ఈవీలతో బెనిఫిట్ ఏంటి?

ఈవీలతో బెనిఫిట్ ఏంటి?

కొత్తగా కారు లేదా బైక్ కొనాలనుకునేవాళ్లలో ఇప్పుడు చాలామందిని ఒక డౌట్​ వస్తోంది. అంటే.. ఎలక్ట్రిక్ వెహికల్ బెటరా?  పెట్రోల్ వెహికల్ బెటరా? అని. ఈ డౌట్ ఒకప్పుడు ఉండేది కాదు. కానీ కొంతకాలంగా ట్రెండ్ మారింది. చడీచప్పుడు లేకుండా దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ)లను చూసి జనం మనసు పారేసుకుంటున్నారు. కొందరు గేర్ మార్చి ఎలక్ట్రిక్‌‌కు షిఫ్ట్ అవుతుంటే మరికొందరు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అసలు ఈవీలతో బెనిఫిట్ ఏంటి?  ప్రభుత్వం చెప్తున్నట్టు ఫ్యూచర్ అంతా ఈవీలదేనా? ఎలక్ట్రిక్ వాహనాలతో లైఫ్‌‌స్టైల్ ఎలా మారబోతోంది? అనేదే ఈ వారం కవర్​స్టోరీ.

ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లకు నెలనెలా  బుకింగ్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికే మనదేశంలో 13,92,265 ఎలక్ట్రిక్ వెహికల్స్ నడుస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరికి వాటి సంఖ్య 40 లక్షలకు చేరుకుంటుందని, వచ్చే రెండేళ్లలో 3 కోట్లకు చేరుతుందని ఆటోమోటివ్ ఎక్స్​పర్ట్స్​ అంచనా వేస్తున్నారు. మరోపక్క ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌‌లో దాదాపు 250 స్టార్టప్‌‌లు పనిచేస్తున్నాయి.  మారుతి నుంచి మెర్సిడెస్ వరకూ ప్రతి ఆటోమొబైల్ కంపెనీ ఒకట్రెండు ఎలక్ట్రిక్ కార్‌‌‌‌ మోడల్స్‌‌ రిలీజ్ చేస్తోంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నా వాటిని ఉపయోగించడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి.  

మారిన ట్రాన్స్‌‌పోర్ట్ స్టైల్

కొవిడ్ తర్వాత ప్రయాణాల్లో చాలా మార్పులొచ్చాయి. పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌కు బదులు సొంత వెహికల్స్‌‌లో వెళ్లడానికే  జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే రెండేండ్లుగా కార్లు, బైక్​లు వాడుతున్నవాళ్ల సంఖ్య బాగా పెరిగిందని సర్వేలు చెప్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ రోడ్‌‌పై ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ట్రెండ్ ఇంకా పెరిగింది. ముఖ్యంగా ‘సిటీలో తిరిగేందుకు ఒక ఎలక్ట్రిక్ టూవీలర్ ఉంటే సరిపోతుంద’ని చాలామంది అనుకుంటున్నారు. అందుకే గ్రామాల కంటే పట్టణాలు, నగరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త కారు లేదా బైక్ కొనాలనుకునే వాళ్లు ఎలక్ట్రిక్ వెహికల్‌‌ను ఆప్షన్‌‌గా పెట్టుకుంటున్నారు. 

ముందు నుంచే ఉన్నా..

నిజానికి పెట్రోల్ మోటార్, ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్​ దాదాపు ఒకే టైంలో మొదలయ్యాయి. ముందు స్టీమ్‌‌తో నడిచే కార్లు ఉండేవి. ఆ తర్వాత గ్యాసోలీన్, ఎలక్ట్రిక్, డీజిల్‌‌తో నడిచే కార్లు వచ్చాయి.  కానీ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ మాత్రమే మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. ప్రపంచంలో ఫస్ట్ మోటార్ వెహికల్ అయిన ‘బెంజ్ పేటెంట్ మోటార్ కార్’(1886 ) కన్నా ముందే ఎలక్ట్రిక్ మోటార్‌‌‌‌తో నడిచే వాహనాల మోడళ్లు డిజైన్ చేశారు. కానీ అవి అంత పాపులర్ అవ్వలేదు. ఎక్కువ స్పీడ్, పవర్‌‌‌‌తో నడిచే ఎలక్ట్రిక్ మోటార్స్ అప్పటికి డెవలప్ కాకపోవడం వల్ల పెట్రోల్ వెహికల్స్‌‌కి పాపులారిటీ పెరిగింది. పెట్రోల్ ఇంజిన్స్‌‌లో రకరకాల అడ్వాన్స్‌‌డ్ డెవలప్‌‌మెంట్స్ వచ్చాయి. ఆటోమొబైల్ కంపెనీలు ‘పెట్రోల్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్’ టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసుకున్నాయి. పోటీ పడి మరీ కొత్త కొత్త కార్ల మోడళ్లు తయారుచేశాయి. అలా సాధారణ ప్రజలకు పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు దగ్గరై, ఎలక్ట్రిక్ మోటార్లు దూరమయ్యాయి. తక్కువ ఖర్చుతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్లు ముందునుంచే ఉన్నా అప్పట్లో వాటికి ఆదరణ లేదు. పెట్రోల్ కొరత వల్ల మళ్లీ ఇప్పుడు వాటి అవసరం ఏర్పడింది. పెట్రోల్‌‌తో పోలిస్తే కరెంట్ ఉత్పత్తికి ఎక్కువ సోర్స్​లు ఉన్నాయి. రెన్యువబుల్ సోర్స్‌‌ల ద్వారా తక్కువ ఖర్చుతో కరెంట్ తయారు చేసే టెక్నాలజీలు రావడం వల్ల ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్సే ఫ్యూచర్ ఆల్టర్నేటివ్స్‌‌గా కనిపిస్తున్నాయి. అలాగే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీల్లో కూడా మార్పులు వచ్చాయి. ఎక్కువ స్పీడ్, పవర్‌‌‌‌తో కూడిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారవుతున్నాయి.

పోలికలేంటి?

పెట్రోల్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ చూడ్డానికి ఒకేలా కనిపించినా వాటి లోపలి మెకానిక్స్ పూర్తిగా వేరు. పెట్రోల్‌‌తో నడిచే ఇంజిన్‌‌కు బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటర్‌‌‌‌కు ఎలాంటి పోలిక లేదు. వీటి మధ్య చాలా తేడాలున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. బ్యాటరీ కెపాసిటీని బట్టి అది వెళ్లగలిగే దూరం మారుతుంటుంది. అలాగే వీటికి ఫ్యూయెల్‌‌‌‌‌‌‌‌, మెయింటెనెన్స్‌‌‌‌ ఖర్చులు తక్కువ. ఉదాహరణకు ఒక వ్యక్తి మామూలు కారులో రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే నెలకు పెట్రోల్‌‌‌‌‌‌‌‌కు దాదాపు ఐదువేలా రూపాయలు ఖర్చవుతుంది. ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ కారు అయితే ఎనిమిది వందల రూపాయలలోపే ఖర్చవుతుంది. ఐదేళ్లకు మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌ ఖర్చులు25వేల రూపాయలకు మించవని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు చెప్తున్నాయి. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ వల్ల కాలుష్యం ఉండదు. శబ్దం రాదు. వీటికి గ్రీన్​ కలర్​ నెంబర్​ ప్లేట్​ ఉంటుంది. వీటి కొనుగోలుపై రూ.1.5 లక్షల వరకు పన్ను రాయితీలు పొందొచ్చు. ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వేరియంట్లకు రోడ్‌‌‌‌‌‌‌‌, రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ ఛార్జీలు ఉండవు. జీఎస్టీ ఐదు శాతం మాత్రమే. కొన్ని రాష్ట్రాలు ఒక బండి కొలుగోలుకు పదివేల రూపాయల నుంచి రూ.1.5 లక్షల వరకు సబ్సిడీ కూడా ఇస్తున్నాయి. 

సాధారణ పెట్రోల్ కారులో 25వేల పార్ట్స్‌‌ ఉంటాయి. వాటిలో ఎంతో ముఖ్యమైన, కదిలే పార్ట్స్‌‌ వెయ్యికి పైనే. అదే ఎలక్ట్రిక్‌‌ వాహనంలో కదిలే పార్ట్స్‌‌ కేవలం 20 మాత్రమే. అంటే ఈవీల మెయింటెనెన్స్ ఖర్చు ఎంతో తక్కువని అర్థమవుతుంది. విడిభాగాలు తగ్గడంతో రిపేర్ అవసరమయ్యే అవకాశాలు, రిపేరింగ్ ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఎలక్ట్రిక్ వాహనాలు అంత త్వరగా పాడవ్వవు. కాబట్టి వీటికి పెట్రోల్ వెహికల్స్‌‌ కంటే చాలా ఎక్కువ రీసేల్ వాల్యూ ఉంటుంది.

కామన్ డౌట్స్ ఇవే..

పెట్రోల్ ఎప్పటికీ పర్మినెంట్ సొల్యూషన్ కాదని గ్రహించిన చాలామంది పెట్రోల్ వెహికల్స్‌‌కు గుడ్‌‌బై చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌కు వెల్‌‌కమ్ చెప్తున్నారు. అయితే కొంతమందికి మాత్రం మనసులో ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వెహికల్ కొనాలని ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆగిపోతున్నారు. ‘బయటకు వెళ్లినప్పుడు ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌ ఎలా?’, ‘తగినన్ని ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు ఉన్నాయా?’, ‘ఈవీలు కాలిపోతాయేమో!’ వంటి డౌట్లు వస్తున్నాయి. పైగా   పెట్రోల్​ బండ్ల కంటే ఎలక్ట్రిక్​ వెహికల్స్ ధర ఎక్కువ. ఇటీవల చేసిన ఓ సర్వేలో కొంతమందిని “ రాబోయే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్‌‌ స్కూటర్‌‌ కొనాలనుకుంటున్నారా?” అని ఆరా తీస్తే.. 32 శాతం మందికి ఎలక్ట్రిక్‌‌ స్కూటర్ల సేఫ్టీ, పర్ఫార్మెన్స్ పై డౌట్ ఉన్నట్టు చెప్పారు. అలాగే మరో 5 శాతం మంది కొనడానికి  సిద్ధంగా ఉన్నా.. అన్ని సదుపాయాలు అందుబాటులో లేని కారణంగా వెనక్కి తగ్గుతున్నట్లు చెప్పారు. జనాల్లో ఉన్న ఈ డౌట్స్‌‌ను పోగొట్టడానికి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.  ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్ మార్కెట్‌‌‌‌ ప్రస్తుతం మొదటి స్టేజ్‌‌లో ఉంది. వీటి ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను పెంచడానికి, రాయితీలకు ప్రభుత్వాలు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాయి. 2026 నాటికి ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ కార్ల వాటా12 శాతానికి పెరుగుతుందని అంచనా. 

ప్రభుత్వం ఏమంటోంది?

ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది. 2030 నాటికి దేశంలో 30 శాతం ప్రైవేటు కార్లు, 70 శాతం కమర్షియల్ వెహికల్స్, 40 శాతం బస్సులు, 80 శాతం టూ వీలర్స్, త్రీ వీలర్స్.. ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది.  అయితే, టూవీలర్స్ సేల్స్ కొంతవరకూ లక్ష్యానికి దగ్గరగా వెళ్తున్నాయి. ఈవీల్లో కార్లు, బస్సులు, లారీల వంటి వాటికి డిమాండ్ అంతగా ఉండడం లేదు. అందుకే వీటి ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం రూ.26,000 కోట్ల రూపాయలను అందించడానికి సిద్ధంగా ఉంది. 

దేశంలో ఛార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉండడం, బ్యాటరీ మార్చుకునే సదుపాయం లేకపోవడం, సెకండ్ హ్యాండ్ పెట్రోల్ కార్లకు భారీ మార్కెట్ ఉండడం వంటివి ప్రభుత్వానికి సమస్యలుగా మారాయి. చైనాలో తొమ్మిది లక్షల ఛార్జింగ్ స్టేషన్లు ఉంటే, మనదేశంలో రెండువేల లోపే ఉన్నాయి. అందుకే ఇప్పుడు స్టేషన్లు పెంచడంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. కొత్తగా ఏర్పాటు చేసే పెట్రోలు బంకుల్లో ఈవీ ఛార్జింగ్‌‌ స్టేషన్లు, సీఎన్‌‌జీ అవుట్‌‌లెట్లు వంటివాటి ఏర్పాటుకు కొత్త లైసెన్సింగ్‌‌ రూల్స్‌‌ను తీసుకొచ్చింది.

ఈవీల వాడకం పెంచడం ద్వారా దేశానికి మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ బండ్లు కార్బన్ ఎమిషన్స్‌‌ను తగ్గిస్తాయి. కార్బన్ ఎమిషన్స్‌‌ను విడుదల చేస్తున్న దేశాల్లో మనదేశం ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. అందుకే కచ్చితమైన వాతావరణ లక్ష్యాలను పెట్టుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ కోసం విపరీతమైన పోటీ ఉంది. పెట్రోల్ దిగుమతి కోసం మనదేశం ఏటా24.7 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకోడానికి ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఒక్కటే ఆల్టర్నేటివ్ అని ప్రభుత్వం భావిస్తోంది. వీటితోపాటు ఈవీలతో కొత్త ఉద్యోగాలు కూడా పెరగుతాయి. ఈవీల మాన్యుఫాక్చరింగ్, సర్వీస్‌‌కు స్కిల్స్ ఉన్న ఉద్యోగులు అవసరమవుతారు. దీంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. 

ఎలక్ట్రిక్ ట్రాన్స్‌‌పోర్ట్ 

దేశంలో ఎక్కడా లేని విధంగా బెంగళూరు సిటీలో 54వేల ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్ రోడ్ల పైకి వచ్చేశాయి. ఈవీలు వాడుతున్న నగరాల్లో బెంగళూరు ఫస్ట్ ప్లేస్‌‌లో ఉంటే ఢిల్లీ సెకండ్ ప్లేస్‌‌లో ఉంది. అలాగే  పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్ట్, ప్రభుత్వ అవసరాలకు ఈవీలను వాడటంలో కోల్‌‌కతా ముందుంది.. పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌లో ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం దేశంలో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇప్పటికే కర్ణాటక, ఢిల్లీలో పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌కు ఈవీలు వాడుతున్నారు. కోల్‌‌కతాలో 210 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యనే కోల్‌‌కతా పోలీసులు 200 ఈవీ కార్లు కొన్నారు.  అక్కడి ప్రభుత్వ అధికారులు కూడా బ్యాటరీలతో నడిచే కార్లనే వాడుతున్నారు.ఢిల్లీలో ఈవీల వాడకంపై ఇప్పుడిప్పుడే జనాల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రభుత్వ సంస్థలు రాయితీలు ఇస్తుండటంతో సేల్స్ పెరుగుతున్నాయి. ముంబైలో పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్ట్ బాగుండడంతో ఈవీలపై మధ్యతరగతి జనం అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.  యువకులు, స్టూడెంట్స్ మాత్రమే ఎలక్ట్రిక్‌‌ బైకులు వాడుతున్నారు. హైదరాబాద్‌‌లో ఈవీలకు బాగానే డిమాండ్ ఉంది. ప్రస్తుతం సిటీలో పదివేలకు పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈవీల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఛార్జింగ్ స్టేషన్లు

కొన్ని పబ్లిక్‌‌‌‌‌‌‌‌, ప్రైవేటు కంపెనీలు పెట్రోలు బంకులు, ఇతర ప్రాంతాల్లో ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇండియన్‌‌ ఆయిల్‌‌ కార్పొరేషన్‌‌(ఐవోసీ) సంస్థ రానున్న మూడేళ్లలో దేశవ్యాప్తంగా పది వేల ఛార్జింగ్‌‌ స్టేషన్స్​ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల టాటా పవర్‌‌ సంస్థ దేశవ్యాప్తంగా వెయ్యి ఛార్జింగ్‌‌ స్టేషన్స్​ ఏర్పాటు చేసింది. ఎలక్ట్రిక్‌‌ స్కూటర్ల తయారీ సంస్థ ‘ఏథర్‌‌ ఎనర్జీ’ కూడా 2022 నాటికి దాదాపు 6,500 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ఆటమ్ సంస్థ దేశ వ్యాప్తంగా 250 సోలార్ పవర్డ్ ఛార్జింగ్ స్టేషన్స్​ ఏర్పాటుచేసింది. అలాగే ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్‌‌కు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ కోసం రిలయన్స్‌‌ బీపీ మొబిలిటీ లిమిటెడ్‌‌ (ఆర్‌‌బీఎంఎల్‌‌) మహీంద్రా గ్రూప్‌‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 

వీటితోపాటు ఇప్పటికే  తక్కువ ధరలో ఛార్జింగ్‌‌ పాయింట్ల తయారీకి పలు సంస్థలు రెడీ అయ్యాయి. ఇ‌‌– స్కూటర్లు, ఇ– ఆటో రిక్షాలను ఛార్జ్‌‌ చేసేందుకు ఇ–ఛార్జింగ్‌‌ పాయింట్లు రానున్నాయి. ఈ ఛార్జింగ్ పాయింట్స్​ 3కిలోవాట్​(కేవీ) కరెంట్‌‌ను ఉపయోగించుకుంటాయి. 220వీ 15ఏ సింగిల్‌‌ ఫేజ్‌‌ విద్యుత్‌‌ లైన్‌‌ ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఈ పాయింట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. మెట్రో, రైల్వే స్టేషన్ల పార్కింగ్‌‌ ప్రదేశాల్లోను, షాపింగ్‌‌ మాల్స్, ఆసుపత్రుల్లో, ఆఫీస్‌‌ కాంప్లెక్స్, అపార్ట్‌‌మెంట్లతో పాటు కిరాణా, ఇతర దుకాణాల దగ్గర కూడా వీటిని ఈజీగా ఏర్పాటు చేయొచ్చు.

గ్రేటర్‌‌ హైదరాబాద్ పరిధిలో టీఎస్‌‌ రెడ్కో, జీహెచ్‌‌ఎంసీ కలిసి 300 ఛార్జింగ్‌‌ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్లాన్‌‌లో ఉన్నారు. సిటీ సెంటర్స్, అవుట్ స్కర్ట్స్‌‌తో పాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు రాబోతున్నాయి. కేబీఆర్‌‌ పార్కు చుట్టూ, నానక్‌‌రామ్‌‌గూడ, వనస్థలిపురం, ఉప్పల్‌‌ మెట్రోరైల్‌‌ పార్కింగ్‌‌, అబిడ్స్‌‌, ట్యాంక్‌‌బండ్‌‌పై వీలైనంత వేగంగా ఛార్జింగ్‌‌ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు.

..కానీ ధరలు ఎక్కువ

ఎలక్ట్రిక్ వాహనాలతో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. పెట్రోల్ కారు ధరలతో పోలిస్తే ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ కార్ల ధరలు చాలా ఎక్కువ. ఫ్యూయెల్‌‌‌‌‌‌‌‌, రన్నింగ్‌‌‌‌‌‌‌‌, మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌ తక్కువే అయినా ఇన్సూరెన్స్ ఖర్చులు కాస్త ఎక్కువ. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు లేవు.  ఫాస్ట్‌‌‌‌ ‌‌ఛార్జర్‌‌‌‌‌‌‌‌ వాడినా పూర్తి ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌కు గంట టైం పట్టడం మరో సమస్య . ఎక్కువ దూరం ప్రయాణాలకు ఇవి అనువుగా ఉండవు. అద్దె ఇళ్లలో ఉండేవాళ్లకు ఛార్జింగ్ సమస్యలు ఉండొచ్చు. అలాగే మనదేశంలో ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ కార్ల మోడల్స్‌‌ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. బ్యాటరీల ధర చాలా ఎక్కువ. మూడు నాలుగేళ్లకోసారి బ్యాటరీలను మార్చాలి. సర్వీసింగ్ సెంటర్లు, టెక్నీషియన్ల కొరత ఉంది.

సేల్స్ పెరిగాయి

కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ భవిష్యత్​ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అనడంలో సందేహం లేదు.  ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కొత్త కార్లలో 26 శాతం ఈవీలేనని లెక్కలు చెప్తున్నాయి.  డీజిల్‌‌ లేదా పెట్రోల్​ను మండించడం ద్వారా పరుగు తీసే ఇంటర్నల్‌‌ కంబషన్‌‌ ఇంజిన్‌‌ (ఐసీఈ) వాహనాలకు 2037 కల్లా గుడ్​బై చెప్పాలని యూరప్​, అమెరికాల్లోని కార్ల కంపెనీలు నిర్ణయించుకున్నాయి. కొన్ని కంపెనీలైతే 2030కే వాటి ఉత్పత్తిని నిలిపేస్తామని ప్రకటించాయి. సేల్స్‌ పెంచడం కోసం ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి ఆటో మొబైల్ కంపెనీలు. యూజర్స్‌‌కు నచ్చేలా రకరకాల మోడల్స్‌‌లో కొత్తకొత్త ఈవీలు తీసుకురావడంపై ఫోకస్ పెడుతున్నాయి.

ఆన్‌‌లైన్ సేల్స్

కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్స్.. తమ నెట్‌‌వర్క్‌‌ను సెట్ చేసుకునేందుకు డీలర్‌‌ మోడల్‌‌కు బదులు ఆన్‌‌లైన్‌‌ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఇప్పటికే ఈవీ మార్కెట్లో ఉన్న ఓలా, ఏథర్, ఆటమ్ వంటి  సంస్థలు ఆన్‌‌లైన్‌‌ పోర్టల్స్ ద్వారానే బుకింగ్స్ చేస్తున్నాయి.

 నో రిజిస్ట్రేషన్‌‌

ప్రస్తుతం 250 వాట్‌‌ ఎలక్ట్రిక్‌‌ మోటార్‌‌, 25 కిలోమీటర్లకన్నా తక్కువ వేగం ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌కు ఎలాంటి రిజిస్ట్రేషన్‌‌ అవసరం లేదు. వీటిని నడిపేందుకు లైసెన్స్ కూడా అవసరం లేదు. ఈ కారణం వల్ల కుడా చాలామంది వీటిని తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

ఆఫ్టర్ సేల్స్ సర్వీస్

ఎలక్ట్రిక్ వాహనాలను సర్వీసింగ్‌‌ చేయించడం ఎలా? అన్న ప్రశ్న చాలామందికి ఉంటుంది. దీనికి ఈవీ సంస్థలే  సొల్యూషన్ చూపిస్తున్నాయి. రిమోట్‌‌ సర్వీసింగ్‌‌ అందించడంతోపాటు.. ఇంటికే వచ్చి సర్వీసింగ్‌‌ చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా సర్వీసింగ్‌‌ స్టేషన్లతో ఒప్పందం కుదుర్చుకుని మరీ సర్వీస్‌‌ అందిస్తున్నాయి.

సేఫ్టీ

ఇటీవల కొన్ని ఎలక్ట్రిక్​ వెహికల్స్ కాలిపోవడం వల్ల చాలామందికి ఈవీలపై భయం ఏర్పడింది. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కొన్ని నాసిరకం బ్యాటరీలే దీనికి కారణం. ఈవీల్లో ఉండే లిథియం-అయాన్‌‌ బ్యాటరీల్లో దాదాపు 100 నుంచి 200 వరకూ సెల్స్‌‌ ఉంటాయి. వాటిని బ్యాటరీలో ప్యాక్‌‌చేసే విధానంలో తేడాలుంటే అవి పేలిపోయే అవకాశం ఉంటుంది. బ్యాటరీ లోపల షార్ట్‌‌సర్క్యూట్‌‌ జరగడం, నాసిరకం సెల్స్‌‌ ఉండటం, బ్యాటరీ డిజైన్‌‌లో లోపాలు లాంటివి పేలుడుకి  కారణాలు. అందుకే ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వం కొన్ని గైడ్‌‌లైన్స్ తీసుకొచ్చింది. బ్యాటరీ తయారీకి ‘ఏఐఎస్‌‌ 156’ పేరిట కొత్త స్టాండర్డ్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం బ్యాటరీలకు  షార్ట్‌‌ సర్క్యూట్‌‌, ఓవర్‌‌ ఛార్జింగ్‌‌, వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో పనితీరు, నీటిలో తడపడం లాంటి అన్ని రకాల సేఫ్టీ టెస్ట్‌‌లు చేస్తారు. కాబట్టి ఏఐఎస్‌‌ 156 స్టాండర్డ్స్ ఉన్న బ్యాటరీలతో ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువ.

లైఫ్‌‌స్టైల్ మార్పులు 

ఎలక్ట్రిక్ వాహనాల వల్ల లైఫ్‌‌స్టైల్ కూడా కొంత మారుతుంది. కార్ లేదా బైక్‌‌లో బ్యాటరీ ఎప్పటికప్పుడు ఫుల్ ఛార్జ్ ఉండేలా చూసుకోవాలి. లేకపోతే బయటకు వెళ్లాలనుకున్న వెంటనే కారు తీయడం కుదరకపోవచ్చు. మొబైల్‌‌ను ఛార్జ్ చేసినట్టుగా రోజూ వెహికల్‌‌ను కూడా ఛార్జ్ చేయాలన్న సంగతి గుర్తుంచుకోవాలి. అలాగే వెళ్లాల్సిన దూరాన్ని ముందుగానే అంచనా వేసుకొని బయలుదేరాలి. దారిలో చార్జింగ్ స్టేషన్ ఉంటే అక్కడ కనీసం అరగంటైనా  టైం స్పెండ్ చేయాలి. సో.. ఈవీలతో రోజువారీ టైమింగ్ కొంత మారుతుందన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్‌‌లో లాంగ్ డ్రైవ్, టూర్లు వెళ్లాలనుకుంటే దారిలో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ అందుబాటులో ఉంటే తక్కువ ఖర్చుతోనే లాంగ్ టూర్లు వేయొచ్చు. డ్రైవింగ్ విషయానికొస్తే  ఈవీ డ్రైవింగ్ స్మూత్‌‌గా ఉంటుంది. గేర్లు మార్చడం, క్లచ్ లాంటివి ఉండవు. కాబట్టి ట్రాఫిక్‌‌లో ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయొచ్చు.  పెట్రోల్ వెహికల్స్‌‌లో ఉండే పెద్ద ఇంజిన్ వీటికి ఉండదు.  దాంతో వెహికల్‌‌లో బోలెడంత స్పేస్ ఖాళీగా ఉంటుంది. ఎక్కువ లగేజీ తీసుకెళ్లొచ్చు.  సీటింగ్ మరింత కంఫర్ట్​గా ఉంటుంది. 
జాగ్రత్తలు ఇలా..

ఈవీలు వాడుతున్న వాళ్లు కొన్ని సేఫ్టీ టిప్స్‌‌ పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..

  •     ఛార్జింగ్‌‌ పెట్టేందుకు ఒరిజినల్‌‌ లేదా సర్టిఫైడ్ ఛార్జర్లనే వాడాలి.  బ్యాటరీ, ఛార్జర్‌‌ను  పొడిగా , బాగా వెలుతురు వచ్చేచోట ఉంచాలి.
  •     బ్యాటరీ ఎప్పుడూ పూర్తిగా జీరో కాకూడదు. ఛార్జింగ్‌‌ ఎప్పుడూ 20 నుంచి 80 శాతం మధ్యలో ఉండేలా చూసుకోవాలి.  బ్యాటరీలను రాత్రంతా ఛార్జింగ్‌‌ పెట్టి వదిలేయకూడదు.
  •     ఈవీలను మరీ ఎక్కువ ఎండలో లేదా మరీ చల్లని వాతావరణంలో ఉంచకూడదు. బ్యాటరీలను మండే వస్తువులకు దూరంగా ఉంచాలి. వాటిని రూం టెంపరేచర్​లోనే ఉంచాలి.
  •     బ్యాటరీ కేసింగ్‌‌ దెబ్బతిన్నా, అందులోకి నీరు చేరినా వెంటనే దాన్ని పక్కన పెట్టి.. డీలర్ ను కాంటాక్ట్ చేయాలి.
  •     ఎండ నేరుగా తగిలే చోట బ్యాటరీలను ఉంచకూడదు. బండమీద తిరిగొచ్చిన  తర్వాత దాదాపు గంట వరకూ బ్యాటరీకి ఛార్జింగ్‌‌ పెట్టకూడదు.
  •     ఈవీ, బ్యాటరీ తయారీ సంస్థలకు కచ్చితంగా ఏఆర్‌‌ఏఐ (ఆటోమోటివ్‌‌ రీసెర్చ్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా) అనుమతి ఉండాలి. 
  •     ఎలక్ట్రిక్ బైక్స్ వెళ్తున్నప్పుడు సౌండ్ రాదు. కాబట్టి చుట్టుపక్కల వెహికల్స్​ని గమనిస్తూ జాగ్రత్తగా నడపాలి.

ట్రెండింగ్​లో ఉన్న ఈవీలు ఇవే ఆటమ్ 1.0 

స్టైలిష్‌‌గా ఉండే ఆటమ్ 1.0  చౌకైన ఎలక్ట్రిక్ బైక్.  కేఫ్ రేసర్ స్టైల్‌‌లో ఉండే ఈ బైక్ సింపుల్ డిజైన్‌‌తో చూడ్డానికి స్పెషల్‌‌గా ఉంటుంది.  దీని ధర రూ.74,999.  ఇందులో  250వాట్, 48వీ పోర్టబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. నాలుగు గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.  సింగిల్ ఛార్జ్‌‌తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. అంటే రూ.10 ఛార్జింగ్‌‌తో 100 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఈ బైక్ రెండేళ్ల వారంటీతో లభిస్తుంది.  గంటకు 25 కిలో మీటర్ల స్పీడ్‌‌తో నడిచే ఈ బైక్‌‌కు  రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇందులో ఎల్‌‌ఈడీ హెడ్‌‌లైట్, ఎల్‌‌ఈడీ ఇండికేటర్లు, ఎల్‌‌ఈడీ టెయిల్ లైట్, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లున్నాయి. ‘ఆటమ్’ అఫీషియల్​ సైట్​లో ఈ బైక్ ప్రి– ఆర్డర్ చేసుకోవచ్చు.

రివోల్ట్ ఆర్‌‌‌‌వీ400

రివోల్ట్ ఆర్‌‌‌‌వీ400.. మార్కెట్లో మొదటి ఏఐ ఎనేబుల్డ్​ ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్‌‌లో  స్టాండర్డ్,  ప్రీమియం వేరియంట్లు ఉన్నాయి. ఈ బైక్ సింగిల్ ఛార్జ్‌‌తో 150 కి.మీ. ప్రయాణిస్తుంది. బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ప్రతి 10,000 కిలోమీటర్లకు ఒకసారి బైక్ సర్వీస్ చేయించాలి. ఇందులో 5కిలోవాట్స్​(కేడబ్ల్యూ) కెపాసిటీ కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి ఐదు గంటలు పడుతుంది. ఈ బైక్ ధర రూ.1.26 లక్షలు.

ఏథర్ 450 ఎక్స్

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌‌‌‌లో 3.7కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌‌తో 146 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. దీని ధర రూ.1.57 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. ఇది కేవలం 6.5 సెకన్లలోనే 60 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ఏఐ బేస్డ్ డిజిటల్ ఇన్‌‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఫీచర్లుంటాయి.

బజాజ్ చేతక్

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌‌‌‌లో 3కేడబ్ల్యూహెచ్​ కెపాసిటీ కలిగిన లిథియం- అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో స్పోర్ట్స్, ఎకో అనే రెండు రైడింగ్ మోడ్‌‌లుంటాయి. ఇది సింగిల్ ఛార్జ్ తో 95 కి.మీ. వరకు డ్రైవింగ్ రేంజ్‌‌ను అందిస్తుంది. ఇందులోని బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 5 గంటలు పడుతుంది. ఈ  స్కూటర్ ధర రూ.1.49 లక్షలు.

టాటా నెక్సాన్ ఈవీ

టాటా నెక్సాన్ ఈవీ.. దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్. ఇది129 హెచ్‌‌పీ పవర్, 245 ఎన్‌‌ఎమ్ టార్క్‌‌ను జ‌‌న‌‌రేట్ చేస్తుంది. ఇది 30.2కేడబ్ల్యూహెచ్​ లిథియం-అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. సింగిల్ ఛార్జ్‌‌కు 312 కిమీల రేంజ్‌‌ను అందిస్తుంది. ప్రస్తుతం దీని ధర( ఎక్స్-షోరూమ్‌‌) రూ.15.78 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది కేవలం 9 సెకన్లలో 100కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 140 కిమీ. ఈ కార్‌‌‌‌ను ఫుల్ ఛార్జ్ చేయడానికి 15  గంటల టైం పడుతుంది. 7.2 కిలోవాట్ ఛార్జర్ వాడితే 6 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు.

ఎమ్‌‌జీ  జెడ్‌‌ఎస్ ఎలక్ట్రిక్

ఎమ్‌‌జీ మోటార్స్ రిలీజ్ చేసిన ఎమ్‌‌జీ జడ్‌‌ఎస్ ఎల‌‌క్ట్రిక్ కారులో 50.3 కేడబ్ల్యూహెచ్​ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌‌కు 419 కిలోమీటర్ల డ్రైవ్ అందిస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 176 బిహెచ్‌‌పి పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌‌ను జ‌‌న‌‌రేట్ చేస్తుంది. దీని ధర రూ. 23.11 లక్షలు(ఎక్స్-షోరూమ్).  ఈ కార్ సింగిల్ ఛార్జ్ కు 461 కిలోమీటర్ల రేంజ్‌‌ అందిస్తుంది. ఈ కార్ కేవలం 8.5 సెకన్లలో 100 కి.మీ.ల  వేగాన్ని అందుకుంటుంది. 7.4 కిలోవాట్ ఏసీ ఛార్జర్‌‌ ద్వారా కేవలం 9 గంటల్లో 0 నుంచి 100% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

::: తిలక్​