
- ఒక్కో ప్యాకెట్‌పై రూ. 43 చొప్పున పెరుగుదల.. రూ.810 నుంచి రూ.853కు ..
హైదరాబాద్, వెలుగు : పత్తి విత్తన ధరలు ఇంకింత పెరిగినై. ఒక్కో కాటన్ సీడ్ ప్యాకెట్‌పై రూ. 43 చొప్పున రేటు పెరిగింది. కిందటేడాది పత్తి ప్యాకెట్ ధర రూ. 810 ఉండగా.. 2023–24 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి పెరిగిన ధరతో కలుపుకొని రూ. 853కు చేరింది. దీనికి సంబంధించి తాజాగా వ్యవసాయ శాఖ గెజిట్ ను కూడా విడుదల చేసింది. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన మొత్తం 60 లక్షల ఎకరాలకు ఇంచుమించు1.20 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం పడ్తయ్.. ఒక్కో ప్యాకెట్‌పై రూ. 43 చొప్పున ధరను పెంచడంతో.. రాష్ట్ర రైతులపై మొత్తం రూ. 50 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది.
ఈవిధంగా ప్రతి ఏడాది పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు పెరుగుతుండటంతో.. రైతులకు పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడైతాంది. కార్పొరేట్ సీడ్ కంపెనీలు రైతుల నుంచి పత్తి విత్తనాలను సేకరించి, వాటిని గ్రేడింగ్ చేసి జర్మినేషన్ చెక్ చేసి ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నాయి. రైతుల నుంచి సీడ్ కంపెనీలు కొన్న పత్తి విత్తనాలు.. సీడ్ ప్యాకెట్ల రూపంలో తిరిగి రైతులకు చేరే సరికి భారీగా ధర పలుకుతున్నాయి. ఎకరానికి ఒకటిన్నర ప్యాకెట్నుంచి 2 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం అవుతుండడంతో రైతుల పెట్టుబడి ఖర్చులు బాగా పెరుగుతున్నయ్.
పత్తి అధికంగా సాగు చేసే మన రాష్ట్ర రైతాంగంపై విత్తన ధరల పెరుగుదల నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాంది. గత నాలుగేళ్ల లెక్కలే పరిశీలిస్తే.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.730గా పత్తి సీడ్ప్యాకెట్ ధర, ఇప్పుడు రూ.853కు చేరింది. అంటే నాలుగేళ్ల వ్యవధిలో రేటు రూ.123 మేర పెరిగింది. ప్రతి సంవత్సరం సగటున రూ.30 చొప్పున సీడ్ప్యాకెట్ల ధరలు పెరిగినై. ఈ ధరల నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టిసారించాలని రైతులు కోరుతున్నరు.