బీసీల అండ లేకపోతే.. భవిష్యత్ కష్టమే

బీసీల అండ లేకపోతే.. భవిష్యత్ కష్టమే

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు బీసీ వాదం గురించి అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు. మహిళా బిల్లు విషయంలో కూడా పార్లమెంట్ లో జరిగిన చర్చలో బీసీలకు పాలనా పరంగా ఉన్న ప్రాధాన్యతలను, బీజేపీ బీసీల పట్ల  చేస్తున్న నిర్లక్షాన్ని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ కుల గణన చేస్తామని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు. రాజకీయాల్లో  ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని నొక్కి చెప్పారు. ‘ఇండియా’ కూటమిలో మొదటి తీర్మానం కూడా చేశారు.  ఇంతలా కాంగ్రెస్  అధిష్ఠానం బీసీ జపం చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ లో  బీసీల పట్ల ఈ అణచివేత ధోరణి ఏంది? సర్వే సాకు చూపి బీసీలను తొక్కేసే ప్రయత్నం ఎందుకు  జరుగుతుంది?

 ప్రాధాన్యం ఇప్పుడైనా ఇవ్వాలి కదా!

ఏ కోణంలో చర్చించినా తెలంగాణ లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో తక్కువైతే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. 40 సంవత్సరాల్లో ఇవ్వని ప్రాధాన్యత ఇప్పుడైనా ఇవ్వండని బీసీలను  గుర్తించే విధంగా  కార్యక్రమం చేపడుతున్నాం. అందుకోసమే బీసీ నేతలు ఐక్యంగా ఒక వేదిక మీద మాట్లాడుతున్నారు . 

ఎలాంటి సందిగ్ధాలు వచ్చినా రాకున్నా ఓబీసీల గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన సమయమిది.  తెలంగాణ లో 40 ఏండ్ల లో ( 1983 -–2023 ), మూడు పర్యాయాలు కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చినా 50 శాతం సీట్లు రాకపోవడానికి కారణం ఆలోచించాలి కదా? మొట్ట మొదటిసారిగా తెలంగాణలో 50 శాతం సీట్ల పైనే సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేయడంలో బీసీల పాత్ర గణనీయంగా ఉంటుంది.

ఓడనిదెవరు?

2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారంతా సీనియర్లే కదా! చాలా సీనియర్లు గొప్ప వాళ్లు అని చెప్పిన వాళ్లంతా ఓటమి పాలయ్యారు. సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షుల స్వంత నియోజక వర్గాలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శులు ఇలా అంతా ఓటమి పాలయ్యారు . 

పోస్టర్లే బలమా?

తమకు నచ్చిన వారు సర్వేల్లో బాగున్నారని, నచ్చని వారు సర్వేల్లో రిపోర్ట్ బాగా లేదని చెపుతూ పక్కన పెడితే పార్టీ ఓటమికి అదే కారణమవుతుంది. నెల రోజుల క్రితం పోస్టర్లు వేస్తే సర్వేల్లో ఆయనకు మద్దతు వచ్చిందని చెబుతున్నారు. దానిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. పోస్టర్లు ఫ్లెక్సీలు వేస్తే ప్రచారం బాగా జరిగినట్లయితే ఇక పార్టీ ఎందుకు? విధానాలు ఎందుకు? మేనిఫెస్టోలు ఎందుకు? సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే చేసిన వాళ్లు సర్వే కోసమే పోస్టర్లు వేయాలా ?

మెంబర్​ షిప్​ చేయించింది రికార్డు కాదా? 

రాహుల్ గాంధీ మీటింగ్, గజ్వేల్ మహాసభ, భారత జోడోయాత్ర, మంచిర్యాలలో ఖర్గే మీటింగ్​, ప్రియాంకా గాంధీ మీటింగ్, తుక్కుగూడ బహిరంగ సభకు ఏ ప్రాంతం నుంచి ఎంతమంది వచ్చారు, దానికి సహకరించిన బాధ్యులు ఎవరు అన్నది కూడా పార్టీ బాధ్యులు చూపించడం లేదు. వాస్తవాలను మార్చి రిపోర్ట్ ఇచ్చే దౌర్భాగ్యపు పరిస్థితి వస్తే తస్మాత్ జాగ్రత్త . 

అది కాంగ్రెస్ పార్టీకి నష్టం. పార్టీలో పని చేసే వారిని గుర్తించండి. మేము పార్టీ కోసం పని చేస్తాం. ఈ వర్గాలకు అండగా నిలవండి అని ప్రకటిస్తున్నాం. బీసీ వర్గాలకి న్యాయం చేయాలని పార్టీ అధికారంలోకి రావడానికి ఇది పెద్ద మద్దతు అని చెపుతున్నాం. పార్టీలో ఉన్న 50 శాతం జనానికి నమ్మకం కలిగించకుండా, కొత్త వాళ్లు వస్తున్నారు.. వస్తున్నారు అని హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీని వల్ల ఎంత లాభం జరగుతుందో అంచనా వేయాలి కదా !

కొత్తను చూసి  పాతను కాదనలేం

పార్టీలో ఉన్న 50 శాతం మందిని పక్కనపెట్టి, కొత్తగా వచ్చే వాళ్ల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఇది పార్టీ ప్రతిష్టను  పెంచుతుందా ? పార్టీ విజయావకాశాలను సన్నగిల్లేలా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలం మీద నాయకులైన వారు వేరే పార్టీ పెట్టి వ్యక్తిగతంగా నిలవగలిగారా?  పార్టీ పునాదులు, పార్టీ  స్ట్రెంత్ ముఖ్యంగా కనిపిస్తుందా.. వ్యక్తుల ప్రాధాన్యత కనిపిస్తుందా.. వ్యక్తులే ప్రాధాన్యత అయితే ఆ వ్యక్తులు ఇండిపెండెంట్ గా  నిలబడితే ఎన్ని ఓట్లు వస్తాయి తెలుస్తుంది కదా! అట్లా మనం చరిత్ర చూసాం కదా ? కొత్త వాళ్ళని ఆహ్వానిద్దాం,  గౌరవిద్దాం హైప్ క్రియేట్ చేద్దాం, కానీ ఉన్న వాళ్ళని విస్మరించడం.. ఉన్న వాళ్ళని బాధ్యతా రహితంగా తక్కువ చూపు చూడడం వల్ల లాభం లేకపోగా నష్టం జరుగుతుంది. ఎవరైనా ఎందుకొస్తున్నారు? పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని వస్తున్నారు. 

బలోపేతానికి కారణాలివి

భారత్​ జోడో యాత్ర పెద్ద ఎత్తున విజయవంతం కావడం, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం, హైదరాబాద్ లో సీడబ్యుసీ సమావేశాల వల్ల తెలంగాణ లో పార్టీ పటిష్టతకు కారణం అయ్యాయి. పార్టీ అధికారంలోకి రావడానికి, పార్టీ బలోపేతం కోసం పార్టీ మనుగడ కోసం, ఇంతకాలం చిత్తశుద్ధితో పని చేస్తున్నా.  

చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో 50% ఉన్న వాళ్లం. 50 శాతం టికెట్స్  రాకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉంటున్నారన్నది గుర్తించాలి. ఇదే బీసీలు కోరుతున్నారు. పార్టీ మీద ఉన్న విశ్వాసం కానీ, నమ్మకం కానీ అందరికీ ఉండాలన్నది ఓబీసీల విజ్ఞప్తి.

సర్వేలలో పారదర్శకత ఎక్కడ ఉంది? 2018 ఎన్నికల్లో సర్వేల ఆధారంగా టికెట్స్ అన్నారు. మరి అందరూ ఎలా ఓడిపోయారు? 50 శాతం ఉన్న బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే బీసీల ఆత్మగౌరవం దెబ్బ తినదా? దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికంగా ఉన్నారు. అందుకే అధికార బీఆర్ఎస్ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. రాజకీయంగానే కాకుండా వృత్తి పరంగా, ఆర్థిక పరంగా వారికి ప్రాధాన్యత ఇచ్చి వారిని తన వైపు తిప్పుకొనేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శతవిధాల పని చేస్తున్నారు.

సర్వేల్లో పారదర్శకత?


సర్వేలు కూడా అవసరమే . పారదర్శకంగా సర్వేలు జరిగితే మంచిది. పారదర్శకంగా సర్వేలు జరగకపోవడానికి కారణం ఏంటి అంటే దానికి సమాధానాలు రావాలి. తమ వర్గానికి తమ వాళ్లకి ఇచ్చే టికెట్స్ ఇచ్చే విధంగా సర్వేలు చేయించినట్లయితే.. సర్వే రిపోర్ట్ లు మార్చినట్లయితే.. కింది నుంచి వచ్చిన సర్వే రిపోర్ట్ లను కూడా మారుస్తున్నారని మాకు సమాచారం అందుతుంది. ఎందుకు మారుస్తున్నారు అన్న అంశాన్ని  బహిరంగంగా మాట్లాడాలి. 

మరి సర్వే పారదర్శకంగా జరిగిందా లేక సర్వేలు వచ్చిన వాళ్ళు ఓటమి పాలయ్యారా..  పార్లమెంట్ ఎన్నికల అప్పుడు ఏ సర్వేలు చేసి టికెట్లు  ఇచ్చారు? మరి వారంతా ఎలా ఓడిపోయారు. అన్నది కూడా చర్చించాలి కదా.మేము మాకు అనుకూలంగా సర్వేలు చేస్కుంటాము.మనకు తగ్గట్టుగా పార్టీని వాడుకుందాం అనుకుంటే మిగతా వాళ్ళు అంతా కళ్ళు మూసుకుని ఉన్నారు, అంత తెలివి లేదు అనుకుంటే దానంత దౌర్భాగ్యం ఏదీ ఉండదు. పార్టీ బాగు కోసం, పార్టీని విజయావకాశాల కోసం క్షుణ్ణంగా, నిశితంగా చూడండి అని పార్టీ అధిష్టానానికి ఓబీసీలు చెబుతున్నారు .

- పొన్నాల లక్ష్మయ్య, మాజీ సీనియర్ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు