డయాబెటిస్ ఉన్నవాళ్లు ఏం తినాలి? ఏం తినకూడదు?

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఏం తినాలి? ఏం తినకూడదు?

డయాబెటిస్ అనగానే లైఫ్​ స్టైల్​లో జరిగే మార్పు ఫుడ్​. ఏది పడితే అది తినొద్దు, షుగర్​ పెరగకుండా ఉండే తిండి తినాలి అని చెప్తుంటారు ఎక్స్​పర్ట్స్. దాంతోపాటు టైంకి తినడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు న్యూట్రిషనిస్ట్​ డాక్టర్. అయితే, డయాబెటిస్ ఉన్నవాళ్లు ఏం తినాలి? ఏం తినకూడదు? ఫుడ్​ సరిగా తీసుకుంటే మెడిసిన్​ మానేయొచ్చా? అనే డౌట్లు చాలామందికి ఉంటాయి. మరి ఆ డౌట్స్ అన్నింటికీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్. సుజాత స్టీఫెన్​ చెప్పిన సమాధానాలు ఇవి.

చాలామంది మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ, ఈ ప్రాబ్లమ్​కి మెడిసిన్ అనేది జీవితాంతం​​ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఫుల్ స్టాప్​ అనేది ఉండదు. కాబట్టి, దాన్ని కొంతలో కొంతైనా తగ్గించేందుకు ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. టైంకి ఫుడ్, సరిపడా నిద్ర, రెగ్యులర్ ఎక్సర్​సైజ్ ఉంటే కచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే డయాబెటిస్​ని 50 శాతం ఫుడ్, మరో 50శాతం ఎక్సర్​సైజ్​తో కంట్రోల్ చేయొచ్చు.

మెడిసిన్​ మానొద్దు

చాలామంది ఫుడ్​ ద్వారా కంట్రోల్ అవుతుందని అనేసరికి మెడిసిన్ తీసుకోవడం ఆపేస్తారు. అలా చేయడం పెద్ద తప్పు. ఎందుకంటే శరీరంలో ఇన్సులిన్ అనేది సరిగా విడుదల కాకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్​ని యాక్టివేట్ చేయడానికి మెడిసిన్​ ఇస్తారు. దాంతో అప్పటిదాకా తక్కువగా విడుదలయ్యే ఇన్సులిన్,​ మెడిసిన్​ వాడాక ఎక్కువ అవుతుంది. అప్పుడు తిన్న తిండి బాగా జీర్ణమై, షుగర్​గా మారకుండా ఉంటుంది. దానివల్ల ఇన్సులిన్​ వేసుకోకపోయినా, షుగర్​ లెవల్ నార్మల్​గా ఉంటుంది. నార్మల్​గానే ఉందని మెడిసిన్​ వాడటం ఆపేస్తుంటారు. కానీ, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే... మనుషులుఎప్పుడూ ఒకేలా ఉండలేరు కదా. టెన్షన్, స్ట్రెస్ పెరిగినప్పుడు షుగర్​ ఒక్కసారిగా పెరుగుతుంది. అలాంటప్పుడు ఆర్గాన్స్ ఎఫెక్ట్​ అవుతాయి. కాబట్టి, షుగర్​ ఉందంటే కచ్చితంగా మెడిసిన్ వాడాలి. కాకపోతే డోస్​ ఎంత కంట్రోల్ చేసుకోవచ్చు? అనేది మన చేతిలో ఉంటుంది. అదే ఫుడ్​.. సరిగా తీసుకుంటే షుగర్ కంట్రోల్​లో ఉంటుంది. మెడిసిన్ డోస్​ తగ్గుతుంది. తక్కువ డోస్​ అయినా సరే, మెడిసిన్ వాడాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కంప్లీట్​గా మానేస్తే, కిడ్నీ, హార్ట్​ వంటి వాటి మీద ఎఫెక్ట్​ అయ్యే ప్రమాదం ఉంది.

బరువు తగ్గితే.. షుగర్​ తగ్గుతుందా?

డయాబెటిస్​ ఉన్నవాళ్లు శరీర బరువు తగ్గాలి. ఎందుకంటే, డయాబెటిస్ వల్ల ఇన్సులిన్ తక్కువగా విడుదలవుతుంది. దానికితోడు బరువు ఎక్కుగా ఉంటే, అది కూడా విడుదల కాకుండా పోతుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని, ఒక10 శాతం బరువు తగ్గితే, డయాబెటిస్ మేనేజ్​మెంట్ మెరుగ్గా ఉంటుంది. దానివల్ల ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఉన్నవాళ్లు వెయిట్ కంట్రోల్ చేసుకోవడం వల్ల డయాబెటిస్ మేనేజ్​మెంట్​ సరిగా మెయింటెయిన్ అవుతుంది. అంతేకాకుండా వెయిట్ తగ్గడానికి కూడా ఒక పద్ధతి ఉంది. చాలామంది కీటో, మిల్లెట్ డైట్, ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్స్​ వంటివి చేసి షుగర్​ని జీరోకి తెచ్చుకున్నాం అంటారు. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. షుగర్​ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ముఖ్యంగా ఇలాంటి డైట్స్ చేయడంవల్ల షుగర్స్ ఒక్కసారిగా తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది. అప్పుడు దానికి సంబంధించి ఇతర సమస్యలు వస్తాయి. అందుకని, డయాబెటిస్ ఉన్నవాళ్లు బరువు తగ్గాలంటే.. సరైన తిండి, టైం అనేది చాలా ముఖ్యం. అలాకాకుండా ఇంటర్నెట్​లో చూసి డైట్ చేస్తే, షుగర్ అదుపులో ఉండదు. దాంతో ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్​ పడుతుంది.

జెస్టేషనల్ డయాబెటిస్​

జెస్టేషన్ డయాబెటిస్ ఎప్పుడొస్తుందంటే.. బరువు ఎక్కువగా ఉన్న ఆడవాళ్లు ప్రెగ్నెంట్​ అయితే వాళ్లకి వచ్చే అవకాశం ఉంది. రెండోది ఫ్యామిలీలో ఉంటే వారసత్వంగా వస్తుంది. మరికొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ టైంలో వాళ్లు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడం, హార్మోన్​ ఇంబాలెన్స్​ వల్ల ఆ టైంలో డయాబెటిస్​ కనిపించే ఛాన్స్​లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో, చాలామంది గర్భిణీలు అధిక బరువు​ లేదా తక్కువ బరువు ఉంటున్నారు. ఇలాంటప్పుడు బాడీలో శారీరక మార్పులు జరగడం వల్ల హార్మోన్స్​ ఇంబాలెన్స్ అయి, ఇన్సులిన్ అనేది ఎక్కువ లేదా తక్కువ విడుదలవుతుంది. ఈ పరిస్థితిలో ఆ తల్లికి డయాబెటిస్​  వచ్చే ఛాన్స్ ఉంటుంది.

డయాబెటిక్ డైట్..

తక్కువ క్వాంటిటీతో ఎక్కువసార్లు తినాలి. టైం పాటిస్తూ ఒక పద్ధతిలో తినాలి. తినడంతోపాటు రోజూ మార్నింగ్ వాకింగ్, ఎక్సర్​సైజ్​లు చేయాలి. ఇలా చేస్తే డయాబెటిస్ కంట్రోల్​లో ఉంటుంది. దాంతోపాటు బరువు కూడా తగ్గుతారు. షుగర్ ఉన్నవాళ్లు తీపి పదార్థాలకు దూరంగా ఉంటారు. అలాగే కార్బోహైడ్రేట్స్​ తినరు. అలాంటప్పుడు బరువు పెంచే క్యాలరీలు ఏం ఉండవు. పైగా తక్కువ తినడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. ఫ్యాట్​ బదులు ఎక్కువగా ఫైబర్ ఫుడ్​ తీసుకుంటారు కాబట్టి కొవ్వు పేరుకోదు. డయాబెటిస్ ఉన్నవాళ్లు, షుగర్​ కంట్రోల్​లో ఉన్నప్పుడు ఒక స్పూన్ చక్కెర లేదా స్వీట్​ తిన్నా ఏం కాదు. కానీ, షుగర్​ కంట్రోల్​లో లేనప్పుడు తింటే మాత్రం ఎఫెక్ట్​ అవుతుంది. ఎందుకంటే అప్పటికే షుగర్​ ఉండి, దానికితోడు ఇంకొంచెం తింటే అప్పుడు ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల షుగర్స్ ఎప్పుడూ తినకుండా, ఎప్పుడైనా ఒకసారి చక్కెర తినొచ్చు. ఈ సీజన్​లో మామిడి తినొచ్చు. ఇలా తింటే లాంగ్​ రన్​లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. షుగర్స్​ని ఎప్పుడూ కంట్రోల్​లో ఉంచుకోవాలి. కనీసం మూడు నెలలు కంట్రోల్​లో ఉండాలి. యావరేజ్​ షుగర్​ రేంజ్​ కంటే లోపల ఉంటే ఎప్పుడైనా ఒకసారి చక్కెర తిన్నా పర్లేదు. కాబట్టి అలాంటివి తినాలి అంటే షుగర్​ని మూడు నెలలు కంట్రోల్​లో ఉంచుకోవాలి. అప్పుడు డైట్​ కూడా కొంచెం మార్చొచ్చు. అలాకాకుండా షుగర్​ ఉన్నప్పుడు స్వీట్స్, బిర్యానీ తింటే పెరిగే ఛాన్స్ ఉంది.

డైట్ కంట్రోల్..

ఒకవేళ షుగర్ ఉందని తెలిస్తే, డైట్​తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్సులిన్​ లేకుండా సరైన డైట్​, మెడిసిన్​ ద్వారా కొంతవరకు నార్మల్​ అవుతారు. కొంతమంది ఇన్సులిన్​ డోస్ తగ్గించమని కూడా డాక్టర్ల దగ్గరికి వస్తుంటారు. షుగర్ నార్మల్​ అవ్వక కాంప్లికేషన్స్ ఉన్నవాళ్లకు పుట్టిన శిశువు​ పై ప్రభావం పడుతుంది. వాళ్లకు నేరుగా డయాబెటిస్​ రాకపోవచ్చు. కానీ, వెయిట్​ ఎక్కువ ఉండొచ్చు. వేరేదైనా కాంప్లికేషన్​ రావొచ్చు. డయాబెటిస్​ ఉందని తెలిసినా, సరైన డైట్ ఫాలో అవ్వకపోతే ఇలాంటివన్నీ వస్తాయి. అందువల్ల డెలివరీ టైంలో రిస్క్​ లేకుండా ఉండాలంటే ముందుగా షుగర్ లెవల్స్ చూసుకుని, బిడ్డకు కావాల్సిన పోషకాలు ఇస్తూ డైట్ మెయింటెయిన్ చేయాలి.

పిల్లల్లో కూడా..

పిల్లల్లో కూడా డయాబెటిస్ వస్తుంది. అది టైప్​1 అయితే, పుట్టిన తర్వాత సంవత్సరంలోపు కనిపిస్తుంది. ఇది ఎర్లీ స్టేజ్​ అంటారు. టైప్​ 2 అయితే, 25 ఏండ్ల దాటిన వాళ్లలో కనిపిస్తుంది. ఇది డైట్​ మెయింటెనెన్స్​ లేకపోవడం, ఒబెసిటీ, స్ట్రెస్​ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. పిల్లల్లో టైప్​1 గుర్తించడం చాలా ముఖ్యం. షుగర్​ వల్ల పిల్లలు అనారోగ్యంగా ఉన్నారనే విషయం చాలామంది తల్లిదండ్రులు కనుక్కోలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టైప్​ 1 డయాబెటిస్ చాలా కామన్​ అయిపోయింది. ఇదివరకు రోజుల్లో టైప్​ 2 డయాబెటిస్​ 40 ఏండ్లు దాటాక వచ్చేది. కానీ, ఇప్పుడు 15 ఏండ్లు దాటిన పిల్లల్లో కూడా వస్తోంది. ఎందుకంటే, ఎగ్జామ్స్ వల్ల ఒత్తిడి ఎక్కువ కావడం, యాక్టివిటీస్​ తగ్గిపోవడం, గంటలు తరబడి క్లాస్​ రూమ్​ల్లో, సిస్టమ్​ ముందు కూర్చోవడం వల్ల త్వరగా కనిపిస్తోంది. ప్యాండెమిక్​ టైంలో టైప్​ 2 డయాబెటిస్​ కేసులు చాలా వచ్చాయి. ఇదంతా దేనివల్ల అంటే... లైఫ్ స్టైల్ మార్పులు, సరైన టైమింగ్స్ లేకపోవడం వల్ల డయాబెటిస్ లేకపోయినా ఎర్లీగా సింప్టమ్స్ కనిపిస్తున్నాయి.

ALSO READ: డయాబెటిక్ పేషెంట్స్ ఇన్సులిన్ పెన్ తో ఇంజక్షన్ చేసుకోవడం చాలా ఈజీ

చిన్నపిల్లల్లో టైప్1 కనిపించినప్పుడు వెంటనే గుర్తించి, సరైన డైట్ అందించాలి. అయితే, చాలామంది పేరెంట్స్ డయాబెటిస్ ఉందనగానే భయపడతారు. అందుకని ముందు వాళ్లకి అవగాహన కల్పించాలి. పిల్లలకు ధైర్యం చెప్పాలి. వాళ్లని ఎంకరేజ్​ చేసి, సరైన ఫుడ్​ ఇవ్వాలి. ఇలా చేస్తే, టైప్​1 డయాబెటిస్​ని కూడా వాళ్లు మెయింటెయిన్ చేయొచ్చు.

కొందరు పిల్లల్లో ఆకలి తక్కువగా ఉంటుంది. దానివల్ల పిల్లలు టైంకి తినాల్సింది కూడా సరిగా తినరు. దాంతో లో–షుగర్స్​ అయ్యి కీటోఎసిడోసిస్ వస్తుంది. అప్పుడు లివర్​ ఎఫెక్ట్​ అవుతుంది. ఆ కండిషన్​ రాకుండా ఉండాలంటే ఇన్సులిన్​ డోస్​కు తగ్గట్టు సరైన డైట్​ ఉండాలి. ఆ డైట్​లో షుగర్స్, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేలా జాగ్రత్తపడాలి. మిగతా ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ పిల్లల ఏజ్​కి తగ్గట్టే అందించాలి.

ఏం తినాలి?  

ఏ రకం అయినా..

జెస్టేషనల్, టైప్​1, 2... ఏ రకం డయాబెటిస్​ అయినా డైట్ ఒకటే ఉంటుంది. తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు తినడం. కాకపోతే ఒక్కో మనిషికి ఒక్కోలా ఉంటుంది. వాళ్ల యాక్టివిటీస్​, స్ట్రెస్​ లెవల్స్​, లైఫ్ స్టైల్​ని బట్టి డైట్​ ఉంటుంది. బేసిక్​ రూల్​ ఏంటంటే... టైప్1 లేదా2 ఏదైనా ప్రతి మూడు లేదా నాలుగ్గంటలకు ఒకసారి తినాలి. అది కూడా తక్కువ మోతాదులో తినాలి.

  • డయాబెటిస్​ ఉన్నప్పుడు టైంకి తినడం చాలా ముఖ్యం. బ్రేక్​ఫాస్ట్, లంచ్​, డిన్నర్​ టైంకి తినాలి. అలాగే పొద్దున లేవగానే ఒక స్పూన్​ మెంతి పొడిని నీళ్లలో కలుపుకుని తాగడం చాలా మంచిది. లైఫ్ స్టైల్, ఓపికను బట్టి రోజూ వాకింగ్​, ఎక్సర్​సైజ్ చేయాలి. ఆ తర్వాత ఉదయం ఏడుగంటలకు గ్రీన్​ టీ తాగొచ్చు.
  • ఉదయం ఎనిమిది గంటల్లోపు బ్రేక్​ఫాస్ట్​ చేయాలి. అందులో ఫైబర్​ ఉండాలి. అప్పుడు రోజంతా షుగర్​ని కంట్రోల్​ అవుతుంది. పొట్టుతో ఉన్న గింజలతో తయారుచేసిన ఇడ్లీ, దోశ, ఉప్మా, జొన్న రొట్టె, జొన్న జావ, ఓట్స్ వంటివి తినొచ్చు.
  • ఎక్కువగా మిల్లెట్స్​తో చేసిన ఫుడ్​ తింటే బెటర్. మొలకెత్తిన గింజలు, ఉడికించిన కోడిగుడ్డు తినొచ్చు.
  • మూడు గంటల తర్వాత అంటే... పదిన్నర కల్లా మళ్లీ ఏదో ఒకటి తినాలి. పండ్లు తినాలి. మజ్జిగ, నిమ్మరసం తాగాలి. కూల్​డ్రింక్స్, కొబ్బరి నీళ్లు తాగకూడదు. లిక్విడ్ డైట్​ చేసేవాళ్లైతే వీటిని తాగొచ్చు. మధ్యాహ్నం లంచ్​లో తెల్ల అన్నం కాకుండా బ్రౌన్​ రైస్, మిల్లెట్స్, జొన్న రొట్టె, చపాతీ తీసుకోవాలి. వాటితోపాటు కూర ఎక్కువగా తినాలి. ఎందుకంటే కూరగాయల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. షుగర్స్​ని బాగా మెయింటెయిన్​ చేస్తుంది. కాబట్టి, అన్నం లేదా రొట్టెకి రెండింతలు కూర ఉండేలా చూసుకోవాలి. నాన్​వెజ్​ తినేవాళ్లు చికెన్, మటన్​, చేపలు తినొచ్చు. వెజిటేరియన్స్​ పనీర్, మీల్ మేకర్​, సలాడ్స్ తినొచ్చు.
  • సాయంత్రం పూట నట్స్ తింటే చాలామంచిది. ఎందుకంటే 4 లేదా 5 గంటలప్పుడు షుగర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు పునుగులు, బజ్జీలు వంటివి తినడానికి ఇష్టపడతారు. కానీ, దానివల్ల షుగర్ లెవల్స్ మారే ప్రమాదం ఉంది. కాబట్టి, ఆ టైంలో బాదం, పిస్తా, వాల్​నట్ వంటివి తినాలి.
  • రాత్రిపూట 7నుంచి 8 గంటల మధ్య డిన్నర్ చేయాలి. డిన్నర్​ చేశాక రెండు గంటలు వాకింగ్, ఎక్సర్​సైజ్ చేయాలి. పడుకునే ముందు పాలు తాగితే మధ్య రాత్రి షుగర్స్​ తగ్గకుండా  ఉంటాయి.
  • డయాబెటిస్​ ఉన్నవాళ్లలో ఎనర్జీ తక్కువై, నీరసంగా అయిపోతుంటారు. అందుకని చాలామంది ఇన్​స్టంట్ ఎనర్జీ కోసం ప్రొటీన్ పౌడర్స్, చ్యవన్​ప్రాశ్​ వంటివి వాడతారు. అయితే, వాటిలో కూడా బెల్లం, తేనె వంటివి ఉంటాయి. కాబట్టి, ఇంగ్రెడియెంట్స్ చూసుకుని, సుక్రోజ్, అదనపు చక్కెర​ వంటివి లేకుండా చూసుకుని వాటినే వాడాలి.
  • అలాగే హార్లిక్స్​లో డయాబెటిస్ ప్లస్, షుగర్​ ఫ్రీ వంటివి తాగొచ్చు.  ​రైస్​, మైదా, బొంబాయి రవ్వ, రిఫైన్డ్​ ఫుడ్, పాస్తా వంటి రెడీ టు ఈట్​ ఫుడ్స్ తినకూడదు.  
  • లైఫ్​ స్టైల్​, యాక్టివిటీస్​, తిండి, నిద్ర వంటివి సరిగా లేకపోవడం అనేవి మనదేశంలో డయాబెటిస్​ ఎక్కువగా రావడానికి కారణం అవుతున్నాయి. అందుకే పిల్లలు అధిక బరువు ఉంటే చిన్నప్పుడే బరువు తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఫ్యామిలీ హిస్టరీలో షుగర్​ వ్యాధి ఉంటే ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే డయాబెటిస్​ రాకుండా కంట్రోల్ చేయడం కుదురుతుంది.

ఫ్యూచర్​లో రాకూడదంటే..

కొందరికి ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటిస్ కనిపించి, డెలివరీ తర్వాత నార్మల్​ అవుతుంది. కానీ, అది మళ్లీ 40–50 ఏండ్లు దాటాక కనిపించే అవకాశం ఉంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో కనిపిస్తుంది. అయినా, డెలివరీ తర్వాత నార్మల్​ అవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో పెరిగిన వెయిట్​ని కంట్రోల్​ చేసుకుని, టైంకి ఫుడ్ తీసుకుంటే 40 ఏండ్లు దాటాక కూడా ఎలాంటి ఎఫెక్ట్​ చూపించదు. చాలామంది డెలివరీ తర్వాత నిర్లక్ష్యం చేస్తారు. షుగర్​ అంత ఎక్కువ ఏం లేదు కదా అనుకుంటారు. కానీ, వాళ్లకు మళ్లీ 30–35 ఏండ్లు వచ్చేసరికి డయాబెటిస్​ కనిపించే అవకాశం ఉంది. అందుకని ప్రెగ్నెంట్​గా ఉన్నప్పుడు డయాబెటిస్​ వస్తే ఫ్యూచర్​లో మళ్లీ వస్తుందనేది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి.