బాల్యానికి భద్రత ఏది?

బాల్యానికి భద్రత ఏది?

జాతికి నిజమైన సంపద బాలలే.  భావితరానికి బాటలు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకు బాలల అభివృద్ధికి కావలసిన వనరులను సమకూర్చాలి. బాలల మనుగడ.. వారికి లభించే నాణ్యమైన ఆహారం, ఆరోగ్యం, విద్య, వినోదం, అభివృద్ధి, కుటుంబ జీవనంపై ఆధారపడి ఉంటుంది. పిల్లలను శారీరక, మానసిక ఒత్తిడి, హింస, దోపిడీ నుంచి రక్షణ కల్పించాలి. అప్పుడే ఉత్తమ భావి భారత పౌర సమాజం నిర్మితమవుతుంది. 

అత్యధిక బాల జనాభా గల భారతదేశంలో రాజ్యాంగం వారికి  ప్రత్యేక రక్షణలు కల్పించింది. అయినప్పటికీ మన దేశంలో బాలల పరిస్థితి రోజు రోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. నేటి పోటీ ప్రపంచంలో అనేక రూపాలలో పిల్లలపై ఒత్తిడి, వేధింపులు, దౌర్జన్యాలు, నిర్లక్ష్యం, అక్రమ రవాణా,  వెట్టిచాకిరిలాంటివి కొనసాగుతున్నాయి. ఇవి బాలల అభివృద్ధికి ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు సైతం వారి పాలిట శాపంగా మారాయి. బాలల శారీరక, మానసిక అభివృద్ధికి మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టి వారి భావి జీవితానికి  బాటలు వేయాలి.

బాలల అభివృద్ధికి కృషి చేయాలి

భారతదేశ మొత్తం జనాభాలో 37శాతం బాలలున్నారు. వీరి  హక్కులను గుర్తించడంలో ఇప్పటికీ మనం వెనుకబడి ఉన్నాం. అంతేకాకుండా ఆశించిన స్థాయిలో వారి వికాసానికి కృషి జరగడం లేదని అనేక అధ్యయనాలు సైతం తెలుపుతున్నాయి. నేడు బాలల అభివృద్ధికి బాటలు పడాలంటే... వారి హక్కుల సంరక్షణకు కృషి చేయడమే శరణ్యం. ముఖ్యంగా అందరికీ ఉచిత విద్య, వైద్య అవకాశాలు మెరుగుపరచడానికి నిబద్ధతతో కృషి చేయాలి. అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పందం అమలు చేయాలి. బాలలు రక్షణకు  ప్రస్తుతం ఉన్న చట్టాల, విధానాలను పునఃసమీక్షించాలి.

అంతేకాకుండా  మరిన్ని చట్టాలు చేసి పటిష్టంగా అమలుపరచాలి. పిల్లలను పేదరికం నుంచి విముక్తి చేయడానికి కుటుంబ, సామాజిక భద్రత కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. ఆడపిల్లల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి, భయం, అభద్రత తదితర ప్రతికూల ప్రభావాలు తొలగించడానికి ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.  పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి మధ్యాహ్న భోజనాన్ని మరింత సమర్థవంతంగా అమలుచేయాలి. బాలల సంరక్షణ కోసం పోక్సో చట్టం 2012, బాలల న్యాయ చట్టం 2015

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్- 2005 లాంటివి ఉన్నాయి. బాలల సహాయ కేంద్రానికి (1098) ప్రాచుర్యం కల్పించాలి. బాలల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యమివ్వాలి. వారి హక్కుల పట్ల ప్రభుత్వం, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేయాలి. అప్పుడే బాలల సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడతాయి.

ఆందోళనకరంగా బాలల పరిస్థితి

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)తాజా నివేదిక ప్రకారం 2017-–18 నుంచి 2022-–23 మధ్య 5సంవత్సరాలలో 47వేల మంది చిన్నారుల ఆచూకీ  తెలియడం లేదు. వారిలో 71.4 శాతం మంది మైనర్‌ బాలికలేనని ఆ నివేదిక తెలపడం ఆందోళన కలిగిస్తుంది. భారత్​లాంటి వర్ధమాన దేశాల్లో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ లాంటి దుర్లక్షణాలు కూడా ఇంకా సమసిపోలేదు. భారత్​లో బాల్య వివాహాల నిర్మూలన దిశగా చేపడుతున్న చర్యల్లో పూర్తిగా స్తబ్దత ఏర్పడిందని ఇటీవల "దిలాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్" అధ్యయనం పేర్కొన్నది. ఇప్పటికీ ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరికి...

ఆరుగురు బాలురులో ఒకరికి బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిపింది. వీటిని అరికట్టడంలో భారత్ విఫలమవడం తీవ్ర ఆందోళనకరమైన విషయంగా పరిశోధకులు పేర్కొన్నారు. అంతేకాకుండా కనీస అవసరాలను  పొందలేని పిల్లల సంఖ్య కూడా నేటికి తాండవిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) 2019-–20 ప్రకారం, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 35.5% ఎదుగుదల లోపం,19.3% బలహీనంగా, 32.1% తక్కువ బరువుతో ఉన్నారు. దీని ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడనుంది. 

- సంపతి రమేష్ మహరాజ్, సోషల్​ ఎనలిస్ట్