పీవోకేలో రెఫరెండం పెడతా: పాక్‌లో ఉండాలో వద్దో వాళ్లిష్టం

పీవోకేలో రెఫరెండం పెడతా: పాక్‌లో ఉండాలో వద్దో వాళ్లిష్టం

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) మనదేనని, భారత ప్రభుత్వం ఆదేశిస్తే దాన్ని సాకారం చేస్తామని ఇటీవలే ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ ఓ ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనూహ్యమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఉంటారో, లేక స్వతంత్రంగా ఉంటారో అజాదీ కశ్మీర్ (పీవోకే) ప్రజలనే డిసైడ్ చేసుకుంటారని అన్నారు. ఈ విషయంపై రెఫరెండం పెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జర్మనీకి చెందిన ఓ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. పీవోకేలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కావాలంటే అంతర్జాతీయ సంస్థలు వచ్చి పర్యవేక్షించవచ్చన్నారు.

అయితే వాస్తవానికి పీవోకే రాజ్యాంగంలో 1974లో నిబంధన పెట్టారు. ఆ ఏడాది అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా, ఓట్లేసినా వాళ్లు పాక్‌లో భాగంగా ఉండటానికి ఒప్పుకొన్నట్లేనని ఆ షరతు. పాకిస్థాన్‌కి లాయల్‌గా ఉంటానని అంగీకరించకపోతే యథావిధిగా వాళ్లపై హింస, వేధింపులు తప్పవన్న పరోక్షంగా చెప్పడమే ఇది.

అయితే పాక్ మిలటరీ చేస్తున్న అరాచాకాలను తట్టుకోలేక 2016లో పీవోకేలోని చాలా ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కావాలని ప్రజలు నినదించారు. గత ఏడాది ఇమ్రాన్ పీవోకే రాజధాని ముజఫరాబాద్‌లో పర్యటించినప్పుడు కూడా అక్కడి ప్రజలు గో బ్యాక్ అంటూ గళం విప్పారు. కశ్మీర్‌ను హిందుస్థాన్‌లో భాగంగా ఉండాలని కోరుకుంటున్నామని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా పీవోకేలో రెఫరెండానికి రెడీ అని ఇమ్రాన్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ, ఆయన ఆ మాటపై ఎంత మాత్రం నిలబడతారనేది ప్రశ్నార్థకం.