
న్యూఢిల్లీ: మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ, బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ, ఆయన భార్య మరియా గోరెట్టి, మరో 57 ఎంటిటీలను ఒకటి నుంచి ఐదేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించింది. సాధనా బ్రాడ్‌కాస్ట్ (ఎస్‌బీఎల్) షేర్లు కొనమని తప్పుదోవ పట్టించే వీడియోలను చేసి, యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఇన్వెస్టర్లకు రికమండ్ చేసిన కేసులో బ్యాన్ విధించింది. అర్షద్ వార్సీ, మరియా గోరెట్టిపై ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఫైన్ విధించింది. ఈ జంటను ఒక ఏడాది పాటు సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించింది. సాధనా బ్రాడ్‌కాస్ట్ (ఇప్పుడు క్రిస్టల్ బిజినెస్ సిస్టమ్స్ లిమిటెడ్) ప్రమోటర్లతో సహా మరో 57 ఎంటిటీలపై 5 లక్షల నుంచి 5 కోట్ల రూపాయల వరకు పెనాల్టీలు వేసింది.
నిషేధంతో పాటు, ఈ 59 ఎంటిటీలు తప్పుడు పద్ధతుల్లో సంపాదించిన రూ. 58.01 కోట్ల లాభాలతో పాటు 12 శాతం వార్షిక వడ్డీ కలిపి(దర్యాప్తు సమయం ముగిసిన తర్వాత నుంచి పేమెంట్ డేట్ వరకు) తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అర్షద్ రూ.41.70 లక్షల ప్రాఫిట్, మరియా రూ.50.35 లక్షల ప్రాఫిట్ సంపాదించారని సెబీ పేర్కొంది. ఫైనల్ ఆర్డర్‌లో, ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మాస్టర్‌మైండ్స్ గౌరవ్ గుప్తా, రాకేష్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రా అని తేల్చింది. ఎస్‌బీఎల్ ఆర్‌టీఏ డైరెక్టర్ అయిన సుభాష్ అగర్వాల్, మనీష్ మిశ్రా, ప్రమోటర్ల మధ్య మీడియేటర్‌గా వ్యవహరించాడని ఆర్డర్ తెలిపింది.