాలి.

- ఎం. పద్మనాభరెడ్డి,
ఫోరం ఫర్ గుడ్​ గవర్నెన్స్