
లాక్డౌన్ రోజుల్లో ఓ సినిమా చూసింది పులకిత హస్వి. అందులో హీరోలు పర్వతాలపై చేసే సాహసాలు, మంచులో ఎదుర్కొన్న సవాళ్లు థ్రిల్లింగ్‌గా అనిపించాయి. ఆ ఇన్స్పిరేషన్తో పదమూడేండ్ల వయసులో కిలిమంజారో ఎక్కింది. లఢఖ్‌లోని స్టాక్ కాంగ్రీ చేరుకొని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి చేరింది. ఈ ఇండిపెండెన్స్ డేకి ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన ఎల్ర్బస్పై మన జాతీయ జెండా ఎగరేసింది. సెవెన్ సమ్మిట్స్‌ని పూర్తి చేస్తానంటున్న ఈ చిన్నారి గురించి మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే..
‘‘మా సొంతూరు మంచిర్యాల. కానీ హైదరాబాద్‌లో సెటిలయ్యాం. నాన్న వెంకట్, అమ్మ మాధవి. చిన్నప్పట్నించీ ఆటలు ఆడటం అంటే బాగా ఇష్టం. అది గమనించిన అమ్మానాన్నలు ఆరేండ్ల వయసులో స్కేటింగ్ నేర్పించారు. అందులో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ కూడా గెలుచుకున్నా. బ్యాడ్మింటన్‌లోనూ టోర్నమెంట్లు ఆడా. సైక్లింగ్, రన్నింగ్, క్రికెట్.. ఇలా అన్నింట్లో ముందుండేదాన్ని కూడా. అయితే వీటన్నింటికీ కరోనా, లాక్డౌన్ వల్ల బ్రేక్ పడింది. ఆ టైంలోనే ‘ఎవరెస్ట్ ’ సినిమా చూశా. అందులో అడ్వెంచర్లు, అడుగడుగునా ఎదురయ్యే ఛాలెంజ్‌లు థ్రిల్లింగ్‌గా అనిపించాయి. వాటిని నేనూ ఎక్స్‌పీరియెన్స్ చేయాలనుకున్నా. సెవెన్ సమ్మిట్స్ ఎక్కాలనుకున్నా. ఇదే విషయం ఇంట్లో చెప్తే అమ్మానాన్నలు, అన్నయ్య ఎంకరేజ్ చేశారు. ఆ వెంటనే మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ప్రయాణం మొదలుపెట్టా.
ఎంత కష్టపడాలో చెప్పాయి
మౌంటెనీరింగ్‌కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు నాకు. దాంతో ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి బయల్దేరా. కానీ, ఆ ప్రయాణం నేను అనుకున్నంత తేలిగ్గా సాగలేదు. మేము ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సవడంతో బేస్ క్యాంప్‌కి ఒకరోజు ఆలస్యంగా చేరుకున్నాం. దాంతో రెండు రోజుల ట్రైల్‌ని ఒకేరోజు కవర్ చేయడానికి పదకొండు గంటలు నడిచాం. ఆ జర్నీలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి నాకు. అప్పుడే మౌంటెనీరింగ్‌కి శారీరకంగా, మానసికంగా ఎంత దృఢంగా ఉండాలో అర్థమైంది. అక్కడ ఎదురైన ఛాలెంజ్‌లే నా నెక్స్ట్ టార్గెట్ కిలిమంజారో కోసం నేను ఎంత కష్టపడాలో చెప్పాయి.
ఊహించిన దానికంటే..
కిలిమంజారో ఎక్కడానికి ఆరు నెలల ముందే చాక్లెట్స్, పిజ్జా, బర్గర్.. లాంటి జంక్‌ఫుడ్ మానేశా. క్యారెట్, బటానీ లాంటి న్యూట్రిషన్ ఫుడ్‌ను డైట్లో ఎక్కువగా ఉండేలా చూసుకున్నా. రోజుకు నాలుగు గంటలు ఫిట్నెస్ కోసం కేటాయించా. భుజాలకి, కాళ్లకి బరువులు కట్టుకుని.. రోజుకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు సైకిల్ తొక్కా. మెడిటేషన్ చేశా. కానీ, అక్కడి వాతావరణం మేము ఊహించిన దానికంటే దారుణంగా ఉంది. నాతో పాటు వచ్చిన ఏడుగురిలో నలుగురు వెనక్కివెళ్లిపోయారు. అయినా ధైర్యం కోల్పోలేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు వెళ్లాలనుకున్నా. నాలుగు రోజుల్లోనే కిలిమంజారోకి చేరుకున్నా. కానీ, ఆ సంతోషం కన్నా మిగిలిన ఆరు సమ్మిట్స్ పూర్తి చేయాలన్న ఆలోచనలే మనసులో నిండిపోయాయి. ఆ తర్వాత లఢఖ్‌లోని స్టాక్ కాంగ్రీ ఎక్కి, ఆ మరుసటి రోజు నుంచే ఎల్ర్బస్కి ప్రిపేర్ అయ్యా.
ఎల్ర్బస్ ఎక్కుతున్నప్పుడు మంచు పొగలా కమ్మేసింది. ఆక్సిజన్ లెవల్స్ తగ్గాయి. దాంతో కళ్ళు మసకబారాయి. ఒకానొక టైంలో టెంపరేచర్ –25 వరకు వెళ్లింది. కాళ్లు, చేతులు మొద్దుబారాయి. తీసుకెళ్లిన నీళ్లు గడ్డకట్టాయి. గాయాలయ్యాయి. అయినా ప్రయాణం ఆపలేదు.. ఆగస్టు 15న ఉదయం 5.30 గంటలకు ఎల్ర్బస్ వెస్ట్‌కి చేరుకున్నా, మరుసటి రోజు నాలుగున్నరకి తూర్పు నుంచి ఎక్కా. ప్రస్తుతం ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రిపేర్ అవుతున్నా’’ అని చెప్పింది మురికి పులకిత హస్వి.
‘‘పర్వతాలపై వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.. అలాగని త్వర త్వరగా సమ్మిట్ చేరుకుంటామంటే కుదరదు. ఆ వాతావరణానికి మన బాడీ అలవాటు పడాలంటే చిన్నగా నడవాలి. లేదంటే ఆ చల్లదనానికి తలనొప్పి, డీహైడ్రేషన్, వాంతులు లాంటి సమస్యలు వస్తాయి. వీటన్నింటికీ మానసికంగా ప్రిపేర్ కావాలి. ఆక్సిజన్ సప్లిమెంట్స్ తీసుకోకుండా సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేయాలన్నదే నా కోరిక. అలాగే అతి చిన్న వయసులో ఈ రికార్డు నా పేరుపై ఉండాలనుకుంటున్నా. నా మౌంటెనీరింగ్ ఎక్స్పీరియెన్స్లని హస్విమురికి. కామ్‌లో బ్లాగ్స్గా రాస్తున్నా. వీటన్నింటితో పాటు చదువుని బ్యాలెన్స్ చేస్తున్నా’’ అంటోంది హస్వి.
:::సురేశ్ చౌదరి, మంచిర్యాల, వెలుగు