ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలి

ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలి

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ సవాల్ విసిరారు. 9వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సిరిపురం నుండి ప్రారంభమైన పాదయాత్ర రామన్నపేటలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి అనంతరం వాటిని విస్మరిస్తాడన్నారు. బీజేపీకి ఓట్లు వేయకున్నా కూడా కేంద్రం నుంచి నకిరేకల్ నియోజకవర్గానికి అధిక సంఖ్యలో నిధులను మంజూరు చేశామని చెప్పారు. తెలంగాణకు ఇచ్చిన నిధుల విషయంలో తాము చెప్పే లెక్కలు తప్పయితే... తన మీద కేసులు పెట్టుకోవాలన్నారు. నిధులకు సంబంధించిన వివరాలను ఆయన ప్రజలకు తెలియచేశారు.

రామన్నపేటలో పేరుకే పెద్దాసుపత్రి...
ధర్మారెడ్డి కాలువ పనులను పూర్తి చేయలేదని వెల్లడించిన ఆయన రామన్నపేట లో పేరుకు మాత్రమే పెద్దాసుపత్రి.. అందులో డాక్టర్లు మాత్రం లేరన్నారు. 68 శాతం కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్న కృష్ణా జలాల్లో... తెలంగాణకు హక్కుగా రావాల్సిన 575 టీఎంసీలకు గాను 299 టీఎంసీలు మాత్రమే వచ్చేలా చంద్రబాబుతో కుమ్మక్కై ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రూ. 700 కోట్లు ఖర్చు చేస్తే... ఇక్కడున్న కొన్ని కాల్వలు పూర్తవుతాయన్నారు. రామన్నపేటలో రైళ్ల ను ఆపే విధంగా కేంద్రంతో మాట్లాడుతానని, రైల్వే జీఎం కు ఫోన్ చేసి మాట్లాడితే...రైళ్లను ఆపే విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దరఖాస్తు చేసినట్లు తనకు వెల్లడించారన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలంటూ టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేయడంపైనా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కో లీటర్ పెట్రోలుపై వ్యాట్ పేరుతో రూ.30లు దోచుకుంటున్న టీఆర్ఎస్ నేతలు పెట్రోలు ధరల తగ్గింపుపై ఆందోళన చేయడం సిగ్గు చేటన్నారు. కర్ణాటకలో తెలంగాణలో కంటే రూ. 13 తక్కువగా దొరుకుతుండడంతో అక్కడే డీజిల్ కొట్టించుకొని రావాలని తెలంగాణ ఆర్టీసీ శాఖకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి...
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కొడుకు, కూతురు పాల్గొన్నారా ? నకిరేకల్ నియోజకవర్గంలో ఎంతమందికి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారని ప్రశ్నించారు. తెలంగాణకు మోడీ 2.4 లక్షల ఇండ్లను మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చేనేత బీమా, ఇంటికో ఉద్యోగం, లక్ష రుణమాఫీ, దళితులకు 3 ఎకరాలు, దళితబంధు ఇలా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చింది బీజేపీనే అని, కేసీఆర్ వరి వేసి కోటీశ్వరుడు అయ్యాడన్నారు. ఆయన ఫార్మ్ హౌస్ కు నీళ్లు తెచ్చుకొనేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెట్టిండని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళ ద్రౌపది ముర్ముని ఓడించేందుకు కాంగ్రెస్ తో చేతులు కలిపారని విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు అధికారం ఇచ్చారు...ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. 

9వ రోజు పాదయాత్ర 12.5కిలోమీటర్ల మేర సాగనుంది. యాత్రలో భాగంగా బండి సంజయ్ ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసం చేపట్టే చర్యల గురించి వారికి వివరించనున్నారు. రాత్రికి మునిపంపుల వద్ద బండి సంజయ్ బస చేయనున్నారు.