విశ్లేషణ: సోనియా కాంప్రమైజ్ అవుతరా?

విశ్లేషణ: సోనియా కాంప్రమైజ్ అవుతరా?

పోరాటం ఏదైనా గెలిచేవారెవరూ కాంప్రమైజ్​ కారు. ఉదాహరణకు రష్యా - ఉక్రెయిన్ ​యుద్ధమే తీసుకుంటే.. ఎలాగైనా గెలుస్తానన్న ధీమాతో రష్యా అస్సలే వెనక్కి తగ్గడం లేదు. గాంధీలు(జీ-3), కాంగ్రెస్ సీనియర్(జీ-23)​నాయకులు మధ్య జరుగుతున్న పోరూ ఇలాగే కనిపిస్తోంది. గాంధీలు కాంగ్రెస్​పార్టీ కీలక బాధ్యతల నుంచి తప్పుకోవాలని సీనియర్​ లీడర్లు కొందరు బహిరంగంగానే డిమాండ్​చేస్తున్నారు. ప్రస్తుతం రాజీ చర్చలు జరుగుతున్నాయి. జీ 23 నాయకుల ప్రధాన డిమాండ్లు ఒప్పుకొని సోనియా రాజీకి ఓకే చెప్పినా.. అది పార్టీ ఎన్నికల వరకు, రాహుల్ ​పార్టీ అధ్యక్షుడు అయ్యే వరకు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు సోనియా వ్యూహ రచన చేస్తున్నారు.  

కాంగ్రెస్ చరిత్రలో ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి. 1938లో మహాత్మాగాంధీకి వ్యతిరేకంగా సుభాశ్​ చంద్రబోస్ చేసిన తిరుగుబాటు అత్యంత ముఖ్యమైనది. నెహ్రూ కాలంలో కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సి. రాజగోపాలాచారి 1959లో ఆ పార్టీని విడిచిపెట్టి స్వతంత్ర పార్టీని స్థాపించారు. 1969 ఇందిరా గాంధీ కాలంలో కాంగ్రెస్ చీలిపోయింది. సోనియా గాంధీ నాయకత్వంలోనూ శరద్ పవార్ తదితర నేతలు ఆమె నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. 2020 ఆగస్టులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియా గాంధీకి తమ నిరసన లేఖ రాసినప్పుడు, వారిని ఆమె పట్టించుకోలేదు. పట్టించుకోకుంటే సమస్య తీరిపోతుందని సోనియా గాంధీ ఆమె వర్గం భావించింది. అయితే రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ ఓటమి పాలు అవుతుండటం జీ-23 నాయకులకు బలం చేకూర్చింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి హుడా మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కానప్పటికీ, ఆయనే ఏకైక లీడర్​గా వ్యవహరించాడు”అని వ్యాఖ్యానించారు. కాగా ప్రియాంక గాంధీ ప్రవేశంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజవంశ పార్టీగా మారిపోయిందన్న విమర్శలు బలపడ్డాయి. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి మొన్నటి5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత జీ-23 నాయకులు గాంధీలపై విమర్శలు మళ్లీ పెంచారు.135 ఏళ్ల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను నాశనం చేస్తున్నారని, గాంధీలు పార్టీ పదవులన్నింటినీ వదులుకోవాలని సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. గాంధీలపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తాయి. జీ 23 నాయకులతో రాజీపడటమే సోనియా ముందు ఉన్న ఏకైక మార్గం. అందుకే ఆమె తన పీఠం నుంచి దిగి రాజీ చర్చలు ప్రారంభించారు. అయితే పంజాబ్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ విజయం సాధించినట్లయితే, సోనియా గాంధీ జీ-23 నాయకులను బహిష్కరించి ఉండేవారేమో. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది.10 సంవత్సరాల పాటు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై పూర్తి నియంత్రణతో అంతా తానై నడిపించారు. 2014లో నరేంద్ర మోడీ నాయకత్వానికే ప్రజలు పట్టం కట్టారు. ఆ ఎన్నికలు గాంధీలకు అధికారాన్ని దూరం చేశాయి. అప్పటి నుంచి అధికారానికి దూరంగా ఉండటం గాంధీలకు కష్టంగా మారింది. 

జీ-23 లీడర్లతో సోనియా చర్చలు ఎందుకంటే..

జీ23 నాయకులతో సోనియా మాట్లాడటం వెనుక కారణాలు లేకపోలేదు. వారందరూ ఎక్కువగా ఢిల్లీలో ఉన్న సీనియర్లే. వీరు దాదాపు 30 ఏండ్లపాటు అధికారంలో ఉండి జాతీయ స్థాయిలో పేరున్న నేతలు. ప్రాంతీయ నాయకులు తిరుగుబాటు చేస్తే, ఢిల్లీ రాజకీయ నాయకులు సహా మీడియా కూఆ వారిని పెద్దగా పట్టించుకోదు. కానీ జీ-23 నాయకులు మాట్లాడితే.. వారి వాయిస్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అంతేకాకుండా సోనియా గాంధీ వ్యూహాలు, ఆమె బలహీనతలన్నీ జీ 23 నాయకులకు తెలుసు. జీ23 లీడర్లు సరైన సమయం చూసి నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్​పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే జవాబుదారీతనం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ తప్పుకోవాలనే వారు డిమాండ్ చేయగా, ఇప్పుడు పార్టీ వైఫల్యాలకు ప్రియాంక గాంధీని బాధ్యురాలిని చేస్తున్నారు. కనీసం ఒక్క విజయం సాధించినా సోనియా జీ-23 నేతలను బహిష్కరించి ఉండేవారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌పై గాంధీలు పట్టు కోల్పోయే అవకాశం కూడా ఉందని సోనియాకు అర్థమైందని తెలుస్తోంది.

పార్టీ ఎన్నికల వరకే రాజీ?

రెండు వైపులా బలంగా లేకుంటేనే రాజీలు పని చేస్తాయి. రాహుల్ గాంధీని ఎలాగైనా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సోనియా గాంధీ భావిస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక, పార్టీ సభ్యులు రాహుల్ గాంధీని కోరుకుంటున్నారని సోనియా చెప్పవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగే వరకు మాత్రమే ఈ రాజీ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం జీ23 లీడర్లను డిమాండ్లను ఆమె అంగీకరించి పార్టీ అసంతృప్తులను శాంతింపజేయవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వరకు ఆమెకు సమయం కావాలి. ఆ తర్వాత రాజీలు ఏమీ ఉండే చాన్సే లేదు. సోనియా రహస్య వ్యూహం గురించి జీ-23 నేతలకు పూర్తిగా తెలుసు. అందుకే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూసేందుకు, పార్టీ ఎన్నికలకు ముందు కొత్త కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయాలని వారు కోరుతూ వస్తున్నారు.

రెండు మార్గాలు?

ప్రస్తుతం సోనియా గాంధీ రెండు సమాంతర మార్గాలను అనుసరిస్తున్నారు. ఒక మార్గం ఏమిటంటే.. జీ 23 నాయకుల దాడులను ఆపడానికి సోనియా వారితో రాజీకి దిగి వచ్చి చర్చలు జరుపుతున్నారు. రెండోది పార్టీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సోనియా, రాహుల్‌‌‌‌‌‌‌‌లు యథావిధిగా వారి వ్యూహం కొనసాగించడం. ఇలా మొత్తంగా గాంధీలు పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే వారి మద్దతుదారులు దూరమయ్యే అవకాశం ఉంది.  ఇది ఒక రకంగా సోనియా గాంధీకి ఎప్పుడూ ఊహించని పోరాటమే. కాగా జీ23 నాయకుల్లో చాలామంది అంతకుముందు ఆమె సన్నిహిత అనుచరులే కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం సోనియా తాత్కాలిక రాజీకి ఓకే చెప్పి దిగి వచ్చినా కూడా అది జీ -23 నాయకుల విజయమే అవుతుందనడం లో సందేహం లేదు. 

జీ-23 లీడర్ల డిమాండ్లు ఏంటి?

కాంగ్రెస్​ సీనియర్ ​లీడర్లు సమ్మిళిత నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఒక వేళ అలాంటి నాయకత్వం వస్తే.. రాహుల్, ప్రియాంక గాంధీలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేరు, వారికి నచ్చిన వారిని నియమించే అవకాశం ఉండదు. గాంధీల కీలక పవర్​పోయే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డును పునరుద్ధరించాలని, మోసాలను నిరోధించడానికి కేంద్ర ఎన్నికల కమిటీని కొత్తగా ఏర్పాటు చేయాలని జీ23 లీడర్లు కోరుతున్నారు. కాగా ఇవి చాలా తీవ్రమైన డిమాండ్లు. గాంధీల ఏకపక్ష అధికారాన్ని ఇవి తొలగించేలా ఉన్నాయి. పార్టీ జనరల్ సెక్రటరీ కె. వేణుగోపాల్ వంటి వారిని తొలగించాలని జీ-23 లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అలాంటి వారు పార్టీని గందరగోళానికి గురి చేశారని వారి ఆరోపణ. వీటితోపాటు ప్రధాన ప్రతిపక్షాలతో కాంగ్రెస్​ పొత్తులు పెట్టుకోవాలని కూడా జీ23 లీడర్లు కోరుతున్నారు. అంటే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తో పొత్తులు కోరుకునే మమతా బెనర్జీ, కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో కాంగ్రెస్ ముందుకువెళ్లాల్సి ఉంటుంది. కానీ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా మాత్రం అంగీకరించడం లేదు.
- పెంటపాటి పుల్లారావు
పొలిటికల్​ ఎనలిస్ట్