తెలంగాణలో ఇసుక, మట్టి, మొరం అక్రమ రవాణా దందాలు బంద్

తెలంగాణలో ఇసుక, మట్టి, మొరం అక్రమ రవాణా దందాలు బంద్
  • దందాలు బంద్! 
  • ఆగిన ఇసుక, మట్టి, మొరం అక్రమ రవాణా
  • ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు గప్​చుప్​
  • రంగంలోకి దిగిన ఆఫీసర్లు, పోలీసులు.. ఎక్కడికక్కడ కేసులు
  • మొన్నటిదాకా దగ్గరుండి దందా నడిపించిన కొందరు బీఆర్ఎస్​ నేతలు
  • ఇప్పుడు తమ టైమ్​ నడవడం లేదని సైలెంట్​

మహబూబ్​నగర్ / నెట్​వర్క్​, వెలుగు : కొత్త ప్రభుత్వం రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఇసుక, మట్టి, మొరం అక్రమ రవాణా దందా బందైంది. మొన్నటి దాకా వాగులు, వంకలు ఇలా దేన్నీ వదలకుండా ఇసుక, మట్టిని తోడేసిన అక్రమార్కులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. తెర వెనుక ఉండి రూ.కోట్లు దండుకున్న బీఆర్ఎస్ బడా నేతలు మన టైం కాదని దందాను ఆపేశారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో మైనింగ్​, రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు రంగంలోకి దిగి.. కేసులు పెడ్తుండడంతో ఇసుక మాఫియా గప్​చుప్​అయింది. ఎన్నికలకు ముందు వరకు ఇష్టమొచ్చినట్లు ఇసుకను తోడేసిన జేసీబీలు చెరువులు, వాగుల వెంట కనిపించడం లేదు. ఇసుక లోడ్లతో రయ్.. రయ్​మంటూ చక్కర్లు కొట్టిన వందల ట్రాక్టర్లు, టిప్పర్లు రోడ్డెక్కడం లేదు. 

జిల్లాల్లో ఎస్పీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ఇసుక, మట్టి మొరం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడినట్లు చర్చ జరుగుతున్నది. 
పాలమూరు జిల్లాలో అప్పుడు 40 ఊర్లలో తోడేశారురాష్ట్రంలో మరెక్కడా లేనంతగా  పాలమూరు జిల్లాలో  సుమారు 40 గ్రామాల నుంచి ఎన్నికల ముందువరకు ఇసుక అక్రమ రవాణా కొనసాగింది. బీఆర్ఎస్​ నేతలు కర్నాటక సరిహద్దులోని కృష్ణా మండలం మొదలుకొని ఏపీ సరిహద్దులోని అలంపూర్ వరకు  నిత్యం వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డారు. కృష్ణా, మిడ్జిల్ , మక్తల్ , మాగనూరు , మూసాపేట , జడ్చర్ల , చిన్నచింతకుంట, దేవరకద్ర తదితర మండలాల్లోని దుందుభి, ఊకచెట్టు వాగు నుంచి  హైదరాబాద్, రాయచూర్, నాగర్​కర్నూల్, వనపర్తి, గద్వాల, కర్నూల్ తదతర ప్రాంతాలకు ఇసుకను తరలించి కోట్ల రూపాయలు సంపాదించారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తెర వెనుక ఉండి, ఆఫీసర్లు, పోలీసులను మేనేజ్​చేస్తూ తమ అనుచరులను మాఫియాగా మార్చి ఈ అక్రమ దందా సాగించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీస్, రెవెన్యూ డిపార్ట్​మెంట్లకు కొత్త ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతోనే  ఇసుక మాఫియా ఒక్కసారిగా సైలెంట్​అయినట్లు తెలుస్తున్నది.

రాష్ట్రమంతా ఇదే సీన్​.. 

కాంగ్రెస్​ సర్కారు ఆదేశాలతో నల్గొండ జిల్లాలో మైనింగ్​ఆఫీసర్లు, పోలీసులు రంగంలోకి దిగారు. ఇసుకను అక్రమంగా తరలించే వెహికల్స్​ను దొరికినవి దొరికినట్లు సీజ్​ చేస్తుస్తున్నారు. కేసులు పెడ్తున్నారు. దీంతో అక్రమార్కులు భయపడుతున్నారు. శాలిగౌరారం మండలం పెరిక కొండారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్​ లీడర్లు వంగమర్తి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేసేవారు. తాజాగా ఇసుక మాఫియాకు చెందిన పలువురిపై  కేసుపెట్టి, ఓ జేసీబీని ఆఫీసర్లు సీజ్ చేయడంతో అక్రమార్కులు గప్​చుప్​ అయ్యారు. ఆఫీసర్లు, పోలీసుల హెచ్చరికలతో వేములపల్లి మండలం లక్ష్మీ దేవి గూడెం, రావుల పెంట, మిర్యాలగూడ మండలం తక్కెళ్ల పాడు, ఆలగడప ప్రాంతంలో మూసీ నుంచి ఇసుక దందాకు తాత్కాలికంగా బ్రేక్​ పడింది.

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి దగ్గర పాలేరు వాగు నుంచి బీఆర్ఎస్​ నేతలు ఇసుక దందా నడిపించేవారు. రోజూ కనీసం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తోలకాలు జరిగేవి. బీఆర్ఎస్​ వాళ్లతో కాకుండా ఇతరులతో ఇసుక తెప్పించుకుంటే పోలీసులు, మైనింగ్  ఆఫీసర్లకు సమాచారమిచ్చి ట్రాక్టర్లను పట్టించేవారు. ఇటీవల పోలీసుల నుంచి వార్నింగ్​ రావడంతో నాలుగు రోజులుగా వాగుల నుంచి ఇసుక తోలకాలు బంద్​పెట్టారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనూ ఇసుక అక్రమ దందా నిలిచిపోయింది. బూర్గంపహాడ్, చర్ల, మణుగూరు ప్రాంతాల్లోని ఇసుక ర్యాంపులు నాలుగైదు రోజులుగా 
నడవడం లేదు. 

కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, బీర్కూర్, బాన్సువాడ మండలాల్లో మంజీరా నది వెంట బీఆర్ఎస్​ నేతలు అక్రమంగా ఇసుక తవ్వి వందలాది ట్రాక్టర్లతో వివిధ ప్రాంతాలకు తరలించేవారు. ఎన్నికలు ముగిశాక ఒక్కసారిగా వాళ్లంతా  సైలెంట్​అయ్యారు. మూడు, నాలుగు రోజులుగా ఇసుక ట్రాక్టర్లు ఎక్కడా రోడ్డెక్కడం లేదు.

మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల ముందు వరకు ఆకేరు, పాలేరు వాగుల నుంచి బీఆర్ఎస్​ లీడర్ల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగింది. ఎలక్షన్​ టైంలో  పోలీసులు తనిఖీలను పెంచడం, మహబూబాబాద్, డోర్నకల్ ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడంతో ప్రస్తుతం ఇసుక అక్రమ రవాణా నిలిచిపోయింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు వాగు నుంచి, వేములవాడ మూలవాగు నుంచి అఫీషియల్ రీచ్ లు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల అనుచరులు కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేసేవారు. సిరిసిల్ల మానేరు క్వారీ నుంచి మాజీ మంత్రి అనుచరుడొకరు మల్లన్నసాగర్​ పేరుతో  రోజూ వందల టిప్పర్ల ఇసుకను హైదరాబాద్​ తరలించిన దాఖలాలున్నాయి. కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో ఈ దందాకు తాత్కాలికంగా బ్రేక్​ పడింది.

ఎమ్మెల్యే ఆదేశాలతో  ఇసుక డంపుల సీజ్

బాలానగర్, వెలుగు: జడ్చర్ల కాంగ్రెస్​ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి ఆదేశాలతో గురువారం మహబూబ్​నగర్​ జిల్లా రాజాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక డంపులను పోలీసులు, రెవెన్యూ అధికారులు   సీజ్​చేశారు. గత కొన్నేండ్లుగా అక్రమార్కులు దుందుభి వాగులోంచి ఇసుకను తోడి ఆయా గ్రామాల్లో డంపు చేసి, రాత్రి పూట వివిధ ప్రాంతాలకు తరలించేవారు. ఎమ్మెల్యేగా అనిరుధ్​రెడ్డి బాధ్యతలు తీసుకోగానే ఇసుక అక్రమ రవాణా కట్టడికి చర్యలు చేపట్టారు. ఆయన ఆదేశాలతో మండలంలోని  పలు డంపులు, మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు రాజాపూర్ ఎస్ఐ వెంకట్ రెడ్డి చెప్పారు. 

రిజర్వాయర్ల పేరుతో అమ్ముకునెటోళ్లు!

గత​ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని చెరువులను కొందరు బీఆర్ఎస్​ లీడర్లు చెరపట్టారు. పాలమూరు ప్రాజెక్టు పేరుతో వందలాది చెరువుల్లో మట్టిని తవ్వి  వాటి స్వరూపాన్నే మార్చేశారు. ప్రధానంగా మహబూబ్​నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నాగర్​కర్నూల్​నియోజకవర్గాల పరిధిలోని 900 చెరువుల నుంచి నల్లమట్టిని తవ్వి ఉదండాపూర్, కర్వెన, వట్టెం తదితర రిజర్వాయర్ల పేరుతో అమ్ముకొని రూ.వేల కోట్లు సంపాదించారు. కొందరు చోటా మోటా లీడర్లు ఇటుక బట్టీలకు అమ్ముకున్నారు. ప్రస్తుత సర్కారు ఆదేశాలతో ఈ మట్టి దందాను బంద్​ పెట్టేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. ఎక్కడెక్కడ ఒండ్రు మట్టి కోసం చెరువులను ధ్వంసం చేశారనే డేటాను పాలమూరు ఆఫీసర్లు మూడు రోజులుగా సేకరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఇప్పుడు చెరువుల వైపు కన్నెత్తి చూడడం లేదు.