ఇరాన్ సర్కార్ తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు

ఇరాన్ సర్కార్ తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు

ఇరాన్ లో హిజాబ్ ఇష్యూపై మొదలైన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ... దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ తో పాటు ప్రధాన నగరాల్లో ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ప్రభుత్వం, పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా మహిళలు, యువత నిరసనల్లో పాల్గొంటున్నారు. బహిరంగంగా జుట్టు కత్తిరించుకోవడంతో పాటు హిబాబ్ లు తగలబెడుతున్నారు. ఆందోళనలు అడ్డుకునేందుకు యత్నిస్తున్న సెక్యూరిటీ సిబ్బందితో మహిళలు ఘర్షణకు దిగుతున్నారు. వారం రోజుల క్రితం పోలీస్ కస్టడీలో 22 ఏళ్ల మాసా అమీని అనే మహిళ చనిపోయింది. ఆమె అంత్యక్రియల తర్వాత నుంచి జరుగుతున్న నిరసనల్లో 26 మందికి పైగా ఆందోళనకారులు, పోలీసు సిబ్బంది చనిపోయి ఉంటారని ఇరాన్ మీడియా తెలిపింది. ఐతే నిన్న ఒక్క రోజే 30 మంది బలైనట్టు సమాచారం. ఇప్పటివరకు ఆందోళనల్లో 50 మందికి పైగా చనిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు.

నిరసనలపై సర్కార్ ఉక్కుపాదం

హిజాబ్ ను సరిగా ధరించలేదన్న కారణంగా కుర్దిస్థాన్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన మాసా అమీనిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ యువతి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. దీంతో పోలీసులు, అక్కడి సర్కార్ తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. రోజు రోజుకు ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ ఘటనను UNO ఖండించింది. ఐతే పోలీసులు మాత్రం మహిళ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయిందని చెప్తున్నారు. ఇతర దేశాలు, తమ వ్యతిరేక శక్తులు ఇరాన్ లో ఆందోళనకారులను రెచ్చగొడుతూ గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం.. అక్కడి ప్రజలకు బయటి వారితో సంబంధం లేకుండా ఇంటర్ నెట్ సేవలపై ఆంక్షలు పెట్టింది. నిరసనలపై సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ర్యాలీలు, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ర్యాలీలు, నిరసనలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఇన్ స్టాగ్రాం, వాట్సప్ వంటి సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. 

హిజాబ్ లను బహిరంగంగా తగలబెడుతున్న మహిళలు

ఇరాన్ లోని 80 నగరాలు, పట్టణాల్లో నిరసనలు కొనసాగుతున్నాయని అక్కడి మీడియా చెబుతోంది. తమపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా మహిళలు తమ హిజాబ్ లను బహిరంగంగా తగలబెడుతున్నారు. కొంతమంది తలపై కప్పుకొని నిరసన తెలుపుతున్నారు. ఆందోళనల్లో మరికొంత మంది మహిళలు తమ జుట్టు కట్ చేసుకొని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమీని మరణం తర్వాత దేశంలో వేలాది మంది నిరసనకారులు, ఎక్కువగా మహిళలు వీధుల్లోకి వచ్చారు. ఇరాన్ లోని 80 ప్రధాన నగరాలతో పాటు పట్టణాలకు ఆందోళనలు వ్యాపించాయి. మషాద్, కుచాన్, షిరాజ్, తబ్రిజ్, కరాజ్ లలో నిరసనకారులను అడ్డుకునేందుకు యత్నించిన సమయంలో భద్రతా సిబ్బంది తీవ్రంగా యత్నించారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు చనిపోగా, చాలా మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఇరాన్ లో వ్యక్తిగత స్వేచ్ఛపై ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆంక్షలపై లోలోన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు అమీని మరణంతో వారి కోపం కట్టలు తెంచుకుంది. రోడ్లపై నిరసనల్లో పోలీస్ వాహనాలపై దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల నిప్పంటిస్తున్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం నుండి, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి.

హిజాబ్ ధరిస్తేనే ఇంటర్వ్యూ

ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా ఇంత స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నా.. ఆ దేశాధ్యక్షుడు మాత్రం పట్టు వీడడం లేదు. హిజాబ్ ధరించలేదనే కారణంతో మహిళా జర్నలిస్టులకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు నిరాకరించారు. UNO సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. అక్కడ ఇరాన్ కు చెందిన మహిళా జర్నలిస్టు క్రిస్టియానా అమన్ పూర్... ఇంటర్య్వూ ఇవ్వాలని ఇబ్రహీంను కోరారు. ఇంటర్వ్యూకు ముందు హిజాబ్ ధరించాలని ఇరాన్ అధ్యక్షుడి సిబ్బంది ఆదేశించారు. తాము న్యూయార్క్ లో ఉన్నామని, ఇక్కడ హిజాబ్ కు సంబంధించి ఎలాంటి ఆచారాలు లేవని అమన్ పూర్వివరించారు. హిజాబ్ ధరిస్తేనే ఇంటర్వ్యూ ఉంటుందని అధ్యక్షుడి సిబ్బంది చెప్పారు. తాము నో చెప్పడంతో ఇరాన్ అధ్యక్షుడి ఇంటర్య్వూ క్యాన్సిల్ చేసుకున్నారని అమన్ పూర్ వివరించారు.