ఆరోగ్యశ్రీ ప్యాకేజీల సవరణ ఇంకెప్పుడు?

ఆరోగ్యశ్రీ ప్యాకేజీల సవరణ ఇంకెప్పుడు?
  •     ఇప్పటికీ పన్నెండు ఏండ్ల కిందటి చార్జీలే 
  •     కమిటీలు వేసి కాలయాపన 
  •     పేరుకుపోతున్న బకాయిలు 
  •     ఆరు నెలలుగా చెల్లింపుల్లేవంటూ సీఈవోకు అసోసియేషన్ లేఖ

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ ప్యాకేజీల చార్జీల పెంపుపై రాష్ట్ర సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. హాస్పిటళ్ల యాజమాన్యాలు సర్వీసులు బంద్ చేసిన ప్రతిసారీ, వెంటనే ప్యాకేజీల చార్జీలు సవరిస్తామని చెబుతున్న సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఏండ్లు గడుస్తున్నా ఆ పని మాత్రం చేయడం లేదు. దీంతో12 ఏండ్ల కిందట నిర్ణయించిన చార్జీలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల, చార్జీల పెంపు డిమాండ్ తో 2019లో నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ హాస్పిటళ్లు సమ్మె చేశాయి. ఆరోగ్యశ్రీ సర్వీసులు అన్నీ బంద్ పెట్టాయి. దీంతో దిగొచ్చిన సర్కార్ ఇకపై రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేమెంట్స్ చేస్తామని, ప్యాకేజీల సవరణపై వెంటనే ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్ కమిటీని నియమిస్తామని హామీ ఇచ్చింది.

కానీ, ఈ హామీలు ఏవీ అమలు కాలేదు. చార్జీలు పెంచకపోగా, పేమెంట్స్ కూడా సకాలంలో ఇవ్వడం లేదు. దీంతో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించేందుకు ప్రైవేటు హాస్పిటళ్లు ఇబ్బంది పడుతున్నాయి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, జేహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పేషెంట్లను ఇబ్బందులకు గురి చేస్తున్నయి. ఆరోగ్యశాఖ మంత్రిగా హరీశ్‌‌‌‌‌‌‌‌రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం ఓఎస్డీ గంగాధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉస్మానియా, గాంధీ దవాఖాన్ల సూపరింటెండెంట్లు, ఆరోగ్యశ్రీ సీఈవో తదితరులతో చార్జీల పెంపుపై ఓ ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌ కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ ఇప్పటికీ పలుమార్లు సమావేశమై ప్యాకేజీల పెంపుపై చర్చించింది.

ఇటీవలే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే భవన్‌‌‌‌‌‌‌‌లో సమావేశమైన కమిటీ, దాదాపు అన్ని ప్యాకేజీల చార్జీలను పెంచాలని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న చార్జీల మీద కనీసం 40 శాతం నుంచి 100 శాతం వరకూ పెంచాల్సిన అవసరం ఉందని కమిటీలోని డాక్టర్లు సూచించినట్టుగా తెలిసింది. కానీ, ఈ సూచనలేవీ అమలుకు నోచుకోలేదు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, జేహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం ఉన్న ప్యాకేజీలు, వాటి చార్జీలను ఒకే రకంగా మార్చడంపై కూడా కమిటీ పలు సూచనలు చేసినట్టుగా తెలిసింది. 

6 నెలల బిల్లులు పెండింగ్ 

ఆరోగ్యశ్రీ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెల్లిస్తున్నామని సర్కార్ చెబుతుంటే, నెలల తరబడి బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ఆరోపిస్తోంది. ఒక్కో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు సుమారు 6 నుంచి 8 నెలల బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని, వాటిని రిలీజ్ చేయించాలని కోరుతూ వారం రోజుల క్రితం ఆరోగ్యశ్రీ సీఈవోకు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ హాస్పిటళ్ల అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ఓ లేఖ రాసింది. పేమెంట్స్‌‌‌‌‌‌‌‌ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏండ్లుగా కోరుతున్నామని, ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.

పేమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల చిన్న హాస్పిటళ్లు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాకేజీల సవరణ, ఆరోగ్యశ్రీ ఎంపానల్‌‌‌‌‌‌‌‌మెంట్ నిబంధనల సరళీకరణ తదితర ఐదు లాంగ్ పెండింగ్ సమస్యలను లేఖలో ప్రస్తావించారు. ఆరోగ్యశ్రీ కింద ఒక్కో నెలలో సుమారు వంద కోట్ల వరకూ పేమెంట్స్ ఉంటాయని, ఈ లెక్కన తక్కువలో తక్కువ రూ.600 కోట్ల వరకూ బకాయిలు పేరుకుపోయాయని డాక్టర్లు చెబుతున్నారు.