శాసనసభకు ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా..?

శాసనసభకు ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా..?

రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి, సవాళ్లు, ప్రతి సవాళ్లు చూస్తుంటే మరోసారి శాసనసభకు ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అనే అనుమానం కలుగుతుంది. 2023 నవంబర్ లో జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు పాలక, ప్రతిపక్షాల సవాళ్లతో ముందుగానే జరిగే రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికలకు ఒక తేదీని నిర్ణయించండి. రాష్ట్ర శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసరడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ వరంగల్ లో రాహుల్​గాంధీ ముఖ్య అతిథిగా రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తే, బీజేపీ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాదులో నిర్వహించింది. బీఎస్పీ, వైఎస్సార్ టీపీ పాదయాత్రలతో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. పాలక పక్షం టీఆర్ఎస్​కూడా ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మాదే అనే ధీమాతో రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. మోడీ ప్రభావంతో 2019లో శాసనసభకు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరిగితే రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించిన కేసీఆర్ 2018లోనే రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ ఇప్పుడు ముందస్తుపై టీఆర్ఎస్​సహా అన్ని పార్టీలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయే తప్ప.. ఏ ఒక్క పార్టీ కూడా అందుకు పూర్తిస్థాయిలో సమాయత్తం కాలేదనేది తెలుస్తోంది.

త్రిముఖ పోటీ తప్పదా
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు మూడోసారి జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు బలంగా పోటీపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన రెండు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య అధికారం కోసం పోటీ జరిగింది. కానీ వచ్చే ఎన్నికల్లో మూడో పక్షంగా బీజేపీ కూడా అధికారం కోసం తీవ్రంగా పోటీపడనుంది. దీంతో రాష్ట్రంలో మొదటిసారి బలమైన త్రిముఖ పోటీ ఉండనుంది. 2018 ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐలతో మహా కూటమి ఏర్పాటైంది. కానీ 2023 శాసనసభ ఎన్నికలకు మూడు పార్టీలు కూడా ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

వ్యూహకర్తలు గెలిపించగలరా?
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వ్యూహకర్తల ప్రస్తావన, ప్రమేయం లేదు. కానీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకున్నారు. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు రూపొందించడంలో అపార అనుభవం ఉన్న కేసీఆర్ కూడా తన పార్టీ గెలుపును సందేహించే.. దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకున్నారు. కాంగ్రెస్​ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సునీల్​కనుగోలును ఎన్నికల వ్యూహకర్తగా ఎంచుకుంది. రాష్ట్రంలో వైఎస్సార్ టీపీ కూడా ప్రియా రాజేందర్ ను వ్యూహకర్తగా నియమించుకుంది. బీజేపీ ప్రత్యేకంగా ఎవరినీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోకపోయినా మోడీ, షా వ్యూహాల గురించి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై వ్యూహకర్తల ముద్ర ఉండబోతోంది. 

మారాల్సింది ప్రభుత్వాలు  కాదు
పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం ఎదురు చూస్తుంటే, ప్రజలు మాత్రం ఎప్పటిలాగానే తమ సమస్యలకు ఎవరు పరిష్కారం చూపుతారా అని ఎదురుచూస్తున్నారు. 58 ఏండ్లు కొనసాగిన సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రజలు వెనుకబాటుతనానికి, వివక్షకు గురైంది. స్వరాష్ట్ర పాలనలోనైనా తమ బతుకులు మారతాయని ఆశించిన ప్రజలు ఇంకా నిరాశలోనే ఉన్నారు.ముందస్తు అయినా, మరే ఎన్నికలైనా మారాల్సింది ప్రభుత్వాలు మాత్రమే కాదు ప్రజల బతుకులు కూడా. 

- డా. తిరున హరి శేషు, పొలిటికల్ ​ఎనలిస్ట్