హోంలోన్ కిస్తీకి  డబ్బుల్లేవా?..ఇలా చేస్తే బెటర్

హోంలోన్ కిస్తీకి  డబ్బుల్లేవా?..ఇలా చేస్తే బెటర్

బిజినెస్​ డెస్క్​, వెలుగు:  కరోనా, లాక్డౌన్ వల్ల చాలా మంది తమ ఉద్యోగాలు లేదా ఆదాయాన్ని కోల్పోతామనే భయంతో బతుకుతున్నారు. ఇది వరకే లక్షలాది మంది జాబ్స్​కు దూరమయ్యారు. బిజినెస్లు మూతబడ్డాయి. కొందరికి జీతాలు తగ్గాయి. హఠాత్తుగా జాబ్/బిజినెస్ కోల్పోవడంతో విపరీతమైన సమస్యలు వస్తున్నాయి. కరోనాకు ముందు హోమ్ లోన్లుతీసుకున్న వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నెల వాయిదాలు (ఈఎంఐ లు) చెల్లించలేపోతున్నారు. దీంతో బ్యాంకులు ఇంటిని జప్తు చేసే అవకాశాలు ఉన్నాయి.   హోమ్ లోన్లను  చెల్లించడం కష్టంగా మారితే ఏం చేయాలి ? ఇందుకు ఫైనాన్షియల్ ఎక్స్​పర్టులు కొన్ని మార్గాలు చెబుతున్నారు. వీటిలో ఒకటి లేదా అన్ని పద్ధతులను ప్రయత్నించవచ్చు.

మారటోరియం సదుపాయాన్ని వాడుకోవాలి

కరోనాతో జాబ్స్ కు దూరమైన వారిని, బిజినెస్ నష్టపోయిన వారిని ఆదుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఇటీవల మూడు నెలల మారటోరియం సదుపాయం కల్పించింది. హోమ్ లోన్లతో సహా అన్ని రకాల లోన్లకు ఈ సదుపాయం వర్తిస్తుంది. అంటే 90 రోజులపాటు ఈఐఎంలు కట్టకపోయినా డీఫాల్టర్ అయ్యే ప్రమాదం ఉండదు.  మారటోరియం ముగిశాక మాత్రం ఈఐఎంలను కట్టాల్సిందే. లోన్ల చెల్లింపును వాయిదా వేయడాన్ని మారటోరియం అంటారు. 

కంపెనీ ఇచ్చే డబ్బును ఉపయోగించండి

చాలా సంస్థలు తమ ఉద్యోగులను తొలగించేటప్పుడు నోటీసు పీరియడ్​కు సమానమైన మొత్తాన్ని చెల్లిస్తారు. అంటే ఒక జీతం అదనంగా వస్తుంది. ఉద్యోగాన్ని పోగొట్టుకుని, మీ కంపెనీ నుండి ఇలాంటి ప్రయోజనాన్ని పొందితే,  ఈ మొత్తాన్ని ఈఎంఐ లను చెల్లించడానికి ఉపయోగించుకోండి. ఈఐఎం కట్టనందుకు వేసే పెనాల్టీ భారం నుంచి తప్పించుకోవచ్చు. 

పీఎఫ్​ను వాడుకోండి

ఉద్యోగి జీతం నుంచి  ప్రతినెలా కొంతమొత్తం ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలోకి వెళ్తుందనే విషయం తెలిసిందే. హోమ్ లోన్ కిస్తీలను కట్టడానికి పీఎఫ్​ ఖాతా నుంచి కొత్త మొత్తాన్ని అడ్వాన్సుగా తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత రూల్స్ ప్రకారం  పీఎఫ్ ఖాతా డబ్బులో 75 శాతం లేదా లేదా మూడు నెలల బేసిక్ పే+డీఏ మొత్తాన్ని అడ్వాన్సుగా తీసుకోవచ్చు. మరో ఉద్యోగం వచ్చే దాకా ఈ డబ్బుతో సర్దుకోవచ్చు. అప్లై చేసిన మూడు రోజుల్లోపు మీ ఖాతాకు డబ్బు జమవుతుందని ఈపీఎఫ్ఓ చెబుతోంది. 

దగ్గరి వారి నుంచి అప్పు తీసుకోండి

కష్టకాలంలో స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకోవడం గురించి ఆలోచించవచ్చు. వాళ్లు వడ్డీ అడగరు కాబట్టి అదనపు భారం ఉండదు. మీకు డబ్బు ఎందుకు అవసరమో వాళ్లకు వివరించండి. సాయం దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 

ఇన్వెస్ట్​మెంట్లను వెనక్కి తీసుకోండి

కరోనా కష్టాల నుంచి గట్టెక్కడానికి సేవింగ్స్, ఎఫ్డీల వంటి ఇన్వెస్ట్​మెంట్లను వెనక్కి తీసుకోవచ్చు. ఇలా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని హోంలోన్ కిస్తీలకు ఉపయోగించవచ్చు. లోన్​ మొత్తాన్ని చెల్లించడానికి మొత్తం పొదుపు డబ్బును ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మరో తదుపరి ఉద్యోగం పొందే వరకు కట్టాల్సిన ఈఎంఐల కోసం అవసరమయ్యే డబ్బును పక్కనబెడితే చాలు.

బీమా పాలసీపై లోన్లు  

మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే.. దానిని కుదవబెట్టి లోన్ పొందవచ్చు. పాలసీయే సెక్యూరిటీ అవుతుంది కాబట్టి లోన్ రావడం ఈజీ. అంతేకాదు అన్సెక్యూర్డ్ లోన్ల కంటే  వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అంతేగాక, బీమా కంపెనీ నుంచి క్విక్ అప్రూవల్ వస్తుంది. ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయినందున డబ్బు త్వరగా చేతికి వస్తుంది.

మ్యూచువల్ ఫండ్లను అమ్మేయొచ్చు

ఇన్వెస్ట్​ చేసిన దానికంటే ఎక్కువ ఆదాయం ఇచ్చే  మ్యూచువల్ ఫండ్ మీకు ఉందా? జవాబు ‘అవును’ అయితే, హోంలోన్ కోసం దానిని అమ్మేయడం మంచిదే! ఇన్వెస్ట్​మెంట్ల విలువ పెరగడం ముఖ్యమే అయినా అప్పులను , లోన్లను వదిలించుకోవటం ఇంకా ముఖ్యం. ఇన్వెస్ట్​మెంట్లపై సంపాదించిన ఆదాయంతో పోలిస్తే లోన్ల వడ్డీయే ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేగాక హోంలోన్ చెల్లింపు ఆగిపోతే  క్రెడిట్ స్కోర్‌‌ తగ్గుతుంది. డిఫాల్టర్​గా మారితే మీ వివరాలన్నీ సిబిల్ , ఇతర క్రెడిట్ రేటింగ్ సంస్థలకు వెళ్తాయి. దీనివల్ల భవిష్యత్లో ఇతర బ్యాంకుల నుండి లేదా లెండర్ల నుండి అప్పులు , లోన్లు పొందడం కష్టమవుతుంది. లేట్, డిఫాల్ట్ ఫీజులు అదనంగా ఉంటాయి. దీనివల్ల లోన్ మొత్తం పెరుగుతుంది.