సచ్చిపోయిన కాంగ్రెస్‌ను  కొన్ని మీడియా సంస్థలే లేపుతున్నయి :   ఎంపీ అర్వింద్​ 

సచ్చిపోయిన కాంగ్రెస్‌ను  కొన్ని మీడియా సంస్థలే లేపుతున్నయి :   ఎంపీ అర్వింద్​ 

మెట్ పల్లి, వెలుగు: ‘ పీనుగు ఎప్పుడైనా లేస్తదా...దేశంలో కాంగ్రెస్ ఎప్పుడో సచ్చిపోయింది. దాన్ని కొన్ని మీడియా సంస్థలు లేపడానికి ప్రయత్నాలు చేస్తున్నయ్​’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఎంపీ అర్వింద్​ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఆకాశం ఎప్పుడు మెరుస్తుందో..ఎప్పుడు పిడుగులు పడుతాయో... ఎవరిపైన పడతాయో... ఎవ్వరికీ తెల్వదు. కానీ పిడుగు పడితే మాత్రం షాక్​ కొడుతది..తెలంగాణలో ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతది’ అని అన్నారు. గతంలో బీజేపీకి అభ్యర్థులను వెతికేవారని ప్రస్తుతం తెలంగాణలో పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలు, అడ్వకేట్లు, మున్సిపల్​ చైర్​పర్సన్లు చేరుతుండడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలా అంటూ హై కమాండ్ తల పట్టుకుంటోందన్నారు.

తెలంగాణలో బీజేపీ చాప కింద నీరులా ఎదుగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది తాము కాదని, పీఎం మోడీ, జేపీ నడ్డా చేతుల్లో ఉందన్నారు. పనితీరు ఆధారంగా, ప్రజల్లో ఉన్న వారికి మాత్రమే టికెట్లు వస్తాయన్నారు. జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబార్ ప్రభాకర్, బోగా శ్రావణి, జిల్లా ఇన్​చార్జి చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, జిల్లా జనరల్ సెక్రెటరీ కారార్ల మధుకర్, సత్యనారాయణ , నవీన్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గౌడ్, నవీన్, కస్తూరి సత్యం , కౌన్సిలర్ మీనా, విజయ్, గౌతమ్, రఘు, శ్రీకాంత్, గంగాధర్ పాల్గొన్నారు.