వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేక్ వాక్ కష్టమే

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేక్ వాక్ కష్టమే

ఒక పద్ధతిగా ఎదుగుతూ రావడమనేది బీజేపీకి మొదటి నుంచీ అలవాటు. జనతా పార్టీ ప్రయోగం ఫెయిలయ్యాక… పాత జనసంఘ్​ కొత్త రూపంతో భారతీయ జనతా పార్టీగా మారింది. బీజేపీ ఎదుర్కొన్న మొట్టమొదటి లోక్​సభ ఎన్నికల్లో (1984లో) వచ్చినవి రెండే రెండు సీట్లు. గెలిచినవారు హనుమకొండ (ఏపీ) నుంచి చందుపట్ల జంగారెడ్డి, మెహ్​సానా (గుజరాత్​) నుంచి డాక్టర్​ ఏ.కె.పటేల్​. ఆ తర్వాత జరిగిన తొమ్మిది ఎన్నికల్లోనూ స్థిరంగా సీట్ల సంఖ్యను పెంచుకుంటూ, మొన్నటి ఎన్నికల్లో 303 సీట్లు సాధించగలిగింది. ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్​లోనూ తన స్ట్రేటజీని అమలు చేస్తోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లతో ఖాతా తెరిచింది. ప్రస్తుతం 126 సెగ్మెంట్లలో బలంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్​ సరిహద్దుల్లో ఉన్న ఎనిమిది ఎంపీ సీట్లను గెలవడంతో, దాని పరిధిలోని 56 అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుగులేని శక్తిగా మారింది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే… బంగ్లా బోర్డర్​ సీట్లలో ముస్లిం ఓటర్లు ఎక్కువ. బీజేపీ గెలిచిన 18 లోక్​సభ సీట్లలో రాయ్​గంజ్​ చాలా ముఖ్యమైంది. ఇక్కడ సగానికి పైగా ముస్లిం ఓటర్లే ఉండగా, దాదాపు 60 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి దేబశ్రీ చౌధురి గెలిచారు.

పశ్చిమ బెంగాల్​లోని టోటల్​ అసెంబ్లీ సీట్ల సంఖ్య 294 కాగా దాదాపు 90 చోట్ల ఎన్నికల ఫలితాలను ముస్లింలే ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. రాష్ట్రం మొత్తంమీద 31 శాతానికి పైగా ఉన్న ఈ మైనారిటీలే అన్ని ఎన్నికల్లోనూ మెజారిటీ డిసైడింగ్​ ఫ్యాక్టర్​. తృణమూల్​ కాంగ్రెస్​ (టీఎంసీ) పార్టీ చీఫ్​ మమతా బెనర్జీ 2011లో పవర్​లోకి వచ్చేదాక ఈ ట్రెండే​ కొనసాగింది. 2016లోనూ వీళ్లు తృణమూల్​కే ఓటేశారని ఎనలిస్టులు లెక్కలేస్తున్నారు. అంతకుముందు వీళ్లంతా లెఫ్ట్​ పార్టీలతోపాటు కాంగ్రెస్​ పార్టీకి ఓట్లేసేవారు. గడచిన పదేళ్లుగా ‘మమతా బెనర్జీకే మా ఓటు’ అంటున్నారు.

అయితే… ఇప్పుడు పరిస్థితి మారబోతోందని పొలిటికల్​ అనలిస్ట్​లు అంచనా వేస్తున్నారు.  హిందువుల ఓట్లు ఎలాగూ బీజేపీకి పడతాయని భావించిన తృణమూల్​కి మొన్నటి లోక్​సభ ఎన్నికలతో కొత్త బెంగ పట్టుకుంది.  15 నుంచి 20 శాతం ముస్లిం ఓట్లున్న చాలా చోట్ల బీజేపీకి 5 శాతం వరకు పడ్డాయని పోల్​ పండిట్లు లెక్కలు తీశారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయని దీదీ మనాది పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఫైర్​ బ్రాండ్​గా పేరుబడ్డ మమతా బెనర్జీ ఇప్పుడు ముస్లిం ఓటర్లను మంచి చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు.

లోక్​సభ ఎన్నికల్లో బెంగాల్​ ఓటర్లు రెండుగా విడిపోయారు. హిందూ కార్డుతోపాటు సిటిజన్​షిప్​ ఇష్యూని తెరపైకి తెచ్చిన బీజేపీకి ఒక వర్గం అండగా నిలిచింది. ముస్లింల ఓట్లపైనే ఆధారపడ్డ తృణమూల్​ని మరో వర్గం బలపరిచింది. మతువా కమ్యూనిటీ కూడా ఇలాగే బీజేపీ వైపే మొగ్గినట్లు ఫలితాల్ని బట్టి తెలుస్తోంది. వీళ్లు గతంలో మమతాకి సపోర్టర్లు. వాళ్ల ఓట్లు చీలితే చివరికి బీజేపీయే బాగుపడుతుందేమోనని టీఎంసీ బెంగ పెట్టుకుంటున్నట్లు అనిపిస్తోంది.

సీట్లు తగ్గినా.. ఓట్లు పెరిగాయ్​!

2014తో పోలిస్తే, 2019 లోక్​సభ ఎన్నికల్లో తృణమూల్​కి12 సీట్లు తగ్గిపోయాయి. అప్పట్లో 34 మంది ఎంపీలు గెలవగా, ఈసారి 22 మందే లోక్​సభలో అడుగుపెట్టగలిగారు. ఈ ఎదురుదెబ్బ నుంచి తృణమూల్​ క్రమంగా కోలుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, 12 సీట్లు తక్కువయినా 5 శాతం ఓట్లు పెరగటం విశేషం. ఇవన్నీ ముస్లింల ఓట్లేనని ఎనలిస్టులు అంటున్నారు. అదే సమయంలో 2016 అసెంబ్లీ ఎలక్షన్​ కంటే ఇప్పుడు బీజేపీ ఓట్​ షేర్​ 27 శాతం పెరిగింది.  బీజేపీ పుంజుకుంటూ ఉండటం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. తృణమూల్​ కేవలం ముస్లింల ఓట్లపైనే ఆశలు పెట్టుకోకుండా ఇకపైన హిందూ ఓట్ల శాతాన్ని పెంచుకోవటంపైకూడా దృష్టి పెట్టాలని​ ఆ పార్టీ సీనియర్లు సూచిస్తున్నారు. ఆ ఓట్లను తన వైపు తిప్పుకోవటానికి మమతా బెనర్జీ పావులు కదలపాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మైనారిటీ డేమినేషన్​గల 90 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఎంసీ ఎమ్మెల్యేలున్నారు.

రెండు భయాలు…

మమతా బెనర్జీని పీడిస్తున్న భయాలు రెండు అంటున్నారు విశ్లేషకులు. ఒకటి ముస్లిం డామినేటెడ్​ సెగ్మెంట్లలో బీజేపీ పుంజుకోవడం, రెండోది దేశమంతా సిటిజన్​షిప్​ రిజిస్ట్రీ (ఎన్నార్సీ) చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రకటించడం. ఎన్నార్సీని పశ్చిమ బెంగాల్​లో అమలు చేస్తే చాలా మైనారిటీ ఓట్లు గల్లంతయ్యే ప్రమాదముందని, బంగ్లా స్వతంత్ర పోరాట సమయంలో అక్కడి నుంచి పొరుగున ఉన్న ఇండియాకి పెద్ద సంఖ్యలో మైనారిటీలు వచ్చేసి, వెనక్కి వెళ్లకుండా సెటిలైపోయారని చెబుతున్నారు. అస్సాంలో మాదిరిగా పక్కాగా ఎన్నార్సీని చేపడితే పశ్చిమ బెంగాల్​లో చాలామందికి సిటిజన్​షిప్​ గల్లంతవుతుంది. జల్పాయ్​గురి, రాయ్​గంజ్​, డార్జిలింగ్​ వంటి నియోజకవర్గాల్లో సెటిలైన బంగ్లా వలసదారుల్ని పంపేయాల్సి వస్తుంది. దీనిపై బీజేపీ చాలా పట్టుదలగా ఉంది. ‘మన ప్రజల నోటికాడ కూడు లాక్కుని ఇతరులకు పెట్టడానికి ఇండియా ధర్మ సత్రం కాదు’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్​ విజయవర్గీయ తెగేసి చెబుతున్నారు. బెంగాల్​ ఓటర్లలో వీళ్లు చాలా కీలకమని, అందుకే ఎన్నార్సీని తృణమూల్​ అడ్డుకోవాలని చూస్తోందని బీజేపీ బాగా ప్రచారంలో పెట్టింది. బంగ్లా నుంచి వచ్చినవాళ్లలో 20 శాతం మంది హిందువులు, 30 శాతం ముస్లింలు పశ్చిమ బెంగాల్​లో ఉన్నట్లు అంచనా.