మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మా దృష్టికి రాలేదు

బార్డర్ పోలీస్ స్టేషన్ వ్యవహారం మా దృష్టికి రాలేదు. ఇదివరకు ఒక కానిస్టేబుల్ పై ఆరోపణలు వస్తే ఆ వ్యక్తిని వేరే దగ్గరకు ట్రాన్స్ ఫర్ చేశాం. పోలీస్ స్టేషన్ అవినీతి వ్యవహారాలపై తప్పకుండా దృష్టి పెడతాం. ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

- చంద్రశేఖర్, సీఐ, గద్వాల

వేధింపుల ఎంపీడీఓ మాకొద్దు

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మండల సర్పంచుల వినతి

నవాబుపేట, వెలుగు: వేధింపుల ఎంపీడీఓ తమకొద్దంటూ నవాబుపేట మండల సర్పంచులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కోరారు. ఆదివారం ఎమ్మెల్యేను షాద్​నగర్​లో కలిసిన సర్పంచులు వారి గోడు తెలిపారు. కొంతకాలంగా ఎంపీడీఓ శ్రీలత రాజకీయం చేస్తూ గ్రామాల్లో జరిగిన పనులకు చెల్లింపులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఊరంచుతండా సర్పంచ్​ వేధింపులు భరించలేక రాజీనామా చేసేందుకు రెడీ అయ్యిందన్నారు. మండలంలో ఎంపీడీఓ బాధితులు  చాలామంది ఉన్నారని చెప్పారు. వెంటనే ఎంపీడీఓను మండలం నుంచి సాగనంపాలని డిమాండ్​ చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సర్పంచుల సంఘం మండల ప్రెసిడెంట్​సత్యం, నాయకులు వెంకటేశ్​యాదవ్​,శంకర్​నాయక్, నర్సింహానాయక్, వెంకటేశ్, భగన్, తరుణ్, లింబ్యానాయక్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. 

వర్షం కురవాలని వరద పాశం

అమనగల్లు, వెలుగు:  తలకొండపల్లి మండలం చెన్నారం ప్రాంతంలో వర్షం కురవాలని ఆదివారం గ్రామ సమీపంలోని మల్లప్ప గుట్ట మల్లికార్జున స్వామి ఆలయంలో సర్పంచ్ స్వప్న భాస్కర్​రెడ్డి ఆధ్వర్యంలో వరద పాశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా తయారుచేసిన పర్వాన్నాన్ని నేలపై పోసి వాన దేవున్ని ప్రార్థించారు. అనంతరం ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్​చైర్మన్​శ్రీనివాస్​రెడ్డి, డైరెక్టర్​రమేశ్​నాయక్​, వార్డుసభ్యులు మల్యనాయక్, రమేశ్, నర్సింహ, చందునాయక్, మల్లయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.  

కరెంట్ షాక్ తో యువకుడు మృతి

అయిజ, వెలుగు: కరెంట్​షాక్​తో ఓ యువకుడు మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిజ మండలం బింగిదొడ్డికి చెందిన గొల్ల ఈరన్న, సరోజమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. అరవింద్(22) పెద్దవాడు. తండ్రికొడుకులు వ్యవసాయం చేస్తున్నారు. మల్దకల్ మండలం తాటికుంట గ్రామ శివారులోని వారి వ్యవసాయ పొలం వద్ద బోరు మోటర్ పాడైంది. ఆదివారం ఉదయం దానికి రిపేర్లు చేసేందుకు సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ఆఫ్ చేయబోయి అరవింద్​షాక్ కు గురై చనిపోయాడు. గమనించిన పరిసర ప్రాంత రైతులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. శవాన్ని పోస్టుమార్టం కోసం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అందివచ్చిన కొడుకు చనిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తండ్రి ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మల్దకల్ పోలీసులు తెలిపారు.

వైభవంగా పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ

అమనగల్లు, వెలుగు: తలకొండపల్లి మండల కేంద్రంలో ఉప్పల చారిటబుల్​ట్రస్ట్​ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అంతకుముందు అమ్మవారి విగ్రహాన్ని ప్రధాన వీధులగుండా ఊరేగించారు. కార్యక్రమంలో సర్పంచ్​లలిత, వార్డుసభ్యులు వెంకటయ్య, శ్రీనివాస్, ఈశ్వర్, విఠల్​తదితరులు పాల్గొన్నారు.
మదనాపురం: మదనాపురం మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన పోచమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వేద పండితులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రాయచూరు నీలగిరి పీఠాధిపతి సూగురయ్య మహాస్వామి చేతులమీదుగా కార్యక్రమం జరిగింది. అనంతరం అమ్మవారిని అలంకరించి  ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి నిర్వహించారు. పాండురంగయ్య శెట్టి దంపతులను ఆంజనేయ ఆలయం తరఫున  మర్యాదపూర్వకంగా గ్రామస్థులు సన్మానించారు. 

ప్రతి వార్డులో పార్కు ఏర్పాటు చేస్తాం    

పాలమూరు, వెలుగు: జిల్లా కేంద్రంలోని ప్రతి వార్డులో పార్కు ఏర్పాటు చేసి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పట్టణంలోని వెంకటేశ్వరకాలనీ హయగ్రీవచారి టెంపుల్ సమీపంలో రూ. 15 లక్షలతో నిర్మించిన ఫ్రీడమ్ పార్కును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణంలో ప్రతి కాలనీలో పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్, పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులను ఏర్పాటు చేస్తామన్నారు. పార్కులో లైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద క్యాంటీన్ ను ప్రారంభించారు. పాలమూరు యూనివర్సిటీలో  రూ. 1.95 కోట్లతో నిర్మించిన వైస్ చాన్సలర్ నివాస సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. పీయూలోని నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. పీయూలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆఫీసర్స్ కు సూచించారు.  

ప్రకృతి వనాలతో ఆహ్లాదం: ఎమ్మెల్యే 

అయిజ: పల్లె, పట్టణ ప్రకృతి వనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని 5, 15, 18 వార్డులలో పట్టణ ప్రకృతి వనాలను చైర్మన్ చిన్నదేవన్నతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పట్టణ ప్రకృతి వనాలలో మొక్కలు నాటి నీళ్లు పోశారు.  

3.4 శాతం పెరిగిన పచ్చదనం

నాగర్ కర్నూల్ టౌన్/వనపర్తి/కోస్గి టౌన్​: హరితహారంతో జిల్లాలో 3.4 శాతం వరకు పచ్చదనం పెరిగిందని కలెక్టర్ ఉదయ్ కుమార్ చెప్పారు. ఆదివారం నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామ శివారులోని రహదారికి ఇరువైపులా అధికారులు, గ్రామ ప్రజలు, ప్రతినిధులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. వజ్రోత్సవాలలో భాగంగా ప్రత్యేక హరితహారం కార్యక్రమం కింద పెద్దఎత్తున మొక్కలు నాటినట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా చెప్పారు. ఆదివారం వనపర్తి మండలం పెద్దగూడెం అటవీ ప్రాంతంలో తిరుమలయ్య గుట్ట పక్కన ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ తో కలిసి, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఆదివారం జిల్లాలోని 14 మండలాలు, 255 గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటినట్లు తెలిపారు. కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని 3, 8వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష మొక్కలు నాటారు.   

నారాయణపేట/గద్వాల: హరితహారం టార్గెట్ ​పూర్తిచేయాలని నారాయణపేట  కలెక్టర్​ హరిచందన​అన్నారు. ఆదివారం  దామరగిద్ద సుభాష్​రోడ్​లో సామూహిక హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.  జోగులాంబ గద్వాల జిల్లాలో వజ్రోత్సవాలు సక్సెస్ ఫుల్ గా ముగిశాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్పారు. ఆదివారం గద్వాల మండలం గూడూరు బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు.

డబుల్​ బెడ్​రూమ్ ​ఇండ్లియ్యాలంటూ దీక్ష

అచ్చంపేట, వెలుగు: కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చడం లేదని టీడీపీ అచ్చంపేట నియోజకవర్గ ఇన్​చార్జ్ డాక్టర్ మోపతయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని, సొంత స్థలం ఉన్నవారికి రూ. ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ అచ్చంపేట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల నిరాహార దీక్ష ఆదివారం ప్రారంభమైంది. దీక్షకు మోపతయ్య మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు దేశ్యనాయక్, మల్లేశ్, శంకర్​నాయక్​తదితరులు పాల్గొన్నారు. 

గిరిజనుల సంస్కృతికి ప్రతీక తీజ్

కల్వకుర్తి, వెలుగు: గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్​అన్నారు. ఈ నెల 12న తీజ్​వేడుకలు ప్రారంభం కాగా ఆదివారం కల్వకుర్తిలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు.  గిరిజనులతో కలిసి మంత్రి మొలకల పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాయిద్యం వాయిస్తూ యువతులు, మహిళలు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఢిల్లీలో టీఆర్ఎస్​ప్రతినిధి మంద జగన్నాధమ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వై స్ చైర్మన్ బాలాజీసింగ్ తదితరులు పాల్గొన్నారు.