గ్రేటర్ ఎన్నికలకు ఎందుకింత ఉరుకులాట.?

గ్రేటర్ ఎన్నికలకు ఎందుకింత ఉరుకులాట.?
  • నామినేషన్లకు 3 రోజులే ఇవ్వడంపై విమర్శలు
  • ప్రచారానికి మిగిలింది వారం రోజులు మాత్రమే
  • పాలకవర్గం గడువు ఇంకా మూడు నెలలు ఉన్నా ఇంత ఆగమేంటి?
  • ఇంత తక్కువ టైమ్​లోక్యాండిడేట్ల ఎంపిక ఎట్లా?
  • దుబ్బాక ఓటమి భయంతోనే టీఆర్ఎస్​ తొందరపాటు
  • రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆగ్రహం
  • ప్రతిపక్షాలకు టైమ్​ దొరకవద్దన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని ఫైర్​

హైదరాబాద్, వెలుగుజీహెచ్ఎంసీ ఎలక్షన్లకు హడావుడిగా నోటిఫికేషన్​ రిలీజ్​ చేయడంపై రాజకీయ పార్టీలు, ప్రజా, స్వచ్చంద సంస్థల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత ఆగమాగం షెడ్యూల్​ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు వస్తున్నాయి. షెడ్యూల్​ ఇచ్చాక కొంచెం కూడా గ్యాప్​ లేకుండా నామినేషన్లు స్వీకరించడం, అదీ మూడు రోజులే గడువు ఇవ్వడం ఏమిటని నేతలు మండిపడుతున్నారు. పైగా వరదలతో మునిగిన చాలా కాలనీలు ఇంకా తేరుకోలేదని, మరోవైపు కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతోందని.. ఇట్లాంటి టైంలో ఇంత తొందరపాటు ఎందుకని నిలదీస్తున్నారు. సీఎం కేసీఆర్​ చేతిలో ఎలక్షన్​ కమిషన్​ కీలుబొమ్మగా మారిందని, ఆయన చెప్పినట్టే చేస్తోందని ఆరోపిస్తున్నారు.

కానీ అధికార పార్టీ నేతలు, కార్పొరేటర్లు, లోకల్ లీడర్లు వరద సాయం సొమ్మును దోచుకుంటున్నారని.. బాధితులకు అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. చాలా ప్రాంతాల్లో జనం ఆందోళనలు,ధర్నాలు చేపట్టారు. ఇదే టైంలో దుబ్బాక బైఎలక్షన్జరిగింది. అందులో టీఆర్ఎస్ ను ఓడిం చిన బీజేపీజోష్ లోకి వచ్చింది. గ్రేటర్ లోనూ పాగా వేసేందుకు వ్యూహాలు మొదలుపెట్టింది. ఇట్లా బీజేపీ బలపడి,జనంలో వ్యతిరేకత మరింత పెరిగేలోగా ఎలక్షన్లు నిర్వహించాలని అధికార టీఆర్ఎస్ భావించింది.
సర్కారు సూచనతో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది.

దుబ్బాక ఓటమి ఎఫెక్ట్​తోనే..

వాస్తవానికి గ్రేటర్  హైదరాబాద్​ పాలకవర్గానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు గడువు ఉంది. ఈ లెక్కన డిసెంబర్​ చివర్లోనో, జనవరిలోనో ఎలక్షన్​ ప్రక్రియ చేపడతారన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇటీవల హైదరాబాద్ ను భారీ వరదలు ముంచెత్తాయి. కాలనీలు, రోడ్లన్నీ మునిగి జనం  తిప్పలు పడ్డారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం కేసీఆర్ బయటికి రాలేదేమన్న ప్రశ్న తలెత్తింది. సర్కారు తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సర్కారు వరద సాయం కింద కుటుంబానికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేపట్టింది.

కేసీఆర్ భయపడ్డరు

అవినీతి, దోపిడీ పై జనంలో చర్చ జరగకుండా తక్కువ టైమ్​లో జీహెచ్​ఎంసీ ఎలక్షన్లు కంప్లిట్ చేయాలని టీఆర్ఎస్ అనుకుంటోంది. ఎక్కువ రోజులు టైమ్ ఇస్తే టీఆర్​ఎస్​ ఓడిపోతుందని కేసీఆర్ భయపడ్డరు.

– కె.లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

ప్రచారానికి టైమేది?

హైదరాబాద్  జనాన్ని కన్ ఫ్యూజ్ చేయాలని టీఆర్​ఎస్ భావిస్తోంది. అందుకే హడావుడి నోటిఫికేషన్. ప్రచారం చేసుకొనే టైం ఇవ్వట్లేదు. ఇది కేసీఆర్, కేటీఆర్ ల సొంత ఎన్నిక కాదు.

సర్కారు ఒత్తిడి తోనే హడావుడి షెడ్యూల్
ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంది. దానికి మూడు నెలల ముందే ఎలక్షన్లు పెట్టడం తొందరపాటు చర్య. అసెంబ్లీ , లోక్ సభ ఎలక్షన్లకు నామినేషన్ల ప్రక్రియకు వారం,10 రోజులు టైం ఇస్తరు. మూడు రోజులు విత్ డ్రాలకు చాన్స్ ఉంటుం ది. కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో టైం ఇవ్వడం లేదు. మూడు రోజులే నామినేషన్లు , ఒకేరోజు విత్ డ్రా అంటే..ఏదో కొంపలు అంటుకుంటున్నయి. వెంటనే ఎలక్షన్ పెట్టకుంటే కౌన్సి ల్ గడువు అయిపోతుంది అన్నట్టు షెడ్యూల్ ఇచ్చారు. దీనికి న్యాయ బద్ధత లేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై సర్కారు నుంచి ఒత్తిడి ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. 80 రోజులకు పైగా టైం ఉంటే.. ఇంత ఆగమాగం ఎందుకు చేస్తున్నరో సమాధానం చెప్పాలె. ఇటీవల హైదరాబాద్ ను వరదలు ముంచెత్తాయి . ఫ్లడ్ రిలీఫ్ పనులు పూర్తి కానే లేదు. చలికాలంలో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉంది. అయినా త్వరపడి ఎలక్షన్ కు వెళ్తున్నరు. డివిజన్ల విభజన సరిగా జరగలే. ఓ డివిజన్లో 80 వేల ఓటర్లు ఉంటే మరోచోట 25 వేలే ఉన్నారు. ఇలాంటి వాటిపై పలుసార్లు ఎలక్షన్ కమిషన్ కు వినతి పత్రాలు ఇచ్చాం. అయినా పట్టించుకోలేదు.

– పద్మనాభరెడ్డి,
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి